పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాపడు మొన్న మేరుగిరిపాటినిశాచరి నంత సేసె నే
డేపునఁ గట్టుబండి నిదె నిందఱు సూడఁగ నింత సేసె వీఁ
డోపిక ముందఱన్ బ్రతికియుండిన నెవ్వరి నెంత సేయునో.[1]

120

రామకృష్ణుల జాతకర్మ నామకరణాదిప్రశంసనము

వ.

అని యట్లు సల్లాపంబులు చేసి రంత వసుదేవుడు నిజపురోహితుఁ డయినగర్గు
రావించి తనపుత్రు లైనరోహిణీదేవకీనందరులకు నామకరణంబులు సేయుటకు
నియోగించి నందగోకులంబునకుఁ బంచిన.

121


క.

గర్గుఁడు పరి వేష్టితముని, వర్గుఁడు సంపాదితాపవర్గుఁడు భవనై
సర్గుఁడు పరతత్వకళా, మార్గుఁడు చనుదెంచె నందుమందిరమునకున్.[2]

122


వ.

వచ్చి యభ్యాగతవ్యాజంబున యశోదానందులం బొడగాంచి యెవ్వరు నెఱుం
గకుండ వసుదేవనందను లిరువురకు జాతకకృత్యంబులు నిర్వర్తించి రోహి
ణీనందనునకు రామనామంబును దేవకీనందనునకుఁ గృష్ణావధానంబును జేసి
పోయె నంత.[3]

123


క.

ఆరామకృష్ణు లిరువురు, గారామున నందగోపకవ్రజమున నొ
ప్పారుచు నాసితనీలశ, రీరంబులతోడఁ బెరిగిరి ముదం బొప్పన్.[4]

124


సీ.

ఉయ్యాలతొట్టిలో నునిచి చేతులు పట్టియూఁచి యాడెడు పాట నుబ్బ నేర్చెఁ
బసిఁడికుందియనలోపలఁ బట్టుపొత్తులయొత్తున నొఱగి కూర్చుండ నేర్చె
నించు కించుకదూర మిందు రమ్మని పిల్వ నల్లనల్లన దోఁగియాడ నేర్చె
వ్రేలు చేతికి నిచ్చి విద్దెంబు లాడంగ నిలిపిన గొంకుచు నిలువ నేర్చె


తే.

వేడ్క మాటల విందులు విందు లనుచుఁ, బిలిచి చేచాఁప నడుగులు పెట్ట నేర్చెఁ
దల్లిదండ్రులమనములు పల్లవింపఁ, గృష్ణుఁ డొప్పారె శైశవక్రీడలందు.[5]

125


వ.

మఱియు నానందనందనుండు రోహిణినందనసమేతుండయి యథాకాలంబుల

  1. మేరుగిరిపాటి = మేరుపర్వతమంత, అంత సేసెన్ = అంతటియవస్థను పొందించెను - చంపె ననుట, కట్టుబండిన్ = గృహోపకరణము లుంచుకొనెడుబండిని, ఓపికన్ = సమర్థతచేత, ముందరన్ బ్రతికియుండినన్ ఓపికన్ ఎవ్వరి నెంత సేయునో యని యన్వయము.
  2. పరివేష్టితమునివర్గుఁడు = చుట్టుకోఁబడిన మునిసమూహము గలవాఁడు, సంపాదితాపవర్గుఁడు = సంపాధింపబడినమోక్షము గలవాఁడు- మోక్షమును పొందఁగలవాఁ డనుట, భవనైసర్లుఁడు = శివస్వభావము గలవాఁడు - శివునిఁ బోలినవాఁ డనుట, పరతత్వకళామార్గుఁడు = పరతత్వవిద్యయొక్క మార్గమును తెలిసినవాఁడు.
  3. అభ్యాగతవ్యాజంబునన్ =తనంతట ఇల్లు వెదకుకొని వచ్చినయతిథియను నెపముచేత, నిర్వర్తించి = జరిపి.
  4. గారామునన్ = గారాబముతో.
  5. ఉబ్బన్ = సంతోషింప, కుందియనలోపలన్ = కూర్చుండ నేరని పసిబిడ్డలు కూర్చుండుటకై ఒకతట్టు దారి యేర్పఱచి చేయబడిన తొట్టిలో, పొత్తులయొత్తునన్ = పొత్తిగుడ్డలయొక్క ఒత్తుడుచేత, విద్దెంబులు = వెలికిల పండుకొని కాళ్లయడుగులను బిడ్డల కడుపున కానించి పైకెత్తి దించి యాడించునాటలు, కొంకుచున్ = బెదరుచు, శైశవక్రీడలందున్ = పసిబిడ్డల యాటలయందు.