పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గిన నాఘోషంబు ఘోషంబున కెల్ల నత్యంతవిభీషణంబయ్యె నప్పు డచ్చటివార
లాబాలగోపాలంబుగా వచ్చి చూచి ఱిచ్చలువడియుండి రంత.[1]

139


ఆ.

పెద్దఱోలితోడ బిగువు దామెనతోడఁ, బడినమద్దిచెట్లనడుమ ముద్దు
లైనతొక్కుఁ బలుకులాడుచు నిలుచున్న, కపటబాలుదుండగములు చూచి.[2]

140


ఉ.

గోపిక లయ్యశోదకడకుం జని నీతనయుండు వాఁడె నే
డాపెనుమద్దిమ్రాఁకుల రయంబునఁ బెల్లగిలంగఁ ద్రోచినాఁ
డీపసిబిడ్డ దయ్యము సుమీ యని పల్కిన యామృగాక్షి యు
ద్దీపితశోకసంభ్రమవిధేయమతిన్ బఱతెంచి గ్రక్కునన్.[3]

141


వ.

ఉలూఖలంబులతోడఁ గట్టువడియున్న బాలకృష్ణుని యుదరబంధం బైనదామం
బు విడిచి యెత్తుకొని యక్కునం జేర్చి మూర్ధాఘ్రాణంబు చేసి యానందబాష్ప
ధారాసారంబున నతని నభిషేకించె నిట్లు దామం బుదరబంధనం బగుటంజేసి
కృష్ణుండు దామోదరుం డనంబరఁగె నప్పుడు.[4]

142

నందాదిగోపకులు రామకృష్ణసమేతులై బృందావనంబునకుఁ బోవుట

క.

వారక యందఱుఁ జూడఁగ, ధారుణిపై మద్ది చట్లు తమయంతన ని
ష్కారణము విఱిగిపడు టా, భీరవరుల్ చూచి భయము పెద్దయుఁ గదురన్.[5]

143


క.

నా డర్ధరాత్రి పూతన, పోడిమి చెడె మొన్న బండి పొరలఁగఁబడియెన్
నే డిదె యీమద్దులకును, మూఁడెను నిష్కారణంబు మూలాగ్రముగన్.[6]

144


తే.

ఇంక నిచ్చోట నుండిన నేమికీడు, పుట్టునో యొండుచోటికిఁ బోవవలయుఁ
బూరియును నీరుఁ గడుఁ బరివోయెఁ బసులు, కందుచున్నవి మనకేల యిందునుండ.[7]

145


చ.

తొలుకరివానలుం గురిసి తోరపుఁబూరియుఁ దేటవారియున్
గలిగిన నెంతయున్ గుబురుకానలు వానలు లేకయుండినన్
కొలమున నెమ్మెయిన్ బసరముల్ చెడ వెన్నఁడు నెల్లి యాలగుం
పుల గదలించి బృందకును బోద మటంచు వినిశ్చితాత్ము లై.[8]

146
  1. యమళార్జునంబులు = జంటమద్దిచెట్లు, ఘోషము = ధ్వని, గొల్లపల్లె, భీషణంబు = భయంకరము, కిచ్చలువడి = చేష్టలు దక్కినవారై.
  2. తొక్కు బలుకులు = వచ్చి రాని మాటలు.
  3. ఉద్దీపితశోకసంభ్రమవిధేయమతిన్ = మిక్కిలి యతిశయించిన దుఃఖమునకును తొట్రుపాటునకును లోఁబడినమనసు గలదై.
  4. ఉదరబంధంబు = నడుముకట్టు, దామంబు = దామెన, అక్కునన్ = ఱొమ్మునందు, అపారంబునన్ = ఎడతెగనివానచేత.
  5. నిష్కారణము = కారణము లేక, ఆభీరపరులు = గొల్లదొరలు, పెద్దయున్ = మిక్కిలి, కదురన్ = కలుగఁగా.
  6. పోఁడిమి చెడెన్ = చచ్చె ననుట, మూఁడెను = కీడు కలిగె ననుట, మూలాగ్రముగన్ = తుదముట్ట.
  7. పరివోయెన్ = కొల్లపోయెను - తగ్గిపోయె ననుట, కందుచున్నవి = కృశించుచున్నవి.
  8. తొరవు = అధికమైన, ఎల్లి = రేపు.