పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అంత కంసాసురుండు శుద్ధాంతమందిరంబునకుం బోయి దేవకీవసుదేవుల రావించి
మిథ్యావినయంబున నిట్లనియె.[1]

93


చ.

కటకట మిమువంటి గుణగణ్యుల బుణ్యులఁ జెప్పరానిసం
కటములఁ బెట్టి యెట్టికొఱగాములు చేసితిఁ బెక్కు నాకు నీ
కిటుకున నేమి మేలు గలిగెన్ సుతులందఱుఁ జచ్చి రంచు ము
చ్చట చెడి వంత నొందకుఁడు సర్వము దైవముసేఁత గావునన్.[2]

94


వ.

అని యాశ్వాసించి వారల కారాగృహనిరోధంబు మాన్పి యుద్విగ్నచిత్తుఁ డై యుండె.[3]

95

వసుదేవుఁడు శ్రీకృష్ణునిఁ జూడ గోకులంబునకు వచ్చుట

క.

వసుదేవుఁ డంతఁ దనబా, లసఖుం డగునందుగోకులమునకుఁ జనియిం
పెసలార గోపగోపీ, విసరంబులు సంతసిల్ల వేడుకతోడన్.[4]

96


క.

నందునిఁ బుత్రవిభూతిము, కుందుని సేవావిధేయగోపాలజనా
నందునిఁ గరుణారసని, ష్యందునిఁ బొడగాంచె నధికసంభ్రమ మొదవన్.[5]

97


వ.

కని యతనిచేతఁ దగుతెఱంగున సంభావితుండై యావృద్ధగోపదంపతులు సంత
సిల్లి మానుషవేషంబు ధరించి యున్నకపట బాలకునిఁ దనచేతి కిచ్చిన నెత్తుకొని
ముద్దులాడుచు వారి కిట్లనియె.[6]

98


మత్తకోకిల.

మీకుఁ గల్గిన భాగ్యదేవత మిమ్ము ధన్యులఁ జేయఁగా
నీకుమారునిఁ దెచ్చి ముప్పున నిచ్చె నీతనిఁ జూచినన్
నాకు నైనను బుత్రమోహము నాటియున్నది యిట్టియ
స్తోకపుణ్యుఁడు ముద్దుసేఁతలఁ జొక్కఁజేయఁడె మీమతుల్.[7]

99


ఆ.

ఇతనిఁ జూచి మీకు నెంతమోహము గల, దంతకంటె మాకు నధిక మైన
మోహరసము మూరి మోచియున్నది యీకు, మారుఁ డొక్కరూప మాకు మీకు.[8]

100
  1. శుద్ధాంత = అంతఃపురమునందలి.
  2. కొఱగాములు = అకృత్యములు, కిటుకునన్ = అకృత్యముచేత ననుట, వంతన్ = సంతాపమును, చేఁత = కృత్యము.
  3. ఆశ్వాసించి = ఊఱడించి, నిరోధంబు = నిర్బంధము, ఉద్విగ్నచిత్తుండు = వేదననొందినమనసుగలవాఁడు.
  4. గోకులమునకున్ = గొల్లపల్లెకు, ఇంపెసలారన్ = ప్రియము అతిశయింపఁగా, విసరంబులు = సమూహము.
  5. పుత్రవిభూతిముకుందునిన్ = పుత్రసంపదయైన విష్ణుమూర్తి గలవానిని, విధేయ = అడఁకువగల, నిష్యందునిన్ = జాఱుట గలవానిని, సంభ్రమము = త్వర.
  6. సంభావితుండు = గౌరవింపఁబడినవాఁడు.
  7. ముప్పునన్ = ముసలితనమునందు, నాకునైనను = నాకుఁగూడ, ఆస్తోక = అల్పముగాని, ముద్దుసేఁతలన్ = ఇంపు పుట్టించునట్టి చేష్టలచేత, చొక్కన్ = పరవశత నొంద.
  8. మూరి = మీఱి, మోచి = అంటి.