పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్రుక్కి మనంబులోనఁ గడుశూరతయున్ బలమున్ బ్రతాపమున్
మొక్కలువోవఁగాఁ గొలువు మోసలలోనికి, బోయి మంత్రులన్
దక్కినవారుఁ గొల్వ వెడదండితనంబున నుండి యుధ్ధతిన్.[1]

85


వ.

తనకుం బరమాప్తు లైనపూతనారిష్టప్రలంబకేశిధేనుకాదు లైనరక్కసులం
బిలిపించి సవినయంబుగా నిట్లనియె.

86


చ.

వినుఁ డసురేంద్రులార నెఱవీరుఁడనై జగమెల్ల నేలుచున్
ఘనమహిమం జెలంగుననుఁ గయ్యములోన వధించుయత్నముల్
పనివడి చేసినారఁట సుపర్వులు నేను శ్రుతాశ్రుతంబుగా
నొనరఁగ వింటి నాకడిమి కోర్వఁగ నెంతటివారు దేవతల్.[2]

87


తే.

మీ రెఱుంగరె వజ్రి నామీఁద వచ్చి, వేయిమాఱుల దాఁకను వీ స్వపోట్ల
తోడఁ బాఱుట లిటువంటి తులువ వచ్చి, సిగ్గుచెడ కిఁక నేరీతిఁ జెనకునొక్కొ.[3]

88


తే.

బ్రహ్మవిష్ణుమహేశ్వరప్రభృతులైన, దివిజవర్గంబు నాకును దృణకణాయ
మాన మటువంటి పటువిక్రమప్రతాప, శాలి యగునాకు నెదురె యీజగతి నొరులు.[4]

89


క.

బంధురయశుఁ డైనజరా, సంధుం డొకరుండు తక్క సమరంబుల గ
ర్వాంధు లగునృపపిశాచపు, టింధనములు నిలువఁగలవె యే ననుశిఖికిన్.[5]

90


ఉ.

కావున నన్ను మార్కొన జగంబుల నెవ్వఁడు లేఁడు నేడు మా
దేవికి గన్నబిడ్డ ననుఁ దిట్టుచు న న్ననిఁ జంప నెవ్వఁడో
దేవుఁడు బాలుఁడై వసుమతిన్ జనియించినవాఁ డటంచు నా
తో వివరించిపోయె నిది తొల్లియు నారదుచే నెఱింగితిన్.[6]

91


ఉ.

 మీరిఁక నేటనుండియును మేదినిలోఁ గలపిన్నబిడ్డలన్
వారక చంపుఁ డంచు బలవంతులఁ దెంపునఁ బంపు వెట్టినన్
వారలు బెక్కురూపముల వచ్చి శిశుప్రకరంబునెల్ల సం
హారము చేయుచున్ రుధిర మానిరి మానిరి పుణ్యకర్మముల్.[7]

92
  1. ఏటు = బాణప్రయోగముదెబ్బ, స్రుక్కి = డస్సి - పౌరుషము పోయినవాఁడై, మొక్కలువోవఁగాన్ = వ్యర్థము లైపోఁగా, కొలువు మోసలలోనికిన్ = కొలువుకూటము ముందరిచావడిలోనికి, వెడదండితనంబునన్ = అల్పపౌరుషముతో.
  2. నెఱవీరుఁడను = మహాశూరుఁడను, పనివడి = పూని, సుపర్వులు = దేవతలు, శ్రుతాశ్రుతంబుగా = వినీవిననట్టు - జాడగా ననుట, ఒనరఁగన్ = యుక్తముగ, కడిమికిన్ = పరాక్రమమునకు.
  3. వజ్రి =- ఇంద్రుఁడు, చెనకునొక్కొ = ఎదిరించునో.
  4. తృణకణాయమానము = గడ్డిపోఁచను పోలినవారు.
  5. ఇంధనములు = సమిధలు, శిఖికిన్ = ఆగ్నికి.
  6. వివరించి = విశదవఱచి - చెప్పి యనుట.
  7. వారక = సంకోచింపక, పంపు వెట్టినన్ = ఉత్తరువు చేసి పంపఁగా, అనిరి = త్రాగిరి.