పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

గొల్లపల్లియలో నున్నగొల్లవారు, చొక్క చల్లినకైవడి నొక్కరైన
మేలుకొనక నిద్రింప నామేటి యపుడు, తిరిగి చెఱసాలలోని కేతెంచియుండె.[1]

76


ఉ.

కావలివారు మేలుకొని కంసునిపాలికిఁ బోయి దేవకీ
దేవి ప్రసూతియయ్యె నని తెల్పిన వాఁడును నిప్పుద్రొక్కిన
ట్లై వెసఁ బాఱుతెంచి హృదయంబునఁ గొంకక కల్కిచిల్కపై
బావురుబిల్లి బిట్టుఱుకుభంగి నరిష్టము సొచ్చె నుధ్ధతిన్.[2]

77


క.

వచ్చినకంసునిఁ బొడఁగని, వెచ్చనినిట్టూర్పు గదుర విహ్వలమతితో
ఱిచ్చవడి బాష్పధారలు, పిచ్చిల నయ్యిందువదన బెగడుచుఁ బలికెన్.[3]

78


తే.

అన్న నిన్నువంటి యన్నకుఁ దోఁబుట్టి, యాఁడుబిడ్డపోఁడిమంద లేక
సుతులఁ గన్నకడుపు చుఱ్ఱునఁ గాలఁగా, నలమటింపవలసె నకట నాకు.[4]

79


తే.

ముద్దుకొడుకుల నార్వుర ముందు దింటి, వింతపాపంబు నేయంగ నేమి గలిగె
యాడుఁబడు చిది యీబిడ్డనైనఁ గాచి, విడువు నాయుల్లమునఁ గొంత యుడుకు దీఱ.[5]

80


వ.

అని బహుప్రకారంబుల విలాపించుచు హాహాకారంబుల నక్కుమారిక నక్కున
నిడి పెనంగుచున్న యన్నలినలోచన నదల్చుచు బిట్టుదిట్టుచు శిశువుకడకా
లోడిసి తిగిచి బిరబిరం ద్రిప్పి చట్ట్రాతితోడ వ్రేసిన నక్కుమారికయును.[6]

81


క.

ఆకాశంబునఁ గడుభయ, దాకారముతోడ నిలిచి యాయుధనికర
స్వీకారాష్టభుజంబులు, గైకొని కోపించి నవ్వి కంసునిఁ బలికెన్.[7]

82


క.

నన్నేల యింతసేసితి, మున్నిటి నీవైరి దివిజముఖ్యుల కెల్లన్
బెన్నిధి యిప్పుడు పెరుగుచు, నున్నాఁడు నినున్ వధింప నొకచో శిశువై.[8]

83


వ.

అని పలికి యతండు చూచుచుండ గంధర్వవరులచేత దివ్యంబు లైనగంధమా
ల్యంబులం బూజితయై యదృశ్యయయ్యె నప్పుడు.

84


ఉ.

గ్రక్కున నేటు దాఁకినమృగంబునుబోలె నతండు తద్దయున్

  1. చొక్కు = మైమఱపు కలుగఁజేయు పొడి, మేటి = గొప్పవాఁడు.
  2. ప్రసూతియయ్యెన్ = కనియెను, వెసన్ = వడితో, పాఱుతెంచి = పరుగెత్తివచ్చి, కొంకక = శంకింపక, బావురుఁబిల్లి = గండుపిల్లి, బిట్టుఱుకు = తటాలున దుముకునట్టి, అరిష్టము = పురిటింటియందు, ఉద్ధతిన్ = దిట్టతనముతో.
  3. విహ్వల = విచారముచేత కలఁతనొందిన, ఱిచ్చవడి = నిశ్చేష్టురాలై, బాష్ప = కన్నీటియొక్క, పిచ్చిలన్ = ఉబికిరాఁగా, బెగడుచున్ = బెదరుచు.
  4. అలమటింపవలసెన్ = దుఃఖించవలసివచ్చెను.
  5. తింటివి = చంపితి వనుట, ఉడుకు = తాపము.
  6. అక్కునన్ = ఱొమ్మునందు, చట్ట్రాతితోడన్ = చట్టురాతిమీఁద.
  7. స్వీకార = పట్టిన, కైకొని = వహించి, కంసునిన్ = కంసునితో.
  8. మున్నిటి = మునుపు ఆకాశవాణి చెప్పిన, పెన్నిధి = పెద్దనిధివంటివాఁడు.