పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కరదీపికలతోడఁ బురిరాజవీథుల వర్తించు తలవరివారిఁ ద్రోచి
కోటవాకిట నున్నకొలువుమోసలలోని ద్వారపాలుర నిద్రఁ గూలఁజేసి


తే.

 బీగములు వుచ్చి గడియలు పెకలఁజేసి, బోరుతలుపులు దెఱంచి గొబ్బునఁ బురంబు
వెడలె నానకదుందుభి విష్ణుమాయ, యఖిలమును గప్పి తనకుఁ దోడై నటింప.[1]

65


వ.

అంత.

66


క.

సంపాదితశంపావళిఁ, బెంపారిన మేఘచయము పృథివియు నభమున్
గంపింపఁగ బెట్టుఱుముచు, నంసాచారంపువాన లప్పుడు గురిసెన్.[2]

67


ఆ.

వనజనయనుమీఁదఁ జినుకులు పడకుండ, గాలి సోఁకకుండ ఘనసహస్ర
భోగమయకుటీరములు మాటుగాఁ బట్టె, నయ్యనంతదేవుఁ డాకసమున.[3]

68


ఆ.

విష్ణుమహిమవలన వేగంబె మోఁకాలి, బంటనీళ్లఁ దఱిసి భానుపుత్రి
యైనయమున దాఁటి యవ్వలిదరి కేగె, దేవనిభుఁడు దేవకీవరుండు.[4]

69


క.

హరిసేవకులకు భవసా, గరకో ట్లరకాలిబంటి గావఁట హాహా!
హరితండ్రికి యమునానది, యరయఁగ మోఁకాలిబంటి యగుటది యరుదే.

70


వ.

అని దేవతలు గొనియాడుచుండి రప్పుడు.

71


క.

వానలలో మొగమడిచిన, గానంగారాని యంధకారములోనన్
దానొక్కరుండుఁ బోవుచు, నానదితీరమున నోలలాడెడుచోటన్.[5]

72


ఆ.

నందుఁ డాదిగాఁగఁ గొందఱుఁ గొల్లలు, పగిదిధనము దీర్పఁ బాలుఁ జమురు
నులుప గొంచుఁ గంసుఁ డున్నచోటికిఁ బోవు, వారిఁ గాంచె ననతిదూరమునను.[6]

73


వ.

కని తన్నెఱింగించుకొనక చని గోకులంబు ప్రవేశించి నందగోపమందిరంబుఁ
జొచ్చె నప్పుడు సద్యఃప్రసవవేదనాభేదమానసయు యోగనిద్రామోహితయునై.[7]

74


క.

తన కాఁడుబిడ్డ పుట్టుట, యును నెఱుఁగక నిద్రవోవుచున్న యశోదం
గనుఁగొని శయ్యాతలమునఁ, దనయుని నిడి కూఁతుఁ గొని ముదంబున వెడలెన్.

75
  1. ఏపుతోన్ = హెచ్చరికతో ననుట, కాఁపు = కావలి; కన్ను మొఱఁగి = ఏమఱించి, పాఱికాఁపులతోడన్ = పరిచారకులతో, పరగడంబులు = పరస్థలవాసముగా, ఓవరించి = తొలఁగించి, కరదీపికలతోడన్ = చేదివటీలతో, త్రోచి = తఱిమి - ఆవలికి దాఁటిపోనిచ్చి యనుట, కొలువుమోసల = చావడిముందరిచోటు, పెకలన్ = పెల్లగిల, బోరు = పెద్ద, గొబ్బునన్ = తటాలున.
  2. సంపాదిత = కలిగింపఁబడిన, శంపావళిన్ = మెఱుపుచాలుచేత, పెంపారిన = సర్వత్ర వ్యాపించిన, బెట్టు = భయంకరముగా, అంసాచారంపు = నిరంతరధారలు గల.
  3. భోగమయ = ఫణారూపములైన, కుటీరములు = ఎత్తుడుగుడిసెలను.
  4. తఱిసి = చేఱి.
  5. ఓలలాడెడుచోటన్ = స్నానము చేయునట్టి సమయమందు.
  6. పగిదిధనము = పన్ను రూకలు, ఉలుప = ఉపాయనము.
  7. సద్యః = అప్పుడు, ఖేదమానస = సంకటముతోడి మనసు గలది.