పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యజ్ఞంబులు ప్రదక్షిణార్చులై వెలింగె మేఘంబులు మందగర్జితంబులై వర్షించె
నప్పుడు.[1]

55


తే.

దేవకీవసుదేవులు దివ్యమూర్తి, యైనయావాసుదేవునియమితమహిమ
చూచి తమలోన నెంతయుఁ జొక్కి మ్రొక్కి, పలికి రత్యంతసంతోషభరితు లగుచు.[2]

56


ఉ.

దేవ జగజ్జనస్తుతివిధేయ చరాచరభూతనాథ ల
క్ష్మీవసుధాకళత్ర సరసీరుహసన్నిభచారునేత్ర నా
నావిబుధావనస్ఫుటఘృణారసపూరిత వాసుదేవ మా
కీవు జనించినాఁడవఁట యెంతకృతార్థులమో కదా హరీ.[3]

57


ఆ.

దివ్యమూర్తి నధికతేజంబుతో నిట్టు, లున్నఁ గంసుఁ డెఱిఁగి మున్న వచ్చి
మమ్ము నిలువనీక మాప్రాణములమీఁద, వచ్చునంతపనులు వాఁడు సేయు.[4]

58


ఉ.

కావున నిట్టిరూపము జగన్నుత మాని నరార్భకుండవై
నీవు నటింపుమన్న జలజేక్షణుఁ డవ్వసుదేవదేవకీ
దేవుల నెంతయుం గరుణ దేఱెడు చూపులఁ జూచి మీకు నే
లా వెఱవంగఁ గంసునిబలంబుఁ జలంబును మీఱఁ జంపెదన్.[5]

59


వ.

అని యభయం బిచ్చి మనుష్యబాలవేషంబు గైకొని యూరకుండె నంత.

60


క.

శ్రీధరునియోగమాయా, బోధవలన దేవకీవిభుండు ప్రయత్నం
బాధిక్యంబుగఁ గంసభ, యాధీనం బైనచిత్త మల్లలనాడన్.[6]

61


క.

బాలున్ గపటక్రీడా, లోలున్ నానానిశాటలోకసమీర
వ్యాళున్ భక్తజనావన, శీలున్ గొని చనియెఁ గంసచిత్తనిమీలున్.[7]

62


వ.

ఇ ట్లొక్కరుండును నయ్యర్ధరాత్రంబునఁ గారాగృహంబు వెడలి వచ్చునప్పుడు.[8]

63


క.

ఆనగరంబునఁ గలిగిన, నానాజంతువులు కమలనాభునిమాయా
ధీనత నిద్రామోహితు, లై నిశ్చలవృత్తి నుండి రాసమయమునన్.

64


సీ.

ఏపుతోఁ జెఱసాలయింట నల్దిక్కులఁ గావున్నవారలఁ గన్ను మొఱఁగి
పారికాఁపులతోడఁ బరగడంబులు వచ్చియున్నవారల నెల్ల నోసరించి

  1. వినమితాఖిలదేవగణమస్తుండు = మిక్కిలి వంపఁబడినయెల్లదేవతాసమూహములతలలు గలవాఁడు - ఎల్లదేవతలచేత మ్రొక్కించుకొనువాఁడు, చండమారుతంబులు = భయంకరములైన తీక్ష్ణవాయువులు, ప్రశాంతంబు లయ్యెన్ = అణఁగెను, మహావాహినులు = పెద్దయేళ్లు, ప్రసాదవాహినులు = తేటనీటిప్రవాహము గలవి, భూనభోంతరవర్తులు = భూమియందు నాకాశమునందును మెలఁగువారు, కురియుచు = కురియించుచు, ప్రదక్షిణార్చులు = ప్రదక్షిణముగా వెలుఁగునట్టి మంటలుగలవి, మందగర్జితంబులు = మెల్లనియుఱుములు గలవి.
  2. చొక్కి = పరవశులై.
  3. చరాచరభూతనాథ = చరములును అచరములునైన ప్రాణులకు ప్రభువైనవాఁడా.
  4. ప్రాణములమీద వచ్చునంత పనులు = ప్రాణాంతము లైనపనులు.
  5. నరార్భకుండవు = మనుష్యశిశువవు, నటింపుము = ప్రవర్తింపుము.
  6. అల్లలనాడన్ = తత్తఱింపఁగా.
  7. లోలున్ = ఆసక్తుని, నిశాటలోకసమీరవ్యాళున్ = రాక్షససమూహమనెడు వాయువునకు సర్పమైనవానిని - సర్పములు వాయఁవును హరించునట్లు రాక్షసులను హరించువాఁ డనుట, అవన = రక్షణమునందు, నిమీలున్ = మూయువానిని - జడత్వము నొందించువాని ననుట.
  8. ఒక్కరుండును = ఒక్కఁడే.