పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు సకలలోకోపకారభూతుం డయినభూతేశ్వరుండు దేవకీగర్భంబున నర్భ
కుండై జన్మించుసమయంబున.[1]

48


ఆ.

నందగోపపత్నియందు వైష్ణవశక్తి, యైనయోగనిద్ర యవతరించె
నంబుజాక్షుఁ డుదయ మైనలగ్నంబున, గ్రహవితతులు వక్రగతులు విడిచె.

49


ఆ.

సకలభువనపంకజము లుల్లసిలఁజేయ, విష్ణుసూర్యుఁ డుద్భవించఁజేయు
పూర్వసంధ్యకరణిఁ బొలిచి తేజోరాశి, యై వెలింగె దేవకీవధూటి.[2]

50


వ.

ఇట్లు జాజ్వల్యమాన యైనయమ్మానవతిం జూచి దుర్నిరీక్ష్యులై సహస్రాక్ష
ప్రముఖదేవగణంబులు గగనంబుననుండి యిట్లసిరి.[3]

51


చ.

కడుపున సర్వలోకములు గైకొని దాఁచినయాదిమూర్తి నీ
కడుపున నుద్భవించు నటు గాన జగంబులకెల్లఁ దల్లివై
పొడమితి విప్పు డీపరమపూరుషుఁ డచ్యుతుఁ డుద్భవించఁగా
జడిసి ప్రసూతివేదనలసంకటపాటు వహింపకుండుమీ.

52


వ.

అని యనే ప్రకారంబులం గొనియాడుచున్నసమయంబున.

53


ఉ.

నల్లనిమేను పూర్ణశశినవ్వెడుమోము నురంబు మచ్చయున్
దెల్లనికన్నులుం గరుణ దేఱెడుచూపులు పచ్చపట్టురం
జిల్లుకటిప్రదేశమును జేతులు నాలుగు నై విభూతితో
నెల్లజగంబులం బలిమి నేలెఁడువాఁ డుదయించె బాలుఁడై.[4]

54


వ.

ఇట్లు సకలభువనరక్షణదక్షుం డైన పుండరీకాక్షుండు శంఖచక్రగదాభయచారు
హస్తుండును వినమితాఖిలదేవగణమస్తుండును నై జన్మించె నప్పుడు నానాలో
కంబులకు నాహ్లాదంబయ్యె సాధుజనులకుఁ బరమసంతోషంబు గలిగెఁ జండమా
రుతంబులు ప్రశాతంబులయ్యె యమునానదీప్రముఖమహావాహినులు ప్రసాద
వాహినులయ్యె సముద్రంబులు నిజశబ్దవాద్యంబులు మొరసె గంధర్వులు సం
గీతంబులు చేసిరి యప్సరోగణంబులు నృత్యంబులు సలిపిరి భూనభోంతరవర్తు
లయిన దేవతలు పుష్పవర్షంబులు గురియుచు దివ్యదుందుభులు మొరయించిరి

  1. భూతేశ్వరుఁడు = పంచమహాభూతములకు ఒడయఁడైనవాఁడు, అర్భకుండు = శిశువు.
  2. భువనపంకజములు = లోకములనెడు కమలములను, ఉల్లసిలఁజేయన్ = వికసింపఁజేయుటకు, పూర్వసంధ్య = ప్రాతస్సంధ్య, పొలిచి = తోఁచిన.
  3. జాజ్వల్యమాన = జ్వలించుచున్నవి, సహస్రాక్షప్రముఖ = ఇంద్రుఁడు మొదలుగాఁగల. 52 పొడమితివి = పుట్టితివి, జడిసి = వెఱచి.
  4. నవ్వెడు = అపహసించునట్టి, తేఱెడు = తేటయయ్యెడు, విభూతితోన్ = సంపదతో.