పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిశీధసమయంబున దేవకీదేవియందు జనియించెదఁ దత్కాలంబున నీవును యశో
దాదేవి గర్భంబున నుదయింపుము. మదీయశక్తిప్రేరితుండయి వసుదేవుండు
బాలవేషంబుననున్న నన్నుం గొనిపోయి నందుభార్యశయనంబున నునిచి
నిన్నుం గొనివచ్చిన గంసుండు తొల్లింటియట్ల వధ్యశిలాతలంబున వైచిన.[1]

40


తే.

ఆది మాయామహాశక్తి వగుచు నరిగి, దుర్గవై యష్టభుజములతోడ నిలిచి
యెగసిపోయెద వింద్రాదు లెల్ల నిన్ను, జయజయధ్వానములతోడ సన్నుతింప.

41


క.

క్రమమున శుంభనిశుంఖా, దిమహా రాక్షసుల నెల్లఁ దెగటార్చి త్రిలో
కములకు నభయం బిచ్చుచుఁ, బ్రమదంబున నుండు నీకు భద్రము లొదవున్.[2]

42


వ.

మఱియు నీవు నానాస్థానంబులందును భూతి సన్మతి క్షాంతి వృద్ధి ధృతి లజ్జా
పుష్టి రుషా నీతి ప్రశ్రయ ఆర్య దుర్గ దేవగర్భ అంబిక భద్రకాళి భద్రక్షమ
క్షేమంకరి అనునామంబులం బరఁగి ప్రాతరపరాహ్ణకాలంబులందు భక్తిపరిపూర్ణ
హృదయులై సురామాంసోపహారంబులం బూజించువారికి నభీష్టఫలంబు లిచ్చు
చుండు మని పనిచిన.[3]

43


క.

శ్రీవల్లభుండు పనిచిన, కైవడి నాయోగనిద్ర గ్రక్కునఁ జని యా
దేవకిగర్భములోని మ, హావీరుని శేషమూర్తి యగునాశిశువున్.

44


క.

కొనిపోయి కడురహస్యం, బున రోహిణిగర్భదేశమున నునిచెను గం
సునిభీతిఁ గడుపు దిగఁబడె, నని దేవకిఁ జూచి వగచి రందఱుఁ గరుణన్.

45

శ్రీకృష్ణావతారఘట్టము

క.

దేవసమానుం డగువసు, దేవునిపుణ్యమున విష్ణుదేవునిమహిమన్
దేవకి యష్టమగర్భము, పావనముగఁ దాల్చె జగతి ప్రస్తుతి సేయన్.

46


సీ.

కోరి దేవతలకోర్కులు వృద్ధిఁ బొందినగతి నాడు నాటికిఁ గౌను బలిసె
గంసాదివీరులగర్వంబు పొలియించు పొలుపునఁ జనుమొనల్ నలుపులయ్యె
వసుదేవు సత్కీర్తి వన్నియకెక్కినవిధమునఁ జెక్కులు వెలుకఁబాఱె
దనుజశుద్ధాంతకాంతలు చిన్నవోయెడువడువున వదనంబు వాడువాఱె


తే.

గోపకాంతలయాసలు కొనలుసాగు, చందమునఁ గోర్కు లెంతయు సందడించెఁ
గడుపులోపల సర్వలోకములు నిడిన, బాలకునితల్లి యైనయప్పద్మముఖికి.[4]

47
  1. ప్రావృట్కాలంబునన్ = వానకాలమునందు, మహానిశీధసమయంబునన్ = మంచియర్ధరాత్రకాలమున, వధ్యశిలాతలంబునన్ = చంపుడుబండమీఁద.
  2. తెగటార్చి = చంపి, ప్రమదంబునన్ = సంతోషముతో, భద్రములు = శుభములు, ఒడవున్ = కలుగును.
  3. ప్రాతరపరాహ్ణకాలంబులందు = ప్రొద్దుటివేళలను మాపటివేళలను, సురా = కల్లు, ఉపహారంబులన్ = కానుకలచేత.
  4. నాడునాటికిన్ = దినక్రమమున, కౌను = నడుము, పోలియించుపొలుపునన్ = నశింపఁజేయువిధమున, వన్నియ కెక్కినవిధమున = ప్రసిద్ధి వహించినట్లు, చెక్కులు = చెక్కిళ్లు, వెలుకఁబాఱెన్ = తెల్లఁదనము పొందెను, దనుజశుద్ధాంతకాంతలు = రాక్షసులయొక్క అంతఃపురస్త్రీలు, వాడువాఱెన్ = వాడెను, కొనలుసాగు = నెఱవేఱు, సందడించెన్ = అతిశయించెను, ఇడిన =ఉంచుకొనిన.