పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మత్తకోకిల.

వాసుదేవునియాజ్ఞపెంపున వారిజాసనుపంపునన్
వాసవాదిసుపర్వు లందఱు వచ్చి మేరువుచేరువన్
డాసి యొక్కెడఁ గార్యచింత యొనర్చుచుండిరి సంతతో
ల్లాసభాసురయై ధరిత్రి చెలంగుచుండె మనంబునన్.[1]

31


వ.

అంత.

32


క.

ఆవైకుంఠములోపలి, దేవరహస్యంబులెల్లఁ దెలిసి రయమునన్
దేవముని యైననారదుఁ, డావార్తలు చెప్పి పోయె నాకంసునకున్.[2]

33


తే.

నాటనుండియుఁ గంసుండు నాటుకొన్న, దిగులుపెంపున వసుదేవదేవకులను
మిగులఁ బదిలంబు గావించి మెదలనీక, యొక్కకారాగృహంబున నునిచియుండె.[3]

34


తే.

గరిమ నాహిరణ్యకశిపునితనయు లా, ర్వురు మహోగ్రదానవులును విష్ణు
మాయవలన వచ్చి మహియందు దేవకీ, వనిత కుదయమైరి వరుసతోడ.

35


క.

మును కంసునితో నాడిన, తనసత్యము దప్పనీక తనయులఁ దోడ్తోఁ
గొని చని వసుదేవుం డా, తని కిచ్చిన వాఁడు వారిఁ దడయక చంపెన్.

36


ఉ.

ఏడవగర్భ మాజలరుహేక్షణ దాల్చిన లోకమంతయున్
వేడుక నొందె భూసతికి వింతవిలాసము తొంగలించె నీ
రేడుజగంబులుం బొగడ నీశ్వరుఁ డప్పుడు దేవబృందముల్
చూడఁగ యోగనిద్రదెసఁ జూచి ముదం బొదవంగ నిట్లనున్.[4]

37


సీ.

భూభార ముడుపంగ భూమిఁ బాతాళాధిపతి యైనశేషాహిపతి మదీయ
తామసోద్వృత్తుఁడై ధరణీతలంబున జన్మింప దేవకీజఠరమునను
బెరుగుచు నున్నయాపిన్నపాపని నీవు గొనిపోయి నందగోకులమునందు
వర్తించుచున్న యావసుదేవపత్నులలోన రోహిణి యనులోలనేత్ర


తే.

యుదరమున నొరు లెఱుఁగక యుండ బెట్టు, కంసుభయమున దేవకీకమలముఖకిఁ
గడుపు దిగఁబడిపోయె నక్కట యటంచు, వెల్లివిరి గాఁగ నాడుదు రెల్లవారు.[5]

38


తే.

గర్భసంకర్ష ణం బైనకారణమున, నాకుమారుండు సంకర్షణాఖ్యమహిమ
గలిగి ధవళాద్రినిభమైనగాత్రమునను, భూమిలోపల భద్రుఁడై పుట్టఁగలఁడు.[6]

39


వ.

ఏను బ్రావృట్కాలంబున శ్రావణమాసంబున శుక్లపక్షాష్టష్టమియందు మహా

  1. పంపునన్ = ఆజ్ఞచేత, డాసి = చేరి.
  2. వార్తలు = వృత్తాంతములు.
  3. నాటుకొన్నదిగులుపెంపునన్ = స్థాయిపడిన భయాతిశయముచేత.
  4. తొంగలించెన్ = అతిశయించెను.
  5. తామసోద్వృత్తుఁడు = తమోగుణముయొక్క విజృంభణముగలవాఁడు, జఠరమునన్ = కడుపునందు, వెల్లివిరి = ప్రసిద్ధము.
  6. గర్భసంకర్షణంబు = గర్భముయొక్క లెస్సగా ఆకర్షించుట, ధవళాద్రినిభము = తెల్లనికొండను పోలినది, గాత్రమునన్ = దేహముతో.