పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కమలసన్నిభనేత్ర కమలామనోహర కమలనివాస యోకమలనాభ
ధరణీధరాధార ధరణీభరనివార ధరణీధ్రమంథాన ధరణినాథ
దశదిశాపరిపూర్ణ దశకంఠవిదళన దశరూపధారణ దశపగమన


తే.

పంచభూతరూప పంచేంద్రియాకార, పంచబాణజనక పంచపంచ
తత్వబోధవితత సత్యాదిగుణకర్మ, మముఁ గరుణతోడ మనుపు మనుచు.[1]

23


క.

వినుతించి నలువ దనపై, ననుపమకారుణ్యనవసుధామృతధారల్
వనజాక్షుఁడు దొరగించుట, మనమునఁ దలపోసి పలికె మఱియున్ హరికిన్.[2]

24


శా.

దేవా యీవసుధావధూటి సమదాంధీభూతభూతంబులన్
మోవంజాలక జాలిఁబొందుచు బలంబున్ జేవయున్ బోయి దుః
ఖావస్థం దురపిల్లుచున్నయది దైన్యం బొంది యేతద్వ్యథల్
పోవంజేయఁగ నీవ నేర్తువు కృపాపూతాత్మ విశ్వాత్మకా.[3]

25


క.

అని విన్నపంబు చేసిన, వనజభవుని నాదరించి వసుధాసతిఁ గ
న్గొని నీ కిప్పుడు చెందిన, ఘనభారము మాన్పి జగము గాచెదఁ గరుణన్.

26


చ.

అని తనమేనియందు ధవళాసితరోమయుగంబుఁ బుచ్చి య
య్యనిమిషకోటిఁ గన్గొని మదంశములై యివి రెండు భూమిపై
జననము నొంది దుష్టజనసంహరణంబును సాధురక్షణం
బును నొనరించు భూభరము పోయెడు నెంతయు నిశ్చయంబుగన్.

27


మ.

పురుహూతప్రముఖాఖిలామరచయంబుల్ తత్తదంశంబులన్
ధరణిన్ సూర్యసుధాకరాన్వయములన్ ధాత్రీశులై పుట్టి న
న్నురుభక్తిన్ భజియించుచున్ రణమునం దుగ్రాహితానీకమున్
బొరిమార్పంగలవారు నామహిమచేఁ బొల్పారు శౌర్యంబులన్.[4]

28


క.

జగతి వసుదేవుప్రియసతి, యగుదేవకియందు నెనిమిదవగర్భమునన్
జగతీభరనాశార్థం, బుగఁ బుట్టెదఁ గృష్ణనామమున మర్త్యుఁడనై.

29


వ.

పుట్టి కంసాదిరాక్షసులం జంపి జగంబులకు సుఖంబు సేయువాడ నని పలికి
యద్దేవుం డంతర్ధానంబునం బొందె నప్పుడు.

30
  1. చంద్రశైలాధార = మేరుపర్వతమునకు ఆధారమైనవాఁడా - కూర్మవరాహరూపములతో మేరువుతోడ సర్వభూమిని శ్రీవిష్ణుదేవుఁడు ధరించుట ప్రసిద్ధము, చంద్రవస్త్ర = బంగారుపచ్చడము గలవాఁడా, కమలనివాస = జలమునందు నివసించువాఁడా - వటపత్రశాయి యనుట, ధరణీధరాధార = రాజులకెల్ల నాధారభూతుఁ డైనవాఁడా, ధరణీభరనివార = భూభారమును నివారించువాఁడా, ధరణీధ్రమంథాన = కొండ కవ్వముగాఁ గలవాఁడా, దశపగమన = గరుడవాహనుఁడా, పంచపంచతత్వబోధవితత = ఇరువదియైదుతత్వములబోధను విస్తరించువాఁడా, మనుపుము = రక్షింపుము.
  2. నలువ = చతుర్ముఖుఁడు - బ్రహ్మ.
  3. సమదాంధీభూతంబులన్ = మదముతోఁ గూడుకొనిన వగుటచేత కన్నులు గానవివిగా చేయఁబడిన ప్రాణులను, జాలిన్ = దుఃఖమును, చేవ = సత్త, దురపిల్లుచున్నది = విలపించుచున్నది, ఏకద్వ్యథంబు
    = ఈభూదేవియొక్క సంకటములను, కృపాపూతాత్మ = దయచేత పరిశుద్ధమయిన మనసుగలవాఁడా,
    విశ్వాత్మకా = ప్రపంచస్వరూపుఁడా.
  4. పురుహూతప్రముఖ = ఇంద్రుఁడు మొదలుగాఁగల, భజియించుచున్ = కొలుచుచు, ఉగ్రాహితానీకము = భయంకరులైన శత్రువులసమూహము, పొరిమార్పంగలవారు = చంపఁగలరు.