పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు కనుంగొని వినయావనతవదనయై తనకునైన ప్రజాభారపరిపీడవలనఁ గలి
గినబడలిక యెఱింగించి నాకునయిన యిమ్మహాభారం బపయింపకుండిన నిర్వ
హింపనోపనని కంసశిశుపాలజరాసంధదుర్యోధనబాణాసురనరకధేనుకారిష్ట
ప్రలంబశంబరకేశిప్రముఖు లనువారి వారిబంధుమిత్రపుత్రభ్రాతృసుహృత్ప్ర
ధానవర్గంబులను వేఱువేఱం బేర్కొని వీరివలనిభారంబు మానుటకు నుపా
యంబు సేయుమనిన.[1]

18


ఉ.

నీరజసంభవుండు ధరణీసతిఁ గన్గొని నీకు నైనయీ
భూరిభరంబు మాన్ప ననుబోఁటి కశక్యము భక్తలోకర
క్షారతుఁడున్ జగంబులకుఁ గారణభూతుఁడునై వెలుంగు ల
క్ష్మీరమణుండు నేర్చు నెఱిఁగింపుద మివ్విధ మమ్మహాత్ముతోన్.[2]

19


వ.

అని యాప్రొద్దె కదలి.[3]

20


మ.

దివిజశ్రేష్ఠుఁడు తాపసోత్తములతో దిక్పాలకశ్రేణితో
నవనిం దోడ్కొనివచ్చి కాంచె జగదేకానందచిద్రూపమున్
వివిధామ్నాయకళాకలాపము సుపర్వీగీతసల్లాపమున్
ధవళద్వీపముఁ బుణ్యరూపము నవిద్యావేద్యసంతాపమున్.[4]

21


వ.

అమ్మహాద్వీపమధ్యం బనేకశతసహస్రసూర్యకిరణంబులను సోల్లుంఠనంబు గావించు
నకుంఠతేజంబుగల వైకుంఠపురోపకంఠంబునఁ గంఠోపరికంఠీరవుండును సకల
దేవతాకంఠీరవుండును నై యిచ్ఛావిహారంబులు సలుపుచున్న పన్నగాశనవా
హనుం బొడగాంచి సాష్టాంగదండప్రణామంబులు చేసి యిట్లని స్తుతియించె.[5]

22


సీ.

చంద్రశేఖరవంద్య చంద్రార్కలోచన చంద్రశైలాధార చంద్రవస్త్ర

  1. పరిపీడ = అంతట వ్యాపించినపీడ, అపనయింపకుండినన్ = పోఁగొట్టకుండిన, నిర్వహింపన్ = చెడక మనుటకు.
  2. భూరిభరంబున్ = మిక్కుటమైన బరువును, ననుబోఁటిన్ = నావంటివానికి, అశక్యము = శక్యము కాదు, భక్తలోకరక్షారతుఁడు = భక్తులసమూహమును రక్షించుటయం దాసక్తుఁడు.
  3. ఆప్రొద్దె = అప్పుడే.
  4. జగదేకానందచిద్రూపమున్ = లోకమునందు ముఖ్యమైన జ్ఞానానందస్వరూపము గలదానిని, వివిధామ్నాయకళాకలాపమున్ = నానావిధములైన వేదవిద్యలయొక్క సముదాయము గలదానిని, సుపర్వీగీతసల్లాపమున్ = దేవతాస్త్రీలయొక్క పాటలనెడు ముచ్చటలు గలదానిని, ధవళద్వీపమున్ = శ్వేతద్వీపమును, పుణ్యరూపమున్ = పుణ్యమే ఆకృతిగాఁ గలదానిని, అవిద్యావేద్యసంతాపమున్ = అజ్ఞానముచేత తెలియఁదగిన సంతాపము గలదానిని - అజ్ఞానమును పోఁగొట్టుదాని ననుట.
  5. సోల్లుంఠనంబు = మర్మభేదక మైనపరిహాసము, అకుంఠ = మొక్కపోని - తక్కువకాని, ఉపకంఠంబునన్ = సమీపమునందు, కంఠోపరికంఠీరవుండు = మెడకు మీఁద సింహాకృతియైనవాఁడు - నరసింహుఁడు, పన్నగాశనవాహనున్ = గరుడవాహనుని.