పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నువ్వునఁ జేవ గైకొని సహోదరిపాడి దొఱంగి చెల్లెలిన్
మవ్వపుముద్దరాలి నభిమానవతిన్ వధియించుతెంపుతోన్.[1]

8


ఉ.

అందఱుఁ జూచి యింతదుడుకా యని దూఱఁగఁ గ్రొమ్మెఱుంగు లం
దంద చెలంగుభీకరకరాసి వెసన్ జళిపించి దేవకిన్
ముందలపట్టి వంచి తెగమొత్తఁ గడంగినఁ గంసుఁ గేలితో
డం దగులంగఁ బట్టుకొని డాసి కడున్ వసుదేవుఁ డిట్లనున్.[2]

9


క.

ఓహో యీసేఁత మహా, ద్రోహము నీవంటిమేటిదొర చుట్టఱికం
బూహింపక చెలియలిపై, స్నేహము చెడి యిట్లు నఱకఁ జేయెత్తునొకో.[3]

10


ఉ.

ఈయవివేకపుంబనుల కెట్లు దొడంగితి గొప్ప దింతయ
న్యాయము గాలిపోయెడుదురాగతముల్ విని పాపబుద్ధి న
య్యో యిటువంటిముద్దులసహోదరి ముందలపట్టి యీడ్చి గో
గో యని కూయఁగాఁ గుతిక కోసిన లోకమువారు తిట్టరే.[4]

11


ఆ.

నిన్న పెండ్లి చేసి నేడిదె చెలియలి, నత్తవారియింటి కనుపుచుండి
తప్పులేనితప్పు తలగోసి చంపిన, నెంతరట్టు పుట్టు నెఱిఁగికొనుము.[5]

12


ఆ.

ఇప్పు డాకసమునఁ జెప్పినయశరీరి, పలుకువలన నీకు భయము మిగులఁ
గలిగెనేని దీనికన్నబిడ్డలనెల్లఁ, బుట్టినపుడె నీకుఁ బట్టి యిత్తు.

13


తే.

పురిటిలోననవారిఁ జంపుదువు గాని, దీనిప్రాణంబులకు నేడు తెగకు పంచ
భూతములసాక్షిగా నేను బొంక నిట్టు, లైన నపకీర్తి కొంత నీ కణఁగిపోవు.[6]

14


క.

అని పలికిన నాతఁడు తన, మనసు దిరిగి మగుడఁ దెచ్చి మఱఁదిఁ జెలియలిన్
దనవీటఁ దుష్టిఁ గావలి, నునిచి పరామరిక సేయుచుండె మునీంద్రా.[7]

15

భూదేవి ప్రజాభారపీడితయై తనమనఃక్లేశమును బ్రహ్మకుఁ దెలుపుట

క.

అంత నొకనాడు ధరణీ, కాంత ప్రజాభారపీడఁ గ్రాఁగి బడలి య
త్యంతవిషాదపరీత, స్వాంత యగుచు వదనపంకజము కడువాడన్.[8]

16


క.

ఆదిత్యయక్షగంధ, ర్వాదులు చనుదేరఁ గూడి యటఁ జని కాంచెన్
బ్రాదుర్భూతవివేక, ఛ్ఛేదీకృతహృదయకలుషజిహ్మన్ బ్రహ్మన్.[9]

17
  1. ఆరటపాటు = సంకటము, నివ్వెఱఁగంది = నిశ్చేష్టతను పొంది, ఒండుపమ = ఒకయుపాయమును, ఉవ్వునన్ = తటాలున, చేవ = బలమును - ధైర్యము ననుట, సహోదరిపాడి = తోడఁబుట్టు వనున్యాయమును, తొఱంగి = విడిచి, మవ్వపు = మనోజ్ఞురాలైన.
  2. అందంద చెలంగు = మిక్కిలి వ్యాపించునట్టి, భీకరకరాసి = భయంకరమైన చేకత్తిని, జళిపించి = ఆడించి, డాసి కడున్ = కడున్ డాసి యని యన్వయము.
  3. ఈసేఁత = ఈపని.
  4. తొడంగితివి = ఆరంభించితివి, దురాగతములు = రాఁగలచెఱుపును దెలుపునట్టి యాకాశవాణిమాటలను.
  5. తప్పులేనితప్పు = లేనితప్పును కలుగఁజేసికొని యనుట, రట్టు = అల్లరి.
  6. తెగకు = సాహసింపకుము.
  7. తనవీటన్ = తనపట్టణమునందు, తుష్టి = సంతుష్టి.
  8. క్రాఁగి= సంతాపము నొంది, అత్యంతవిషాదపరీతస్వాంత = మేరలేనిదుఃఖముచేత ఆక్రమింపఁబడిన మనసు గలది.
  9. ప్రాదుర్భూత...జిహ్మన్ = పుట్టినవివేకముచేత ఛేదించఁబడిన మనసులోని పాపకౌటిల్యములుగలవాఁడు - దుఃఖోపశమనసమర్థుఁ డనుట.