పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

కలియుగము దీఱి కృతయుగకాలమైన, ధర్మమార్గంబు నాల్గుపాదముల నడచు
ననిమిషులు భూమి కరుదెంచి మనుజకోటిఁ, గలసి వర్తింతు రత్యంతగౌరవమున.[1]

404


క.

కలియుగదోషములకుఁ గడు, నులికి తపము లాచరించుచున్ననరేంద్రుల్
నలినాప్తసోమవంశజు, లెలమిన్ దొల్లింటియట్ల యేలుదు రవనిన్.[2]

405


వ.

అని యిట్లు సూర్యసోమవంశానుచరితంబులపరిపాటి నెఱింగించి పరాశరుండు
వెండియు నిట్లనియె.[3]

406


మ.

విను మైత్రేయ జనార్ధనాంశభవులై విశ్వంభ రామండలం
బున ధర్మస్థితి నుల్లసిల్లి మహిమన్ బొల్పారుభూపాలుర
న్వినినన్ బేర్కొనినన్ శుభంబు లొదవున్ నిత్యంబు యజ్ఞంబు చే
సినపుణ్యంబులు గల్లు మానవులకు శ్రీమీఱ నేకాలమున్.[4]

407


సీ.

ఇక్ష్వాకుమాంధాతృఋతుపర్ణయువనాశ్వసగరశంతనుహరిశ్చంద్రనహుష
రామలక్ష్మణభగీరథశశిబిందుభార్గవనిమిసంయాతికార్తవీర్య
నలరంతిదుష్యంతనాభాగముచికుందపురుకుత్సవైదేహపూరుభరత
రఘుదిలీపసుహోత్రరంతిపురూరవజ్యామఘతృణబిందుసోమదత్త


ఆ.

భీష్మధర్మపుత్రభీమభీబత్సపాం, చాలకేకయవైరాటసత్యసేన
ముఖ్యనృపులచరితములు విన్నఁ బేర్కొన్న, మహితశుభము లొదవు మానవులకు.

408


వ.

ఇట్లు సూర్యసోమవంశాధిపతులం జెప్పి మఱియును.

409


ఉ.

చాటుతరప్రబంధకవిసన్నుత సంగరపార్థ ధీరతా
హాటకశైల నిత్యవినయప్రతిభావిభవాఢ్య భూమిభృ
త్కూటగుహాపహిత్థనృపకుంజర సంగడిరక్షపాల క
ర్ణాటనరేంద్రదత్తసముదంచితశాశ్వతరాజ్యవైభవా.[5]

410


క.

రాజీవనయనపదయుగ, రాజీవభ్రమరశత్రురాజన్యరమా
రాజీవకుముదబాంధవ, రాజీవహితప్రతాప రాజీవముఖా.[6]

411
  1. తీఱి = కడచి.
  2. నలినాప్తసోమవంశజులు = సూర్యచంద్రవంశములయందు జనించినవారు.
  3. వంశానుచరితంబులు = వంశములను అనుసరించిన చరిత్రములను,
    పరిపాటిన్ = క్రమముగా.
  4. విశ్వంభరామండలంబునన్ = భూమండలమునందు.
  5. ధీరతాహాటకశైల = ధైర్యముచేత మేరుపర్వతమైన వాఁడా, నిత్యవినయప్రతిభావిభవాఢ్య= స్థిరమైనవినయముతోడి ప్రతిభ కలిమి గలవాఁడా (ప్రతిభ = సమయోచితస్ఫురణగల బుద్ధి), భూమిభృత్కూటగుహావహిత్థనృపకుంజర = కొండకొమ్ములయందును గుహలయందును దాఁగిన రాజశ్రేష్ఠులు గలవాఁడా.
  6. శత్రురాజన్యరమారాజీవకుముదబాంధవ = పగవారైన రాజులయొక్క సంపదలనెడు కమలములకు చంద్రుఁడైనవాఁడా, రాజీవహితప్రతాప = సూర్యునిప్రతాపమువంటి ప్రతాపము గలవాఁడా.