పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆవులఁ బడిఁ బొడుచుటయును, స్త్రీవధ లొనరించుటయును శిశువుల హత్యల్
గావించుటయును నైజము, లై వెలయును జగమునందు నఖిలజనులకున్.[1]

399


సీ.

పరధనపరదారహరులు నల్పాల్పసారులున్ మృతప్రాయమూర్తులు నసత్య
వచనులు పాషండవర్తనులును భూమిఁ దఱచుగాఁ గలరు వేదములు యజ్ఞ
తతులును లేవు సంతతము నుత్తమవంశజాతులు మ్లేచ్ఛకిరాతవ
రాదుల సేవించి యధమాధమము లైనపను లాచరింపుదు రనదవృత్తి


తే.

బలిమిగలవాఁడె రాజు సంపదలు గలుగు, నతఁడె మాన్యుఁడు సభల మాట్లాడనేర్చు
నతఁడె పూజ్యుండు కొల్చినయతఁడె హితుఁడు, జనుల కెల్లను గలియుగసమయమునను.[2]

400


వ.

మఱియు ధనంబ కులాభిజాత్యహేతువు బలంబ ధర్మహేతువు మనోహరంబ
దాంపత్యహేతువు శౌర్యంబ వ్యవహారహేతువు స్త్రీత్వంబ యుపభోగహేతువు
లింగధారణంబ యాశ్రయహేతువు అన్యాయంబ వృత్తిహేతువు దౌర్బ
ల్యంబ యధమహేతువు దానంబ ధర్మహేతువు స్వీకారంబ వివాహహేతువు
సద్వేషధారణంబ పాత్రహేతువు నై యనేకభీషణదోషనిశేషంబులు సమస్త
వర్ణంబులయందును గలిగియుండు. మనుష్యులకు నూటయిరువదివత్సరంబు
లాయువు పరిమాణం బగు మధుశాకమూలపత్రపుష్పాదు లాహారంబుగాఁగల
యవి తరువల్కలాజినపర్ణంబులు వస్త్రంబులగు నొక్కొకరికి బహుప్రజావృద్ధి
యగు దానం జేసి శీతవాతపీడితులు గాఁగలవారు. శ్రౌతస్మార్తంబులు విప్లవంబు
లుగాఁ గలయవి యిట్టివర్తనంబులు గలకలికాలంబునందు.[3]

401


ఉ.

భూమిని ధర్మముల్ నిలుపఁ బూని ముకుందుఁడు సర్వలోక
రక్షామణి భక్తవత్సలుఁడు సాత్వికబుద్ధి యెలర్ప శంబళ
గ్రామమునన్ బ్రధానుఁ డను బ్రాహ్మణునింట జనించుఁ గల్కియై
యామహనీయమూర్తి తెగటార్చును మ్లేచ్ఛకిరాతజాతులన్.

402


మ.

నిజధర్మంబున వేదముల్ ధరణిపై నిండన్ బ్రతిష్ఠించి సా
ధుజనవ్రాతము నాదరించి యొకచో దోషంబు లేకుండఁ జే
సి జగంబుల్ పరమానురాగమునఁ దాఁ జెందించువాఁడై యథో
క్షజుఁ డుండున్ బటుసాత్వికస్ఫురణతోఁ గల్కిస్వరూపంబునన్.[4]

403
  1. పడఁబొడుచుట= పడఁగొట్టుట - చంపుట, హత్యలు = చంపుటలు, నైజములై = స్వభావసిద్ధములై.
  2. ఆల్పాల్పసారులు = మిక్కిలి యల్పమైనబలముగలవారు, మృతప్రాయమూర్తులు = కొంచెము తక్కువగా చచ్చిన యాకృతిగలవారు, పాషండవర్తనులు = వేదవిరుద్ధములైన నడవళ్లు గలవారు, ధీవరాదులన్ = చేఁపలఁ బట్టి జీవించునట్టి బెస్తలు మొదలగువారిని, అనదవృత్తిన్ = అనాథవర్తనతో.
  3. భీషణ = దారుణములైన, విప్లవంబులు = చెడినవి.
  4. ప్రతిష్టించి = స్థాపించి.