పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు మనోవాక్కాయకర్మంబులందును.

372


సీ.

ఇంద్రనీలచ్ఛాయ నేపారుమేనును బంగారుచాయలపచ్చడంబు
వెలిదమ్మిపువ్వులఁ దెగడునేత్రమ్ములు చక్కనిపీనవక్షస్స్థలంబు
కౌస్తుభమణితోడి గ్రైవేయకంబును మృగనాభితిలకంబు మెఱయుమోము
శార్ఙ్గగదాశంఖచక్రహస్తంబులు లాలితస్త్రీవత్సలాంఛనంబు


తే.

కటకకంకణమణిముద్రికాకిరీట, హారకేయూరమణికుండలాభిరామ
మైనకృష్ణునిదివ్యరూపాతిశయము, మఱపుపుట్టక తలఁచు నమ్మనుజవిభుఁడు.[1]

373


వ.

ఇవ్విధంబున నవ్వాసుదేవుని వైరాను భావంబునఁ బర్యటనభోజనస్నానాసన
శయనాదికాలంబులను జాగ్రత్స్వప్నసుషుప్త్యాద్యవస్థలయందును తదాసక్త
చిత్తుండై యుండె.[2]

374


సీ.

ఉదయించి వచ్చుఖద్యోతబింబము శౌరిచక్రమో యని భీతి సంచలించు
శక్రచాపముతోడి జలధరం బుఱిమిన హరిశార్ఙ్గగుణనాద మని కలంగుఁ
బరిపూర్ణచంద్రబింబము వాసుదేవుని పాంచజన్యం బని భ్రమత నొందుఁ
బొలుచు నీరదవిధంబులు విష్ణుకౌమోదకీనందకములని దీనుఁ డగును


తే.

నపరసంధ్యారుణం బైనయాకసంపుఁ, గనకవస్త్రంబు విష్ణుదిగాఁ దలంచు
సంతతంబును వేఱొకచింత లేక, బాల్యమునఁగోలె నాశిశుపాలనృపతి.[3]

375


వ.

ఇవ్విధంబునం బరమార్థతత్వభావుం డయినయవ్వాసుదేవునియందు లయం
బయినచిత్తంబుతో నుండి యంతరంగంబున సంగరోద్వృత్తుండై భగవద్ధస్తనిర్ముక్త
చక్రధారావిదారితమస్తకుండై సకలకలుషంబులం బాసి సాయుజ్యంబునుం
బొందెను.[4]

376


క.

రిపులకు నీగతి మోక్షము, కృపసేయ సమర్థుఁ డైనకేశవునకు న
చ్చపుభక్తితో భజించిన, ప్రసన్నులకు నొసఁగు టరిది పనికాదు సుమీ.[5]

377
  1. కటకకంకణమణిముద్రికా = అందెలు కడియములు రత్నములు చెక్కినయుంగరములు, అభిరామము = ఒప్పిదమైనది.
  2. పర్యటన =తిరుగుట, తదాసక్త = ఆకృష్ణునియందంటిన.
  3. ఖద్యోతబింబము = సూర్యబింబము, శక్రచాపము = ఇంద్రధనుస్సు, జలధరము = మేఘము, గుణనాదము = అల్లెత్రాటిమ్రోఁత, పొలుచు = కంటికి తోఁచునట్టి, నీరదవిధంబులు = మేఘములయొక్క రీతులు, అపరసంధ్యారుణంబు = సాయంసంధ్యయందు ఎఱ్ఱగాఁ దోచునట్టి, ఆకసంపుఁగనకవస్త్రంబు = ఆకాశమనెడు బంగారుపచ్చడమును, విష్ణుదిగాన్ = విష్ణునిదిగా, సంతతంబును = ఎల్లప్పుడు.
  4. లయంబు = అభేదమై కలసినది, సంగరోద్వృత్తుండు = యుద్ధోత్సాహము గలవాఁడు, భగవద్ధస్తనిర్ముక్తచక్రధారావిదారికమస్తకుండు = భగవంతుఁడైన శ్రీకృష్ణునిచేతినుండి విడువఁబడినచక్రధారలచేత భేదింపఁబడినతల గలవాఁడు, కలుషంబులన్ = పాపములను, సాయుజ్యమున్ = మోక్షమును.
  5. అచ్చపుభక్తితోన్ = స్వచ్ఛమైన భక్తితో, ప్రపన్నులకున్ = శరణాగతులకు, అరిదిపని = దుర్లభమైనపని.