పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

పిదప శిశుపాలుఁడై పుట్టి పిన్ననాటఁ, గోలెఁ బూర్వవిరోధంబు కొనలుసాగ
భూమిభారావతరుణుఁడై పుట్టినట్టి, మురహరునిచేత మృతిఁ బొంది ముక్తిఁ గాంచె.[1]

363


వ.

అనిన మైత్రేయుం డిట్లనియె.

364


ఉ.

అందముగా నతండు దివిజాదులు గాననివైభవంబులం
బొందుచు నాహిరణ్యకశిపుత్వమునన్ దశకంధరాకృతిం
జెంది ముముక్షుభోగములు చేకొన కాశిశుపాలుఁడై ముదం
బందుచు విష్ణునందు లయ మౌటకుఁ గారణ మేమి గల్గెనో.[2]

365


వ.

అనినం బరాశరుం డిట్లనియె.

366


సీ.

ఆదైత్యనాథువధార్థమై హరి నారసింహరూపంబును జెందినపుడు
పరమాత్ముఁ డగురమాపతి యని మది వివేకింపక రాజసోద్వృత్తుఁ డగుచు
మృతిఁబొందె బూర్వసంచితపుణ్యఫలమున దశకంధరుండై ప్రతాపమునను
సకలలోకంబులు సాధింప సర్వకంటక మైనరాజసప్రకృతివలన


తే.

జానకీసక్తచిత్తుఁడై శాశ్వతాప, వర్గ ఫలదాయి యగు రామవసుమతీశు
నధమమానవనాథుఁగా నాత్మఁ దలఁచెఁ, గాని హరి యని తలపోయఁ గానఁడయ్యె.[3]

367


తే.

పూర్వపుణ్యఫలంబునఁ బొలిచినట్టి, యంచితైశ్వర్యసంపద లనుభవింప
నాదిజన్మంబులును జాల కతఁడు చేది, రాజుకులమున శిశుపాలుఁడై జనించె.

368


తే.

అఖిలభూమండలశ్లాఘ్యమైన సకల, భాగ్యమహిమ లవ్యాహతప్రౌఢి ననుభ
వించి రాజసోద్రిక్తుఁడై మించి పూర్వ, జన్మవైరానుబంధంబు సంధిలంగ.[4]

369


ఆ.

పిన్ననాటఁగోలె వెన్నునిఁ జంపుదు, ననుతలంపుఁ దన్ను నతఁడు వెదకి
యేమఱించివచ్చి యెప్పుడు చంపునో, యనుతలంపుఁ గలిగి యాతఁ డుండె.

370


ఉ.

పిమ్మట వారిముందర నుపేంద్రునిఁ గైకొన కచ్యుతాదినా
మమ్ము లుపన్యసించి పలుమాఱును నవ్వుచు నిందసేయుచి
త్తమ్మునఁ దద్విరోధగతి దప్పక యోజనసేయుచుండి ని
త్యమ్మును నాత్మరక్ష విదితంబుగఁ జేయుఁ దదీయభీతుఁ డై.

371
  1. పిన్ననాటఁగోలెన్ = బాల్యమునుండియు, కొనలు సాగన్ = వర్ధిల్లఁగా.
  2. ముముక్షు = మోక్షాపేక్షగల.
  3. రాజసోద్వృత్తుఁడు = రజోగుణనంబంధమైన నిక్కు గలవాడు, సర్వకంటకము = ఎల్లవారికి బాధకము, రాజసప్రకృతి = రజోగుణయుక్తమైన స్వభావము, సక్తచిత్తుఁడు = ఆసక్తితోడి మనసుగలవాఁడు, శాశ్వత...దాయి = శాశ్వతమైన మోక్షఫలము నిద్చునట్టివాఁడు.
  4. అవ్యాహతప్రౌఢిన్ = కొట్టుపడనిసామర్థ్యముతో, వైరానుబంధంబు = విరోధముయొక్క సంబంధము, సంధిలంగన్ = అనుసరింపగా.