పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లును బుట్టి రయ్యిందువదనల నందఱు వసుదేవుండు వివాహంబయ్యె నుగ్రసేను
నకునుఁ గంసప్రముఖులైన కుమారులు పదుండ్రు పుట్టిరి.

353


క.

భజమానునకు విదూరథుఁ, డు జనించె నతనికి శూరుఁడు గలిగె నాభూ
భుజూనకుఁ బ్రతిక్షత్రుం డను, సుజనహితుఁడు పుట్టె విజయశోభితుఁ డగుచున్.

354


క.

వానికి భోజుఁడు భోజ, క్ష్మానాథునకును హృదీకజననాథుఁడు నా
భూనాథునకును గృతవ, ర్మానందప్రముఖు లుదయమయిరి గరిమతోన్.

355


క.

శూరుఁడు మారిష యనువని, తారత్నమునందుఁ బుత్రదశకముఁ బడసెన్
వారలలో వసుదేవుఁడు, ధీరుండై జగములందుఁ దేజముఁ గాంచెన్.

356


ఉ.

ఆవసుదేవుజన్మసమయంబున వేల్పులు గూడి ధాత్రిలోఁ
మావిభుఁ డీమహాత్మునికుమారకుఁడై యుదయించి శ్రీలుమా
కీవుతమంచు మించి మొరయించిరి యానకదుందుభిప్రవా
ద్యావళిఁ దన్నిమిత్త మతఁ డానకదుందుభి యయ్యె ధాత్రిలోన్.[1]

357


వ.

మఱియు నవ్వసుదేవునికి భగినులై పృథయును శ్రుతదేవయు శ్రుతకీర్తియు
శ్రుతశ్రవయు రాజాధిదేవియు ననువా రేవురుకన్యకలు పుట్టి రందు.[2]

358


క.

కుంతి యనుధరణినాథుఁడు, సంతానములేక శూరుసమ్మతమున నా
యింతులలోపలఁ బృథ యను, కాంతం గొనిపోయెఁ బుత్రికామోహమునన్.

359


ఉ.

ఆనళినాక్షి పౌరవకులాగ్రణి పాండునిఁ బెండ్లియాడి ధ
ర్మానిలవాసవాంశభవు లైనయుధిష్ఠిరభీమపార్థులన్
సూనుల మువ్వురం బడసె సూర్యువరంబునఁ బెండ్లి లేనినాఁ
డానతవైరిఁ గర్ణుఁ డనునంగపతిన్ గనియెం బ్రియంబుతోన్.[3]

360


క.

ఆవనిత సవతి మాద్రీ, దేవి వడసెను నకులసహదేవు లనంగా
దేవత లగునశ్వినుల మ, హావరముల పెంపువలన నాపాండునకున్.

361


వ.

మఱియు శ్రుతదేవను వృద్ధధర్ముం డనుకరూశపతి వివాహంబై దానియందు నేవురు
కుమారులం బడసె రాజాధిదేవి నవంతీశ్వరుండు వివాహంబై విందానువిందుల
నిరువురం బడనె శ్రుతశ్రవ యనుదానిఁ జేదివిభుండయిన దమఘోషుండు
వివాహంబయి శిశుపాలుం డనుకుమారునిం బడసె.

362


సీ.

పూర్వకాలంబునఁ బురుషోత్తమునితోడివైరంబువలన నుదారవిక్ర
మాసురపతి దితియందు హిరణ్యకశిపుఁ డనఁబుట్టి నృసింహువలన
వధ నొంది వెండియు నధికప్రతాపంబు దనర దశాననత్వము వహించి
యఖిలభోగంబుల ననుభవించి త్రిలోకసేవితుఁ డగురాముచేతఁ జచ్చి

  1. ఆనకదుందుభిప్రవాద్యావళిన్ =తప్పెట భేరీ మొదలుగాఁగల వాద్యసమూహమును.
  2. భగినులు = తోడఁబుట్టిన ఆఁడువారు.
  3. పౌరవకులాగ్రణి = పూరువంశశ్రేష్ఠుఁడు, ధర్మానిలవాసవాంశభవులు = యముఁడు వాయువు దేవేంద్రుఁడు వీరియంశములయందు జనించినవారు, ఆనతనైరి = వంపఁబడినశత్రువులుగలవానిని - ఎల్లశత్రువులను లోఁబఱచుకొన్నవానిని.