పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

సతతంబు బ్రహ్మచర్య, వ్రతస్థులకుఁ గాని యున్నవారలకును సం
గతిగా దీమణిఁ దాల్పఁగ, నతిశయదుఃఖంబుఁ బ్రాణహానిం జేయున్.[1]

343


సీ.

షోడశసాహస్రసుందరీజనమోహితుఁడఁగాన నే నోప నెడభరింప
నామీఁదికూర్మి యెన్నఁడుఁ బోయ దటుగాన సత్యభామకుఁ బూన్ప శక్తి లేదు
ప్రతిదినంబును మద్యపానంబు గావించు బలభద్రునకు భరింపంగ రాదు
సతులతోఁగూడ సంసారముల్ సేసెడువా రెవ్వరును దాల్చలేరు భూమిఁ


తే.

గాన నాకును జూడ నిష్కల్మషుండు, బ్రహ్మచర్యవ్రతస్థుఁడై పరఁగు భాగ
వతుఁడు సంతతయజ్ఞదీక్షితుఁడు నైన, యట్టి యక్రూరునకు నిది యర్హమగును.

344


మ.

అని యారత్నము కాందినేయునకు నెయ్యంబారఁగా నిచ్చి పొ
మ్మని వీడ్కొల్పిన సంతసంబు మదిఁ బొంగారంగ నాఁ డాదిగా
జనులెల్లం గొనియాడ లోకవిదితాచారుండు గ్రైవేయకం
బునకున్ నాయకరత్నమై మెఱయఁగాఁ బూనె మునీంద్రోత్తమా.[2]

345


తే.

శౌరి తన కైనమిథ్యాభిశస్తిదోష, మంతయును బాపుకొని సముదగ్రవైభ
వమునఁ బెంపారె ద్వారకావతిపురమున, భక్తరక్షావిచక్షణప్రౌఢి మెఱసి.[3]

346


తే.

మునివరోత్తమ యీకథ వినిన సాధు, జనులు మిథ్యాభిశక్తిదోషములు లేక
పుత్రపౌత్రాభివృద్ధిచేఁ బొదలియుండు, దురు యశం బెల్లదిక్కులఁ బరిమళింప.

347

అనమిత్రప్రభృతులవంశానుక్రమము

వ.

అని చెప్పి పరాశరుండు వెండియు సోమవంశంబు కొఱంత సెప్పువాఁడై
యిట్లనియె.

348


క.

అనమిత్రునకును శినియున్, శినికిన్ సత్యకుఁడు నాతనికి సాత్యకియున్
జనియించిరి యుయుధానుఁ, డను వేఱొకపేరు గలిగె నాసాత్యకికిన్.

349


క.

అనమిత్రుని యన్వయమున, జనియించె శ్వఫల్గుఁ డతనిచరితం బెల్లన్
మునువింటి వామహీపతి, తనయుం డక్రూరుఁ డయ్యెఁ దాపసముఖ్యా.

350


ఆ.

అంధకునితనూజులై రుచికంబళ, కుకురబర్హు లనఁగఁ బ్రకటయశులు
పుట్టి రామహీశపుంగవవంశజు, లంధకాఖ్యు లైరి యనఘచరిత.

351


క.

అనునకు నానకదుందుభి, జనియించెఁ బునర్వసుండు తత్సుతుఁడై యా
తని కుదయించెను నాహుకుఁ, డన నాతనిపుత్రుఁ డయ్యె నానరపతికిన్.

352


వ.

దేవకోగ్రసేను లనుపుత్రద్వయంబును వృకదేవయు నుపదేవయు దేవరక్షితయు
శ్రీదేవియు శాంతిదేవియు సహదేవియు దేవకియు ననంగ నేడుగురు కన్యక

  1. సంగతి = యుక్తము.
  2. నెయ్యం బొరఁగాన్ = స్నేహ మతిశయింపఁగా, గ్రైవేయకంబునకున్ = కంఠహారమునకు.
  3. మిథ్యాభిశప్తి = అసత్యాపవాదరూపమైన.