పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మును శతధన్వుఁడు దనకి, చ్చినచందముఁ దెలియఁజెప్పి చెచ్చెరఁ దనక
ట్టినపట్టుదట్టిపొరలో, నునిచినరత్నంబు దిగిచి యొసఁగెన్ హరికిన్.

333


పంచచామరము.

సముజ్జ్వలారుణప్రభావిశాలభాసురోదయా
ర్కమండలోపమానమై జగజ్జనైకదుర్నిరీ
క్ష్యమై సభాజనప్రశస్తసాధువాదయోగ్యమై
శమంతకాఖ్యరత్న మొప్పె శౌరిసమ్ముఖంబునన్.[1]

334


వ.

ఇట్లు జాజ్వల్యమానంబై వెలుంగుచున్న రత్నంబు సకలజనంబులు పట్టిపట్టిచూచి
సాధువాదంబులఁ బెద్దయుంబ్రొద్దు గొనియాడి రప్పు డక్రూరుండు కమలనా
భున కిట్లనియె.[2]

335


క.

లోకేశ యిమ్మణీంద్రము, నీకృప నామీఁదఁ జాలనిలిచినకతనం
జేకొని దాఁపఁగ నెఱసిరి, నాకుఁ గలిగె నిట్లు కానినాఁ డోపుదునే.[3]

336


ఉ.

ఇమ్మహనీయరత్నమున కెంతయు నాసలఁ జిక్కి చచ్చినా
రమ్మెయి నాప్రసేనుఁడుఁ దదగ్రజుఁడున్ శతధన్వుఁడున్ వినా
శమ్మును బొందె నట్లగుట సంతతమున్ దలపోసి యేను బ్రా
ణమ్ములు నమ్మకుండుదు జనస్తుత నేఁడు సుఖంబుఁ జెందితిన్.

337


క.

లోకోపకారముగ నిది, నాకడ దాఁచితిని దీని నారాయణ యీయీ
పోకలు దెలిసియు నడుగక, నీ కీననియుండితిన్ వినిశ్చితబుద్ధిన్.

338


చ.

అడుగక కాని దాఁచినపదార్థము లిచ్చుట నీతిగాదు నీ
వడిగితిగాన నిప్పుడు సమర్పణసేసితి నింక నాయెడన్
గొడవలు లేవు నీమనసుకోరిక యేగతి నుండునట్లుగా
నడుపుము భక్తవత్సలత నన్నుఁ గృతార్థునిఁ జేయు కేశవా.[4]

339


తే.

అనిన గాందినినందను నమ్మురారి, గౌరవించుచు నుచితవాక్యములు పలుకు
చుండె జాజ్వల్యమానమై యొప్పుచున్న, మానికముమీఁది పేరాస మానలేక.

340

శ్రీకృష్ణుం డక్రూరునకు శ్యమంతకమణి నొసంగుట

ఆ.

తనకు మీఁదు గట్టి తగనియ్యఁ బాఱినాఁ, డనుచు సీరపాణి యాససేసెఁ
దండ్రిసొమ్ముగానఁ దనకిత్తురో యని, సత్యభామ మిగులఁ జనువు నెఱపె.

341


క.

వారిరువురు దమలోపలఁ, బేరాసల నుండు టెఱిఁగి పీతాంబరుఁ డ
క్రూరునిదెసఁ గలిగినకరు, ణారసము దొలంకులోచనంబులతోడన్.[5]

342
  1. సముజ్జ్వలా...మానము = మిక్కిలి వెలుగునట్టియెఱ్ఱనికాంతులయొక్క యతిశయముచేత ప్రకాశమానమైన యుదయకాలమునందలి సూర్యబింబముతో పోల్పఁదగినది, దుర్నిరీక్ష్యము = చూడనలవి గానిది, సభా...యోగ్యము = సభయందలి జనులవలన ప్రశంసింపఁబడునట్టి మేలు మేలు అను వాక్కులకుఁ
    దగినది.
  2. జాజ్వల్యమానము = దేదీప్యమానము.
  3. నెఱసిరి = పూర్ణ మైనసంపద.
  4. గొడవలు = అపరాధములు.
  5. తొలంకు = పొంగు.