పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

బాణాంతకుఁ డక్రూరుని, ప్రాణార్థంబులకుఁ దప్పనని శపథం బ
క్షీణగతి నిచ్చి పిలువఁగ, క్షోణీసురవరులఁ దగినచుట్టలఁ బనిచెన్.[1]

323


తే.

గాందినేయుఁడు శౌరివాక్యములు నమ్మి, ద్వారకకు వచ్చి పూర్వప్రకారమునను
యాగములు సేయుచుండెఁ గృష్ణార్పణముగఁ, దచ్ఛమంతకరత్నార్థధాముఁ డగుచు.

324


మ.

కురిసెన్ వానలు సస్యవృద్ధి గలిగెన్ గొల్చెక్కుడై యమ్మె నె
వ్వరు రోగంబులచేతఁ జావరు మృగవ్యాళాదిదుర్దోషముల్
విరిసెన్ సాధుమతంబు లెల్ల నడిచెన్ విఖ్యాతసౌఖ్యంబుతో
ధర శోభిల్లె శమంతకాఖ్యమణిరత్నస్థైర్యసంపత్తిచేన్.[2]

325


వ.

ఇట్లు సకలదురితనివారణం బగుటకు వెఱఁగుబడి పుండరీకాక్షుండు తనమనం
బున నిట్లని వితర్కించె.

326


సీ.

కడునల్పపుణ్యులు గాందినియును శ్వఫల్గుండును వారలకొడుకుఁగుఱ్ఱఁ
క్రూరుఁ డితనిపుణ్యము చెప్పఁబడఁజాల దితనికి మహిమ దా నెట్లు గలిగె
నదియునుగాక నిత్యమును దప్పకయుండఁ గ్రతువులు సేయుచు సతతభూరి
దక్షిణల్ ద్విజులకుఁ ద్రవ్వితండములుగా నిచ్చుచున్నాఁడు నే నెఱుఁగకుండ


తే.

నింత యర్థంబు వీనికి నెట్లు గలిగె, నింతతేజోవిశేషంబు నిట్టిపాటి
మహిమయును గల్గుటెల్ల శమంతకప్ర, భావ మిది నిశ్చయంబని తలఁచి యంత.[3]

327


క.

ఒకనాఁడు సకలయాదవ, నికరంబులతోడ గాందినీసుతుఁ బిలిపిం
చి కడుంబ్రియపూర్వకముగఁ, బ్రకటవినోదములు నడపెఁ బరిహాసముగన్.

328


వ.

ఇవ్విధంబున నక్రూరునిచిత్తం బక్రూరంబుగాఁ బ్రతులు సేసి యిట్లనియె.

329


సీ.

అనఘ నీచేఁ గమలాప్తదత్తం బైనయాశమంతక మవశ్యంబు నుండు
నే నెఱుంగుదు నది యెఱిఁగియు నీ వనవరతయజ్ఞక్రియాపరుఁడ వగుటఁ
చూచి నీతో నది సూచింపకుండితి నది నాకుఁ దెలియదో యని రహస్య
వృత్తిమై దాఁచితి నీవు గావున దాఁగినట్లయ్యె నీవిధం బరసిచూడ


తే.

వీర లిందఱు నామీఁద విశ్వసింప, కున్న వా రపకీర్తి నా కొదవకుండఁ
జూపుమా సకలబంధులుఁ జూడవలయు, నిందు నీ కపరాధ మొక్కింతలేదు.

330


వ.

అనిన గాందినీనందనుండు దేవకీనందనుపలుకుల కులికిపడి మొగంబు వెల్లనై
ధైర్యం బొక్కింత చేసికొని తనమతంబున.

331


క.

మానికము దాఁచి లేదని, పోనాడి మొఱంగి తొలఁగిపోయిన నెందుం
బోనియ్యఁ డడిగినప్పుడె, యేను సమర్పింతు ననుచు హితమతితోడన్.[4]

332
  1. చుట్టలన్ = చుట్టములను.
  2. కొల్చు = ధాన్యము, విరిసెన్ = తొలఁగెను.
  3. త్రవ్వితండములు = అపరిమితములు.
  4. పోనాడి = పరిహరించి.