పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యాధులు దఱుచయి బాధించెఁ బ్రజలను జావు లగ్గలమయ్యె జనులయందుఁ
బ్రళయానిలంబు లుత్పాతంబుగా వీచె ఘోరాగ్నిభయములు గోడుకొనియె


తే.

దుష్టభుజగంబు లందందఁ దోలికఱచెఁ, గ్రూరమృగచయమెల్లఁ ద్రెక్కోలుగొనియె
జారచోరభయంబులు సంక్రమించె, ద్వారకానగరంబునఁ దఱుచుగాఁగ.[1]

315


క.

ఇట్టి మహోత్పాతంబులు, పుట్టినఁ గృష్ణుండు వృష్ణిభోజాంధకులన్
జుట్టములఁ బిలిచి వారల, కట్టియుపద్రవముఁ జెప్పె నతిదుఃఖితుఁడై.

316


తే.

చెప్పి దీనికిఁ బ్రతికార మిప్పు డేమి, చేయుదము బుద్ధిమంతులు సెప్పుఁడనిన
నందకుం డనుయదువృద్ధుఁ డబ్జనాభుఁ, జూచి యిట్లని పలికె నస్తోకమతిని.[2]

317


క.

విను మాధవ యక్రూరుని, జనకుండు శ్వఫల్గుఁ డమరసన్నిభుఁ డతఁడుం
డిన దేశంబులలో నెం, దును జెందవు మారికాదిదుర్దోషంబుల్.

318


వ.

తొల్లి కాశీరాజు తనదేశంబున ననావృష్టిదుర్భిక్షమారికాదిదోషంబులు పుట్టిన
శ్వఫల్గుం బ్రార్థించి వారణాశీపురంబునకుఁ దోడ్కొనిపోయి సకలకల్మషంబులు
వాపుకొని యాసన్నప్రసవయై యున్న తనభార్యగర్భంబులో నున్నయిక్కన్నియ
నిమ్మహాత్మునకు వివాహంబు చేసి కృతార్థుండ నగుదునని యున్న నది పండ్రెం
డేండ్లు జనించక తల్లియుదరంబునంద పెరుగుచు నొక్కనాడు తల్లిసంకటపాటు
నకు దుఃఖించి తండ్రి ట్లనియె.[3]

319


తే.

ఇంక మూఁడేండ్లకునుగాని యే జనింప, నన్నిదినములు దిన మొక్కయావు లెక్క
ధరణిదేవోత్తములకును దాన మొసఁగు, మట్లయైనను నా కుదయంబు గలుగు.

320


ఆ.

అనిన నట్లకాక యని నిత్యకృత్యంబు, నతఁడు గురున కొక్కయావు లెక్క
దాన మొసఁగుచుండెఁ దత్పుణ్యవశమునఁ, గూఁతు రుదయమయ్యెఁ గొమరు మిగిలి.

321


వ.

అది నిమిత్తంబుగా నక్కన్నియకు గాందినీనామధేయంబు చేసి శ్వఫల్గున కిచ్చె
నాదంపతులకుఁ బరమభాగవతోత్తముండైన యక్రూరుండు జన్మించెఁ దల్లిదం
డ్రులు సేసిన పుణ్యంబువలన నతఁ డున్నదేశంబులు సుభిక్షంబులైయుండు ననవ
రతయజ్ఞదీక్షారతుం డైనపుణ్యపురుషుండు సమస్తదురితంబులఁ బాపనోపు
నతండు చేసినయల్పాపరాధంబు నేరంబుగా విచారింపక లోకోపకారంబుగా
విచారించునది యనిన నందకువచనంబు లాదరించి.

322
  1. దుర్భిక్షము = కఱవు, ధారణ = క్రయనిర్ణయము, గోడుకొనియెన్ = దుఃఖపెట్టెను, త్రెక్కోలు గొనియెన్ = హింసింప నారంభించెను, సంక్రమించెన్ = ఆక్రమించెను.
  2. ప్రతికారము = ప్రతిక్రియ.
  3. కల్మషంబులు = కీడులను, ఆపన్నప్రసవ = కనప్రొద్దు లైనది.