పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అని యిట్లెన్నివిధంబులం బలికినన్ హాలామదోద్వేగలో
చనఘూర్ణీకృతుఁడై హలంబురుభుజాస్తంభంబుపై నిల్పి కో
పనిరూఢోక్తులఁ గృష్ణునిం బలికి నీబంధుత్వమున్ ద్వారకా
జనసాంగత్యము నొల్లనే నిఁక యథేచ్ఛావృత్తిమైఁ బోయెదన్.[1]

307


వ.

అని పలికి మహారోషంబున బలభద్రుండు కృష్ణుండు దన్ను నెంత పెనంగి ప్రార్థిం
చినను విడుపించుకొని మావంతునిచేత విడివడిన భద్రదంతావళంబు చందం
బున మిథిలాపురంబునకుం జని జనకచక్రవర్తిచేతఁ బూజితుండై యారాజయో
గివలన నథ్యాత్మవిషయంబులయిన యితిహాసంబులు వినుచు ధృతరాష్ట్రనందనుం
డైనదుర్యోధనునకు గదావిద్య నేర్పువాఁడై సంవత్సరత్రయం బుండె నంత.[2]

308


ఆ.

ద్వారవతికి మగిడివచ్చి దామోదరుం, డిట్టినింద దనకు నేలవచ్చె
ననుచు రేయిపగలు నాత్మఁ జింతించుచు, నుచితవర్తనమున నుండె నంత.[3]

309


ఆ.

జలజనయనువలన సంశయం బేమియు, నొందకుండు టెఱిఁగి యుగ్రసేన
బభ్రుముఖ్యు లరిగి బలభద్రుఁ దొడ్కొని, తెచ్చి రతని కలఁకదేర్చి పురికి.

310


క.

ఆరీతిని రత్నం బ, క్రూరుఁడు గొనిపోయి దాఁచి గోప్యము సేసెన్
వారక నిత్యము నెనిమిది, బారువు లర్థంబు గురియఁ బరమప్రీతిన్.[4]

311


వ.

కుబేరుండునుంబోలె మహాధనవంతుండై యుండి తనయర్థంబు నిరర్థకం బగువ్య
యంబు సేయక పరమేశ్వరార్పణంబుగా యజ్ఞంబులు సేయుచుండి యజ్ఞదీక్షా
పరు లైనక్షత్రియవైశ్యుల వధియించినవారు బ్రహ్మహంత లగుదు రని పెద్దల
చేత నెఱుంగుటం జేసి సవనదీక్షాకవచంబువలన సురక్షితుండై యఱువదిరెండు
సంవత్సరంబు లుండె నమ్మణిప్రభావంబునఁ జేసి యాదేశంబు మారికోపసర్గాది
దోషంబులు లేక విలసిల్లె నంత.[5]

312


ఆ.

భోజముఖ్యులయిన రాజు లక్రూరుని, బంధువరులు రాచపాడి దప్పి
సత్వతప్రపౌత్రు శత్రుఘ్నుఁ డనువానిఁ, ద్రుంచి రాగడమున దొమ్మిచేసి.[6]

313


తే.

తన్నిమిత్త మక్రూరుఁడు దనకు నెంత, యొప్పములు వచ్చునో యని యుండ వెఱచి
భోజసహితుఁ డై కాశికాపురికిఁ బోయెఁ, బోయినమొదలు యాదవభూమియందు.[7]

314


సీ.

జగతిపైఁ గాలవర్షంబులు లేవయ్యె సస్యంబు లెల్ల నాశంబుఁ బొందె
నత్యంతదుర్భిక్షమై దేశములు నొచ్చె ధారణ లెంతయుఁ దఱిగివచ్చె

  1. హాలామదోద్వేగలోచనఘూర్ణీకృతుండై = మద్యపానమువలని మత్తుచేత నైన కన్నులయొక్క త్రిప్పుట గలవాఁడై.
  2. మావంతునిచేతన్ = మావటివానిచేత, భద్రదంతావళంబు = భద్రజాతియేనుఁగు.
  3. రేయిపగలు = రాత్రియుఁ బగలును.
  4. వారక = తప్పక.
  5. సవనదీక్షాకవచంబువలన = యజ్ఞదీక్షయనెడు కవచమువల్ల, మారికోపవర్గాధిదోషంబు = మారీ ఉపద్రవము మొదలైనకీడులు.
  6. రాచపాడి = రాజనీతి, ఆగడముగన్ = దుష్టప్రవర్తనముచేత.
  7. ఒప్పములు = ఆపదలు.