పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కంబులను తురంగంబులం బూన్చినరథంబు సూతుం డైనదారుకుండు తెచ్చు
టయు రథారోహణంబు చేసి యతిత్వరితవేగంబున వెనుకొని చనిన.

299


చ.

గురుతరవాయువేగమున గోడిగయున్ శతయోజనంబు లు
ద్ధురగతిఁ బాఱిపాఱి దగతో మిథిలానగరోపగంఠభా
సురసహకారనీపవటచూతమధూకకదంబమాధవీ
మరువకశోభితోపవనమధ్యమునం బడి చచ్చెఁ జచ్చినన్.[1]

300


తే.

పాదచారియై రయమునఁ బాఱిపోవఁ, జొచ్చుటయు దవ్వుదవ్వులఁ జూచి శౌరి
సీరి కిట్లను నీవిందు నీరథంబు, నందుఁ జూచుచునుండు మే నరిగి యిపుడు.

301


మ.

తులువం జంపి శమంతకంబుఁ గొనివత్తున్ మీరు మెచ్చంగ నే
నలఘుప్రౌడి నటంచుఁ దేరు డిగి రంహస్ఫూర్తి సింహంబు పే
రలుక నీచమృగంబుపై నరిగినట్లై క్రోశ మే తెంచి ద
వ్వుల నోహో నిలు పోకు మంచు శతధన్వుం బల్కి యత్యుగ్రతన్.[2]

302


ఉ.

వారిజలోచనుండు బలవద్రిపుమండలఖండనక్రియా
దారుణశాతచక్రమునఁ దచ్ఛిర ముగ్రతఁ ద్రుంచి యాతనిం
జేరఁగఁబోయి మస్తకముచీర పటంబులు కంఠహారకే
యూరము లాదిగా వెదకియుం బొడగానఁడు రత్నరాజమున్.[3]

303


వ.

ఇట్లు కానక మగిడివచ్చి యావృత్తాంతంబంతయు బలభద్రునకుం జెప్పుటయు
నతండు దన్ను మొఱఁగి యారత్నం బీజాలండో యని విశ్వసింపక కోపించి
యిట్లనియె.[4]

304


క.

తమ్ముఁడవని ని న్నేగతి, నమ్మంగావచ్చు నెట్లు నాకొసఁగక ర
త్న మ్మటమటించుకొంటివి, పొమ్మిఁక నీతోడిపొత్తు పొరపొచ్చె మగున్.[5]

305


చ.

అనుటయుఁ బద్మనాభుఁడు హలాయుధుఁ గన్గొని యేను నీకు వం
చన మొనరించి దివ్యమణి యైనశమంతము దాఁచలేదు నీ
మనమున శంకగల్గిన ప్రమాణము చేసెద నీవు గోరినన్
వనరుహమిత్రుచేతఁ గొనివచ్చెద నవ్విభుకంఠమాలికల్.[6]

306
  1. ఉద్ధురగతిన్ = మిక్కిలివడిగలనడకతో, దగతోన్ = దప్పితో, ఉపకంఠ = సమీపమునందలి.
  2. రంహన్స్ఫూర్తిన్ = వేగముయొక్క స్ఫురణతో, క్రోశము = ఒకకోసెఁడుదూరము.
  3. బలవద్రిపుమండల = బలవంతులైన శత్రుసమూహములయొక్క, దారుణశాతచక్రమునన్ = భయంకరమై కఱకైన చక్రముచేత, మస్తకముచీర = తలగుడ్డ, పటంబులు = పైబట్టలు, పొడగానఁడ = చూచినవాడు కానేకాకపోయెను - కనఁబడకపోయె ననుట.
  4. మొఱంగి = వంచించి, ఈజాలండో = ఇయ్యఁడో యేమో.
  5. అటమటించుకొంటివి = అపహరించుకొంటివి, పొత్తు = స్నేహము, పొరపొచ్చెము = మిక్కిలి తక్కువైనది.
  6. శంక = సందేహము.