పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

అరద మెక్కి యతిరయంబునఁ దగువారుఁ, దాను వారణావతమున కరిగి
పాండుసుతులఁ గూడి ప్రమదంబుతోనున్న, యబ్జనాభుకడకు నరుగుదెంచి.

281


చ.

ఉడుగనిబాష్పపూరముల నుగ్మలి యవ్విభుపాదపద్మముల్
దడుపుచు నర్ధరాత్రి శతధన్వుఁడు తండ్రి నకారణంబ రూ
పడఁచుటయున్ శమంతకమహామణిరత్న మతిప్రయత్న మే
ర్పడఁ గొని చన్న ధౌర్త్యము నపారపుదుఃఖముతోడఁ జెప్పినన్.

282


క.

వెఱఁగంది శౌరి యిట్లనుఁ, దెఱవా మీతండ్రి నిట్లు దెగ చంపిన యా
మొఱకు శతధన్వు నిప్పుడ, నఱకెద మోమోటలేక నాచక్రమునన్.[1]

283


క.

అని సత్యభామ నూరా, ర్చి నళినదళలోచనుండు చెచ్చెరఁ గుంతీ
తనయుల వీడ్కొని నిజపుర, మునకుం జనుదెంచెం బయనముల వేగమునన్.

284


తే.

వచ్చి యేకాంతమునఁ దమవారలైన, యుగ్రసేనాదిబలభద్రయోధవరుల
తోడ శతధన్వుచేసిన తులువతనము, నెఱుకపడఁజెప్పి వెండియు నిట్టులనియె.

285


మ.

రవిదత్తం బగునాశమంతకమహారత్నార్థమై దారుణా
టవిలో నాఁడు ప్రసేనుప్రాణములు గెంటంజేసె సింహంబు బాం
ధవుఁ డయ్యు శతధన్వుఁ డిప్పు డిదె సత్రాజిత్తునిం జంపె ని
ట్లు వృథాదుర్మరణంబునం బడిరి తోడ్తో నన్నయుం దమ్ముఁడునున్.[2]

286


క.

అని పలికి శౌరి సీరిం, గనుఁగొని యిట్లను శమంతకము ముల్లోకం
బునకు నుపకారభూతము, మనకర్హముగాక యితరమనుజుల కగునే.[3]

287


తే.

ఇంత సేసినదుష్టాత్ము నిపుడె పట్టి, గెడపకుండిన మన కపకీర్తి వచ్చు
ననిన శతధన్వుఁ బరిమార్చి యమ్మణీంద్ర, మర్థితోఁ బుచ్చుకొన సీరి యాస సేసి.[4]

288


తే.

శౌరికంటెను గోపరసప్రపూర్ణ, హృదయుఁడై యుండె నావిధం బెల్ల నెఱిఁగి
వెఱచి శతధన్వుఁ డెంతయు విహ్వలించి, యన్యు లెఱుఁగకయుండ నేకాంతమునను.[5]

289


క.

కృతవర్మకడకుఁ జని య, చ్యుతుఁడు తనుం జంప నున్నయుద్యోగముఁ జె
ప్పి తనకుఁ దోడై రమ్మని, యతనిం బ్రార్థించి పిలిచె నాహవమునకున్.[6]

290


క.

అవ్వచనములకు మదిలో, నవ్వుచుఁ గృతవర్మ పలికె ననుఁ బిలిచెదు నీ
వవ్వనజాక్షుని మార్కొన, నివ్వెడఁ గుందనము నీకు నేటికిఁ గలిగెన్.[7]

291


ఉ.

ఏనును నీవు నేల జగ మింతయు నొక్కటఁ గూడి వచ్చినన్

  1. తెగి = సాహసించి, మొఱకు = మూర్ఖుఁడైన.
  2. గెంటంజేసెన్ = పోఁగొట్టెను.
  3. సీరిన్ = బలరాముని.
  4. కెడపకుండినన్ = చంపకున్న.
  5. విహ్వలించి = చిత్తస్వాస్థ్యము తప్పి.
  6. ఉద్యోగము - ప్రయత్నము, ఆహవమునకున్ = యుద్ధమునకు.
  7. వెడఁగుందనము = పిచ్చితనము.