పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

వచ్చినకృష్ణుని సుజనవత్సలుఁ గన్గొని ద్వారకాజనుల్
ముచ్చట లెల్ల దాపుకొని మ్రొక్కుచు సొక్కుచు సంతసంబునన్
మచ్చికలుం బ్రమోదములు మన్ననలుం గని రవ్విభుండుఁ దా
నచ్చపలాక్షి జాంబవతి నంతిపురంబున నుంచి పెంపుతోన్.

272


శా.

సత్రాజిత్తున కాశమంతకము వాత్సల్యంబుతో నిచ్చి లో
కత్రాసం బగునిందఁ బాపుకొని నిష్కాపట్యుఁడై దేవకీ
పుత్రుం డుండె జగంబు లెల్లను జగత్పూతాత్మునిన్ శుద్ధచా
రిత్రుం గృష్ణుని మెచ్చి రాదరవిహారీభూతచేతస్కులై.[1]

273


మ.

తనచిత్తంబు భయంబుఁ బాయుటకు సత్రాజిత్తుఁ డాత్మీయనం
దనఁ జంద్రాస్యను సత్యభామ యనుకన్యారత్నమున్ గోపికా
జనవక్షోరుహశాతకుంభకలశాంతర్న్యస్తకస్తూరికా
ఘనసారాంచితపీనవక్షునకు వేడ్కన్ బెండ్లి గావించినన్.[2]

274


క.

కృతవర్మయు నక్రూరుఁడు, శతధన్వునికడకుఁ బోయి సమధికకోపా
న్వితులై సత్రాజిత్తుని, యతిధౌర్త్యం బుగ్గడించి యని రాతనితోన్.[3]

275


ఆ.

మునుపు సత్యభామ మనలోన నొకరున, కిత్తు ననుచు నిశ్చయించి పలికి
యాలతాంగి నిప్పుడబ్జాక్షునకుఁ బెండ్లి, సేసె మము నిన్ను సిగ్గుపఱచి.[4]

276


తే.

ఇంత సేసిన దుష్టాత్ము నెట్టులైన, సంహరించి శమంతకచారురత్న
మపహరించినఁ బగయెల్ల నణఁగిపోవు, ననిన శతధన్వుఁ డగుఁగాక యనుచు నుండె.

277

సత్రాజిత్తుని జంపి శ్యమంతకము నపహరించిన శతధన్వుని శ్రీకృష్ణుండు సంహరించి అక్రూరునియొద్దనున్న ఆశ్యమంతకమణిని గ్రహించుట

వ.

అంత నొక్కనాడు దేవకీనందనుండు పాండునందనులు వారణావతంబున దుర్యో
ధనుకపటకృత్యంబుల నైనలక్కయిండ్ల నగ్నిభయంబుఁ బొరయకుండ రక్షించు
వాఁడై యరిగినసమయంబు వేచి.[5]

278


క.

రాత్రి సుఖనిద్రఁ జెందిన, సత్రాజిత్తును వధించి శతధన్వుఁడు త
త్పుత్రకళత్రము లఱవఁగ, క్షాత్రంబున నాశమంతకముఁ గొని చనియెన్.[6]

279


క.

కృతవర్మాక్రూరుల యను, మతమునఁ దమతండ్రిఁ జంపి మణిరత్నం బా
శతధన్వుఁ డపహరించిన, మతమంతయు సత్యభామ మది నెఱిఁగి వెసన్.[7]

280
  1. లోకత్రాసంబు = లోకమునకు భయంకరము.
  2. గోపికా...వక్షునకున్ = గొల్లపడుచులయొక్క స్తనములనెడు బంగారుకలశములయందు పూయఁబడినకస్తూరిగందముచేత మనోజ్ఞమై విశాలమైనఱొమ్ముగలవానిని.
  3. ధౌర్త్యంబు = ధూర్తత్వము - ఆకతాయతనము.
  4. సిగ్గుపఱచి = అవమానపఱిచి.
  5. వేచి = కనిపెట్టి.
  6. క్షాత్రంబునన్ = చలముతో.
  7. మతము = అభిప్రాయము - వృత్తాంతమనుట.