పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డెనిమిదినాళ్లు సూచి యతఁ డీల్గెనొ కాకని ద్వారకాపురం
బున కరుదెంచి భక్తిపరిపూర్తి దిలోదకపిండదానముల్
గొనకొని చేసె బంధుజనకోటి యథావిధిపూర్వకంబుగన్.[1]

265


ఆ.

అందువలనఁ గృష్ణఁ డాప్యాయితశరీరుఁ, డగుచు నతులశక్తి నని యొనర్పె
నిపుడు జాంబవతుఁ డాహారనిద్రలు, లేమిఁ జేసి బలిమి లేక పోరె.[2]

266


ఉ.

బల్లిదు లైనఋక్షయదుభర్త లుదగ్రపరాక్రమంబులన్
మల్లు పెనంగునంత మురమర్దనుముష్టిహతాఖిలాంగుఁడై
తల్లడపాటు చిత్తమునఁ దార్కొన బీరముఁ గట్టిపెట్టి యా
భల్లవిభుండు గృష్ణునకు భక్తిమెయిం బ్రణమిల్లి యిట్లనున్.[3]

267


మ.

మును లంకాపురిలోన రావణుబలంబుల్ రాముసైన్యంబుతో
నని గావించు నెడన్ నిశాచరుల నుద్ఘాటించి రామావనీ
శుని మెప్పించితి నట్టి నా కొకమనుష్యుం డెంత నాపేరు వి
న్నను దేవాసురవీరసైన్యములకైనన్ గర్వముల్ బెండగున్.[4]

268


ఉ.

నిన్ను మనుష్యమాత్రుఁడని నిక్కముఁ జెప్పఁగరాదు సత్వసం
పన్నత జూపి నన్ను బహుమానము సేయఁగవచ్చినట్టి యా
పన్నగశాయి యట్ల కనుపట్టెద వింక ననుగ్రహింపవే
యన్న మురాంతకుండు దరహాసము మోమున నివ్వటిల్లఁగన్.[5]

269


చ.

తను నెఱిఁగించి చిత్తమునఁ దార్కొని యున్నకృపాంబురాశిలో
ననయము నోలలార్చి చటులాహవభేదము లెల్లఁ బుచ్చివై
చినఁ బరమానురాగమునఁ జెంది ముకుందుని మేడలోనికిం
గొని చని పూజ సేసి తనకూఁతును జాంబవతిం బ్రియంబునన్.[6]

270


ఉ.

కానుక యిచ్చి పెండ్లి యొడికంబుగఁ జేసి శమంతకంబుతో
మానితవస్తుజాలము సమగ్రముగా నుపదాన మిచ్చినన్
దానవసూదనుండు ప్రమదంబున జాంబవతీసమేతుఁడై
తా నరుదెంచె లోకవిదితంబుగ ద్వారకకున్ బ్రియంబుతోన్.[7]

271
  1. గరువంబునన్ = గౌరవముతో, ఈల్గెనొకాకని = చచ్చెనేమో యని, కొనకొని = సాంతముగా.
  2. ఆప్యాయితశరీరుఁడు = బడలిక తీఱిన దేహము కలవాఁడు, అని యొనర్చె= యద్ధము చేసెను.
  3. మల్లు పెనంగునంతన్ = మల్లయుద్ధము చేయునపుడు, ముష్టిహతాంగుఁడు = పిడికిటిపోటులచేత కొట్టువడిన యెల్లయవయవములు గలవాఁడు, తల్లడపాటు = విచారము, బీరమున్ = శూరత్వమును, కట్టిపెట్టి = మాని, భల్లవిభుండు = భల్లూకరాజు, ప్రణమిల్లి = నమస్కరించి.
  4. ఉద్ఘాటించి = చంపి, బెండగున్ = నిస్సారములగును.
  5. నివ్వటిల్లఁగన్ = అంకురింపగా.
  6. అనయము = మిక్కిలి, ఓలలార్చి = తేల్చి, చటులాహవఖేదములు = ఘోరయుద్ధమువలని బడలికలు, పుచ్చివైచినన్ = పోఁగొట్టఁగా.
  7. ఒడికంబుగన్ = ఒప్పిదముగా, ఉపదానము = అరణము, దానవసూదనుండు = రాక్షసులను చంపువాఁ డైన శ్రీకృష్ణుఁడు, లోకవిదితంబుగన్ = ఎల్లజనులకుఁ దెలియునట్లు.