పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని యాశ్వాసించి పుచ్చె నంత సత్రాజిత్తుండును నిజనివాసంబునకు వచ్చి సుఖం
బుండె నాశమంతకరత్నంబు.[1]

248


క.

ఎనిమిదిబారువు లర్థము, దినదినమును గురియుచుండ దీనార్థిజనా
వనుఁడై సత్రాజిత్తుఁడు, ఘనసంపదవలన మహిమ గైకొనియుండెన్.[2]

249


మ.

ఉపసర్గాధికహీనవృష్టి పటువాయువ్యాజనానాసరీ
సృపదుర్భిక్షజలాగ్నిదుష్టవిమతక్షోభాదిదోషంబులం
దపనీతం బగుచున్ మహామహిమతో నారాష్ట్ర మత్యంతధ
ర్మపరంబై వెలిఁగెన్ శమంతకమహారత్నప్రభావంబునన్.[3]

250


వ.

అంత నొక్కనాఁడు మురాంతకుం డత్యంతగుణవంతం బైనశమంతకంబు మహీ
కాంతుం డైనయుగ్రసేనుని నిశాంతంబున నుండ నర్హం బతని కిప్పింతమని
యేకాంతంబున నభ్యంతరజనంబులతోడం జింతసేసి బలవంతంబు చేసిన బంధు
ద్రోహం బగునని కొంకి యెప్పటియట్ల యుండెఁ దద్వృత్తాంతంబంతయు
సత్రాజిత్తుం డెఱింగి యంతరంగంబున గలంగి.[4]

251


క.

ఇమ్మణిరత్నము గృష్ణుం, డిమ్మనినఁ బ్రియంబుతోడ నీవలయును నీఁ
బొమ్మని త్రోచినఁ గడువిర, సమ్మగు బలవంతుతోడి చల మేమిటికిన్.[5]

252


తే.

అని తలంచి సహోదరుఁ డగు ప్రసేను, నపుడ రప్పించి యిచ్చిన నతఁడు దాని
గంఠమాలికలో గ్రుచ్చి కట్టికొనియె, నెంత యాప్తులచేతికి నీఁదలంకి.[6]

253


చ.

నరవరసూనుఁ డొక్కఁ డొకనాఁడు తురంగము నొక్కి వేఁటమై
నరిగి వనంబులోనఁ దిరుగాడఁగ సింహము వచ్చి యావిభుం
దురగముతోడఁ బట్టికొని దుష్టగతిన్ వధియించి మించి త
ద్వరమణిరత్నముం గొని జవంబునఁ బోవుచు నున్నయత్తఱిన్.[7]

254


తే.

చటులగతి ఋక్షపతి యైన జాంబవంతుఁ, డామృగేంద్రముఁ బరిమార్చి యాశమంత
కంబుఁ గొనిపోయి తనదుబిలంబుఁ జొచ్చి, తనయుఁ డగుసుకుమారున కొనర నిచ్చె.[8]

255


సీ.

అంత యాదవవీరు లాప్రసేనునిచావు విని యెంతయును దుఃఖవివశు లగుచు
దామోదరుఁడు శమంతక ముగ్రసేనున కిప్పింత మనుచుండు నెల్లనాఁడు

  1. ఆశ్వాసించి = సమాధానపరిచి.
  2. దీనార్థిజనావనుఁడు = దరిద్రులను యాచకులను రక్షించువాఁడు.
  3. ఉపవర్గ...దోషంబులన్ = మారీఉపద్రవము మొదలగు ఉత్పాతములు మితిమీఱిన వానలు వానలేమి పెనుగాలి వీచుట బహువిధములైన సర్పములవలనిభయము కఱవు నీళ్లు నిప్పు దుర్జనులు శత్రువులు వీరివలని కలఁతపాటు మొదలుగాఁగలలోపములు, అపనీతంబు = తొలఁగింపఁబడినది.
  4. నిశాంతంబునన్ =ఇంట, బలవంతంబు = నిర్బంధముఁ, కొంకి = సంకోచించి.
  5. త్రోచినన్ = విడనాడినను.
  6. తలంకి = వెఱచి.
  7. ఒక్కఁడు = ఒక్కఁడే, వేఁటమైన్ =వేటాఁడుటకొఱకై.
  8. ఋక్షపతి = ఎలుఁగులరాజు.