పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రాయ మెలర్పఁజెప్పి యనురాగముతోడ వివాహమయ్యె
నాయెడఁ దప్పుఁబట్టదు మనంబున నాసతి గొడ్డు గావునన్.

221


వ.

అని నిశ్చయించి యక్కన్యారత్నంబుఁ దోడుకొని యతిప్రయత్నంబున రథం
బెక్కించుకొని విజయలక్ష్మీసమేతుండై వచ్చునప్పు డతనికిఁ దోడుగాఁ బౌరజన
భృత్యామాత్యవర్గంబుతో శైబ్య వచ్చి జీవతేశ్వరు సవ్యభాగంబున నున్నయ
క్కన్యఁ జూచి కలుషతామ్రలోచనయై యదరిపడి యిట్లనియె.[1]

222


ఉ.

ఈహరిణాక్షి యెవ్వరిది యేటికిఁ దెచ్చితి నీకు దీనిపై
మోహము గల్గెనో ముదిసి ముప్పున నన్నుఁ దిరస్కరించి యు
ద్వాహముగాఁ దలంచితొ కదా యనినం గడుభీతమానసుం
డై హృదయంబు జల్లుమన నంగనతోడ నృపాలుఁ డిట్లనున్.

223


తే.

కోడ లిది మనయింట నీకోమలాంగి, యుండఁదగు నని తెచ్చితినో మృగాక్షి
నీకుఁ బ్రియమేని నీయొద్ద నిలుపుకొనుము, కాకయుండిన వేఱొకకడకు ననుపు.

224


చ.

అనవుడు నేను వంధ్యను నరాధిప వేఱొకభార్య లేదు నీ
కును సుతుఁ డెవ్వఁ డీతరుణి కోడలుగాఁ గత మేమి యన్న న
వ్వనిత యొడంబడం దగినవాక్యముఁ గానక కొంతసేపు మె
ల్లన వినయంబుఁ జేసి తెరలంబడి యాసతితోడ నిట్లనున్.[2]

225


తే.

నీవు గొడ్రాలవై యుండెదే కుమారుఁ, డుదయమందకపోవునో యువిద సుతుఁడు
గలిగినప్పుడు కోడలు గలదె నీకు, ననుచు నేరమిమొఱఁగు లిట్లాడుటయును.[3]

226


తోటకవృత్తము.

దరహాసముతో వనితామణి యా, ధరణీవరుఁ బ్రమదంబున మం
దిరసౌధములోనికిఁ దెచ్చి మనో, హరసౌఖ్యము లందుచు నాతనికిన్.[4]

227


క.

గర్భంబుఁ దాల్చి యాసతి, యర్భకునిం గాంచెఁ బటుతరాహితరాజ్య
స్వర్భానుఁ డైనయతని వి, దర్భుం డనుపేరు పెట్టి ధర్మస్థితితోన్.[5]

228


క.

తామును గొనివచ్చిన కన్యామణిఁ బరిణయము చేసి యాతనయుని ధా
త్రీమండలాధిపతిగా, జ్యామఘుఁ డొనరించి తపము సలుపఁగఁ జనియెన్.

229


వ.

అట్టి విదర్భుపేర నారాజ్యంబు విదర్భదేశం బయ్యె నట్టివిదర్భునకుఁ గ్రథకైశిక
రోమపాదు లనంగ నిరువురుకుమారులు జన్మించి రందు.

230


సీ.

రోమపాదునకు విభ్రుఁడు పుట్టె వానికి ధృతి పుత్రుఁడయ్యె నాధృతికిఁ గౌశి
కుఁడు గల్గె నాకౌశికునకుఁ జేది జనించి నాచేదివంశజు లైనవారు

  1. కలుషతామ్రలోచన = కోపముచేత ఎఱ్ఱవాఱినకన్నులు గలది.
  2. వంధ్యను = గొడ్డురాలను, తెరలంబడి = తేఱుకొని.
  3. నేరమిమొఱఁగులు = నేర్పుచాలని వంచనమాటలు.
  4. ధరహానముతోన్ = చిఱునవ్వుతో.
  5. స్వర్భానుఁడు = రాహువు.