పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

వైరిపతుల్ మహోగ్రరథవారణఘోటకకపఙ్క్తియుక్తులై
భూరిబలంబుతో నతనిభూమి సమస్తము చూఱలాడఁగాఁ
జారులచే నెఱింగి నృపచంద్రుఁడు భార్యయనుజ్ఞఁ బూని దు
ర్వారపరాక్రమక్రమవిరాజితుఁడై రథ మెక్కి సేనతోన్.[1]

216


మ.

చని సంగ్రామమునందు దారుణరిపుక్ష్మాపాలలోకంబులన్
ఘనవజ్రప్రతిమానశాతవిశిఖాఘాతంబులం బ్రాణముల్
గొనినన్ మార్కొని నిల్వలేక కడుసంక్షోభించి నానాదిశాం
తనితాంతక్షితిభృద్గుహావళులలోనం దూఱి రత్యుద్గతిన్.[2]

217


వ.

ఇవ్విధంబున నరాతిచక్రంబు పరాక్రమింపనోపక నిజపుత్రమిత్రకళత్రబంధుబల
కోశాదినానాసంపదలతోడఁ దమతమనివాసంబులు విడిచి పలాయితు లైన
రాజన్యచూడామణి విజయసంపన్నుండై శత్రువులసమీపంబున మగిడివచ్చువాఁ
డెదుర.[3]

218


మ.

కనియెన్ దైన్యరసప్రపూరితముఖిన్ గండస్థలవ్యస్తహ
స్తను బాష్పాంబునిమజ్జమానకుచ నంచత్ప్రాయనాత్తోపకం
ఠను సంత్రాసవిలోలలోచననిరూఢన్ స్రస్తధమ్మిల్లబం
ధను నత్యంతభయాపనేయజనశూన్యన్ రాజకన్యామణిన్.[4]

219


చ.

కనుఁగొని జేరవచ్చి భయకంపితగద్గదకంఠనాద యై
జనకునిఁ దల్లిఁ బేరుకొని సంతతముం బరిదేవనంబు మా
వని నృపకన్య నూఱడిల నమ్మికమాటలు పల్కి దానిచే
నొనరఁగఁ బేరుఁ బెంపుఁ గులమున్ విని మన్మథరాగచిత్తుఁ డై.[5]

220


ఉ.

ఈయెలనాఁగఁ దోడుకొని యిప్పుడ యేను పురంబులోనికిం
బోయి మదీయమోహమును బుత్రులు లేమియు శైబ్యతో నభి

  1. వైరిపతులు = శత్రురాజులు, చూఱలాడఁగాన్ = కొల్లపెట్టఁగా.
  2. దారుణ = క్రూరులైన, శాతనిశిఖాఘాతంబులన్ = తీక్ష్ణములైన బాణముల వ్రేటులచేత, సంక్షోభించి = కలఁతపడి, నానాదిశాంతనితాంతక్షితిభృద్గుహావళులలోనన్ = నలుదిక్కుల కడలయందలి విశాలములైన కొండగుహలపఙ్క్తులయందు, అత్యుద్గతిన్ = అతివేగముగలగమనముతో.
  3. అరాతిచక్రంబు = పగవారిగుంపు, కోశాది = బొక్కసము మొదలగు, పలాయితులైనన్ = పాఱిపోఁగా.
  4. ప్రపూరిత = మిక్కిలి నిండింపఁబడిన, గండస్థలన్యస్తహస్తను = చెక్కిళ్లయం దుంచఁబడినచేతులు గలదానిని, బాష్పాంబునిమజ్జమాన = కన్నీళ్లచేత తడియుచున్న, అంచత్ప్రాయన్ = మనోజ్ఞమైన యావనము గలదానిని, అత్తోపకంఠన్ = పొందఁబడిన సమీపము గలదానిని, (లేక) అంచత్ప్రాయనాత్తోపకంఠన్ = మనోఙ్ఞయౌవనముచేత పొందింపఁబడిన సమీపము గలదానిని, సంత్రాసవిలోలలోచననిరూఢన్ = భయముచేత చలించుచున్నచూపులను వహించినదానిని, ప్రస్తధమ్మిల్లబంధన్ = వీడినకొప్పు గలదానిని, అత్యంతభయాపనేయజనశూన్యన్ = మిక్కుటమైనభయమును పోఁగొట్టునట్టి జనులు లేనిదానిని.
  5. పేరుకొని = పేరు గ్రుచ్చి - తలఁచుకొని యనుట, పరిదేవనంబు = విలాసంబును.