పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ఒలసినవేడ్క నానానృపతి యొక్కముహూర్తమునందు లక్షభా
ర్యల వరియించి యందఱకు నన్నివిధంబుల నిష్టసౌఖ్యముల్
సలుపుచునుండు నొక్కొకవిలాసిని వేవురు వేవురాత్మసూ
సులఁ గనఁగా జగన్నుతఘనుల్ పదికోట్లతనూజులై రొగిన్.[1]

207


ఉ.

నీతివివేకధుర్యగుణనిర్మలులై పదికోట్లపుత్రులున్
భూతలమంతయున్ నిజవిభూతి యెలర్పఁగ నేలుచుండఁగా
నాతతచక్రవర్తి మహిమాతిశయంబున నేడుదీవులుం
బ్రీతి వహింప నేలె శశిబిందుఁడు సాధుజనైకవిందుఁడై.[2]

208


ఉ.

ఆపదికోట్లపుత్రులకు నగ్రజుఁ డైనపృథుశ్రవుండు ధా
త్రీపతి యయ్యె నానృపవరేణ్యునకుం దముఁ డుద్భవించె నా
భూపకులావతంసునకుఁ బుత్రకుఁడై యుశనుండు పుట్టె వాఁ
డేపున దక్షిణల్ ద్విజుల కిచ్చి యొనర్చె దశాశ్వమేధముల్.[3]

209


మణిగణనికరవృత్తము.

ఉశనునిగతిమతియుతుఁ డనఁదగు న
య్యుశనునకును దనయుఁడు గలిగె జగ
ద్విశదయశుఁడు జనవినుతుఁడు కరుణా
తిశయుఁడు నితవుఁడు దినకరనిభుఁ డై.

210


వ.

వానికి మధుండు పుత్రుండయ్యె వానికిఁ బరాజితుండును రుతుండును పృథు
రుక్తుండును జ్యామఘుండును పలితహరితుండును నన నేవురు పుత్రులైరి
వారియందు.

211

తనపుత్రుం డగువిదర్భునకు వయోధికస్త్రీని పెండ్లి సేసిన జ్యామఘునివంశానుక్రమము.

క.

జ్యామఘుఁడు శైబ్య యనుకాం, తామణి వరియించి తాను దానికి వశుఁడై
యామగువ దనకు నేలిన, స్వామివిధంబునను రాజసంబున నుండెన్.[4]

212


క.

భామినులకు వశులై యీ, భూమండలిలోనఁ దిరుగుపురుషులలోనన్
జ్యామఘుఁడె యెక్కు వనుచును, వేమఱుఁ జెప్పుదురు జనులు విచ్చలవిడితోన్.

213


క.

ఆలు దనరాజ్యమంతయుఁ, బాలించఁగ దానిఁ గొల్చి బంటై యుండెన్
లీలఁ దనవంటిరాజులు, మేలంబున నపహసింప మెలఁగుచు వేడ్కన్.[5]

214


వ.

ఇట్లు భార్యావశుండై జ్యామఘుండు సంతానార్థంబుగాఁ దపంబు సేయం
జనుటయు.

215
  1. ఒలసిన = పొందిన.
  2. ఆతత = అధికతరమైన, సాధుజనైకవిందుఁడు = సాధువులైన జనులచేతనే తెలియఁబడువాఁడు.
  3. భూపకులావతంసునకు = రాజవంశశ్రేష్ఠునకు.
  4. స్వామి = ఒడయఁడు.
  5. మేలంబునన్ = సరసత్వముతో.