పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్రీవిభుఁడు వేయిచేతుల, నావాహిని నీరు దొట్టునట్లుగఁ జేసెన్.[1]

197


క.

పదపడి చేతులు దిగిచిన, నదిజలములతోడఁ గూడ నానావిధసం
పద లెల్ల వఱదఁబోయినఁ, ద్రిదశాంతకుఁ డలిగి కోపదీప్తహృదయుఁడై.[2]

198


క.

చతురంగబలముతో ను, ద్ధతుఁడై కృతవీర్యపుత్రుఁ దాఁకిన నతఁ డా
శతమఖవిరోధి మార్కొని, యతిభీషణవృత్తిఁ బోరి యతులితశక్తిన్.[3]

199


తే.

పశువుఁ బట్టినకైవడిఁ బట్టి తెచ్చి, బందిగములోన శృంఖలాబద్దుఁ జేసి
పెక్కువత్సరములు చెఱఁబెట్టి విడిచె, నాపులస్త్యాదిమౌనీంద్రు లడిగికొనఁగ.[4]

200


క.

ఈ తెఱఁగున బహుబలసం, స్ఫీతుండై యెదురు లేని పెంపునఁ బంచా
శీతిసహస్రాబ్దంబులు, భూతలమంతయును నేలె భూరిప్రౌఢిన్.[5]

201


తే.

అతఁడు కాలావసానంబునందు నరిగి, యాదినారాయణాంశజుం డైనపరశు
రాముశాతకుఠారధారావిభిన్న, బాహుమస్తకుఁడై కాంచెఁ బరమపదము.[6]

202


వ.

అట్టికార్తవీర్యార్జునునకు నూర్వురు కుమారులు జన్మించి రందు శూరసేన వృష
సేన మధు జయధ్వజు లన నేవురు ముఖ్యులైరి. వారియందు జయధ్వజునకు తాళ
జంఘుండు పుట్టె. ఆతాళజంఘునకుఁ దాళజంఘాఖ్యులు నూర్వురు తనయులు
జనించి రం దగ్రజుండు వీతిహోత్రుండును దదనుజన్ముండు భరతుండు ననం
బరగిరి. అందు భరతునకు వృషుండును, వృషునకు మధుండును వానికి వృష్ణి
ప్రముఖులు నూర్వురుకొడుకులునుం బుట్టిరి. ఆవృష్ణిపేర వృష్ణివంశంబు ప్రవృ
త్తంబయ్యె. మఱియు యదుపుత్రుం డైనక్రోష్టునకును.

203


ఆ.

వంశకారుఁ డైన ధ్వజినీశుఁ డనుకళా, వంతుఁ డుదయమయ్యె వానియందు
స్వాతి పుట్టె వానివరపుత్రుఁ డై ఋశం, కుండు జననమయ్యె గుణయుతుండు.

204


క.

పంకజహితనిభుఁ డైనఋ, శంకునకును జిత్రరథుఁడు జన్మించె నిరా
తంకయశుఁ డతఁడు లోకవ, శంకరు శశిబిందుఁ గాంచె సత్పుత్రునిఁగాన్.[7]

205


వ.

అతఁడు చతుర్దశలోకచక్రవర్తి యై.

206
  1. తొట్టు = ఉబుకు.
  2. వఱద = ప్రవాహము, త్రిదశాంతకుఁడు = దేవతలపాలిటి యముఁడైన రావణుఁడు.
  3. ఉద్ధతుఁడు = నిక్కు గలవాఁడు, శతమఖవిరోధిన్ = ఇంద్రునికి పగవాఁడైన రావణుని, భీషణవృత్తిన్ = భయంకరమైనవ్యాపారముతో.
  4. బందిగములోనన్ = చెఱసాలయందు, శృంఖల = సంకెల.
  5. సంస్ఫీతుండు = విజృంభించినవాఁడు.
  6. శాతకుఠారధారావిభిన్నబాహుమస్తకుఁడు = కఱకైనగండ్రగొడ్డటిపాదరచేత నఱకఁబడిన భుజములును తలయుఁ గలవాఁడు, కాంచె = పొందెను.
  7. పంకజహితవిభుఁడు = సూర్యునిం బోలినవాఁడు, నిరాతంకయశుఁడు = కళంకములేని కీర్తి గలవాఁడు, లోకవశంకరుఁడు = లోకమునంత వశవఱుచుకొన్నవాఁడు.