పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దగుసంభావన లిచ్చిపుచ్చుటయె పోధర్మంబు లోకేశ్వరుం
డగు దేవేంద్రుడు వచ్చి నాయెదుర దైన్యవ్యక్తు లాడంగ నీ
చగుణంబుల్ పచరింపఁగాదని కృపాసందీప్తచేతస్కుఁడై.[1]

160


క.

అనిమిషపతి కింద్రత్వం, బనురాగముతోడ నిచ్చి యమరావతికిం
జనుమని నిజపురమునకును, జననాథుఁడు వచ్చియున్నసమయమునందున్.

161


క.

నారదుకుటిలవిచార, ప్రేరితులై వానిసుతులు పితృధనమగు నా
స్వారాజ్యపదముఁ గైకొనఁ, బౌరుషమున నింద్రువీటిపై నరుగుటయున్.[2]

162


ఆ.

పాకశాసనుండు నాకంబు విడిచి యెం, దేని మానిపోయె మానవేంద్రు
తనయు లమరపురముఁ దామ కైకొని యజ్ఞ, భాగములు నిలింపపతుల కీక.[3]

163


తే.

తామ గైకొని పెక్కేండ్లు ధర్మవృత్తి, నున్న సమయంబునం దింద్రుఁ డొక్కనాఁడు
దేవతాగురుపాలి కేతెంచి మంత, నమున నిట్లని పలికె దైన్యంబు గదుర.[4]

164


క.

మునినాథ పురోడాశం, బునకుం గడువాఁచి నోరు పుతపుత మనఁగా
నిను వేఁడెద యజ్ఞములకుఁ, జనియించుక దాఁచి తెచ్చి చవిచూపఁగదే.[5]

165


క.

అనిన బృహస్పతి మిక్కిలి, దనమనమున వగచి దేవతాపతికి శుభం
బును రిపులకు నశుభంబును, నొనఁగూడఁగ నాభిచారహోమము చేసెన్.[6]

166


ఉ.

అందుల కీడు దాఁకి మనుజాధిపుపుత్రులు దుర్వివేకముల్
చెంది మహాక్రతుక్రియలు చెల్లుట కోర్వక వేదమార్గముల్
నింద యొనర్చుచున్ ద్విజుల నెక్కొని చంపుచుఁ బాపకర్ములై
యందఱుఁ దమ్ముఁదామె హతులై చెడిపోయిరి నాడునాటికిన్.[7]

167


వ.

ఇ ట్లుపాయంబున రిపులవలన జయంబుగొని యింద్రుండు నిజపురోహితువలన
నాప్యాయితయజ్ఞభాగుండయి దినంబున సుఖంబుండె నీచరిత్రంబు వినినవారికి
స్థానభ్రష్టత్వంబు లేదని చెప్పి మఱియు నిట్లనియె.[8]

168


తే.

క్షత్రవృద్ధునిసంతతి జగతియందు, బహుపరంపరలై కడుఁ బ్రబలమయ్యె

  1. క్రిందుపడి = అణఁగి, సంభావన = మన్నన, దైన్యవ్యక్తులు = దీనత్వముతోడిమాటలు, పచరింపన్ = ప్రకటింప, కాదు =తగదు, కృపాసందీప్తచేతస్కుఁడు = దయను ప్రకాశపఱుచునట్టి చిత్తవృత్తి గలవాఁడు.
  2. కుటిలవిచార = కపటమైన యాలోచనచేత, పితృధనము = తండ్రి సొత్తు, స్వారాజ్యపదము = స్వర్గరాజ్యస్థానమును - స్వర్గలోకపుదొరతనమును, వీటిపైన్ = పట్టణముమీఁదికి.
  3. ఎందేనిన్ = ఎక్కడనో, మానిపోయేన్ = అణఁగిపోయెను.
  4. మంతనమునన్ = ఏకాంతమునందు.
  5. పురోడాశంబునకున్ = హవ్యమునకు.
  6. వగచి = విచారపడి, అభిచారహోమమున్ = పరహింసాకరమైన హోమమును.
  7. చెల్లుటకు = జరగుటకు, నెక్కొని = పూని, తమ్ముఁదామె = తమకుఁదామె.
  8. రిపులవలనన్ = శత్రువులవలన, ఆప్యాయితయజ్ఞభాగుండు = యజ్ఞభాగములచేత తనువునొందింపఁబడినవాడు - యజ్ఞభాగములచేఁ దనిసినవాఁడనుట.