పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రజియనువాని కింద్రపదము వచ్చుట

వ.

అయ్యలర్కునిపుత్రపౌత్రాంతరంబు లనేకతరంబులు గలిగె వారియందుఁ జాతు
ర్వర్ణ్యంబులు ప్రవర్తిల్లె నిది కౌశేయవంశప్రకారం బని వెండియు.

149


క.

అనఘాత్మ విను పురూరవు, మనుమం డగురజి ప్రతాపమహితుల సుతులం
గనియెను బంచశతకముల, ననిమిషపతి నైన గెల్చు నతిబలయుతులన్.

150


శా.

ఆకాలంబున దేవదానవులు ఘోరాకారసంగ్రామకే
ళీకౌతూహలచిత్తులై యరిగి నాళీకాసనుం గాంచి దే
వా కయ్యం బొనరింపుచో జయమునన్ వర్తిల్లువా రెవ్వరో
మాకుం జెప్పుమటన్నఁ బద్మజుఁడు సమ్యగ్బుద్ధితో నిట్లనున్.[1]

151


క.

నిజము పురూరవుమనుమఁడు, రజి యెవ్వరివంక నిలిచి రణరంగములో
భుజబలముఁ జూపు వారలె, విజయముఁ జేకొందు రనుచు వినిపించుటయున్.[2]

152


క.

అనిమిషులకంటె ముందఱ, దనుజులు సనుదెంచి రాజతనయునిఁ బ్రార్థిం
చిన నతఁడు వారినందఱిఁ, గనుఁగొని యిట్లనియె వినయగౌరవ మొప్పన్.

153


క.

అనిలోన మీకుఁ దోడై, యనిమిషులను గెలిచి విజయ మనురాగముతో
నొనరింతునేని మీ కిం, ద్రునిఁగా నను జేయనోవుదురె మీ రనినన్.

154


క.

మాకెల్లఁ గర్త పుణ్య, శ్లోకుఁడు ప్రహ్లాదుఁ డతనిశుభముకొఱకె పో
యీకయ్య మిట్లు గాదని, నీ కింద్రత్వంబు నొసఁగ నేర్తుమె యనుచున్.

155


ఆ.

ఇయ్యకొనక దనుజు లేగిరి పదపడి, యమరవరులు వచ్చి యసురవీరు
లట్ల వేఁడుకొన్న నారాజు దైత్యులఁ, బలికినట్ల సురలఁ బలుకుటయును.[3]

156


వ.

నిలింపులు దమలో విచారించి కార్యదాహంబునం జేసి దేవేంద్రత్వం బతని కిచ్చు
టకు వొడంబడిరి రజియును దేవసైన్యసహాయుండై రణంబున దైత్యదానవుల
మర్దించి విజయంబుఁ గైకొనియున్న యతనిపాలికిఁ బురందరుండు వచ్చి సాష్టాంగ
దండప్రణామం బాచరించి చేతులు మొగిచి యిట్లనియె.[4]

157


చ.

కడుభయ మైనవేళఁ గృపఁ గాచిన యాతఁడుఁ గన్నతండ్రియున్
జడియక యొక్కరూ పగుట సత్యము దుష్టవిరోధికోటిచే
బొడమిన భీతి మాన్పి దయఁ బ్రోచితి గావునఁ దండ్రి నీవు నే
కొడుకను నీమహామహిమకుం దగువాఁడనె కాక లాఁతినే.[5]

158


ఆ.

ఇంతకంటె నీకు నింద్రత్వ మేటికి, నేమి ఘనము మానవేంద్రచంద్ర
నన్నుఁ గరుణఁ జూచి నాలోకమున నిల్పి, యలరఁజేయుమన్న నవ్విభుండు.

159


మ.

పగవాఁడైనను వచ్చి క్రిందుపడి తాఁ ప్రార్థించినన్ వానికిం

  1. సంగ్రామకేళీ = యుద్ధక్రీడయందు, నాళీకాసనున్ = బ్రహ్మను, సమ్యగ్బుద్ధితో = మంచిబుద్ధితో.
  2. వంక = తట్టు.
  3. దైత్యుల బలికినట్ల = రాక్షసులతో చెప్పినట్టె.
  4. నిలింపులు = దేవతలు, కార్యదాహంబునం జేసి = (పొసఁగిన) కార్యమువలని సంతాపముచేత.
  5. జడియక = తప్పక యనుట.