పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నకళాకర్మఠవైష్ణవాంశజననవ్యాపారశౌర్యుండు శం
భుకుమారప్రతిమానుఁడై పరశురాముం డుద్భవించెన్ ధరన్.[1]

137


వ.

మఱియు విశ్వామిత్రునకు భార్గవుం డైనశునశ్శేఫుండు దేవతలవలన దత్తపుత్రుం
డయ్యె నాశునశ్శేఫునకు దేవరాతుండు పుట్టె మఱియు విశ్వామిత్రునకు మధు
చ్ఛందకృతదేవాష్టకహారీతులనువారు జన్మించి పరమర్షికన్యకల వివాహం బైరని
యమావసువంశంబు చెప్పి పరాశరుండు వెండియు నిట్లనియె.

138

నహుషక్షత్రవృద్ధరజిప్రముఖులజననము

తే.

విను పురూరవునకు నగ్రతనయుఁడైన, నాయు వనురాజు రాహువు నాత్మపుత్రిఁ
బరిణయం బొనరించె నాభామయందుఁ, గనియె నేవురుకొడుకుల గరిమతోడ.

139


వ.

వారినామధేయంబులు వినుము నహుషక్షత్రవృద్ధరంభరజ్యనేనస్సులనం బ్రసి
ద్దులైరి.

140


తే.

వారిలోన నేనుం డనువానికిని సు, హోత్రుఁ డుదయించె నతనికిఁ బుత్రు లైరి
కృత్సమదకాశ్యకాశులు కీర్తిధనులు, రాజసూయాదియజ్ఞముల్ రమణఁ జేసి.

141


ఆ.

అందుఁ గృత్సమదునియందుఁ జాతుర్వర్ణ్య, సంప్రవర్తకుండు శౌనకుండు
పుట్టెఁ గాశ్యునందు భూరితపోనిధి, తనయుఁ డయ్యె దీర్ఘతపుఁ డనంగ.[2]

142


వ.

ఆదీర్ఘతపునకు ధన్వంతరి జనియించె నట్టిధన్వంతరికిఁ గేతుమంతుండు పుట్టె వానికి
వారణాసీపతియైన దివోదాసుండు పుట్టె వానికిఁ ద్రివర్ధనుండు పుట్టె నతండు.

143


ఆ.

కువలయంబు నాఁగగుఱ్ఱంబు నెక్కి యీ, కువలయమున దినముఁ గ్రుమ్మరంగ
నతఁడు కువలయాశ్వుఁ డనునామధేయంబు, గలిగి గౌరవమున నలరుచుండు.

144


ఆ.

వత్స వత్స యనుచు వాత్సల్యమునఁ దండ్రి, తన్నుఁ బిలుచుచున్న తన్నిమి త్త
మున నతండు వత్సుఁ డనుమహీవిభుఁ డయ్యె, వత్సదేశ మయ్యె వానిపేర.

145


ఉ.

శాత్రవమండలేశ్వరుల సంగరరంగములన్ జయించఁగా
శత్రుజయుండు నాఁ బరఁగె సత్యము దప్పక రాజ్యవైభవం
బాత్రిదశేంద్రుఁ బోలి యరయంగ ఋతుధ్వజుఁ డయ్యె నిమ్మెయిన్
క్షత్రియవంశజాతులకుఁ గల్గు సమంచితనామకర్మముల్.[3]

146


వ.

అట్టి కువలయాశ్వుండు పరమపతివ్రతయైన మదాలసయందు నలర్కుండను రాజుం
గాంచె నయ్యలర్కుండు.

147


తే.

అవనియెల్లను నఱువదియాఱువేలు, వత్సరంబులు నూత్నయౌవనము దనకు
గెంటిపోకుండఁ బాలించెఁ గీర్తి వెలయ, భూపకోటి యలర్కునిఁ బోల రెందు.[4]

148
  1. సకల...లోకుఁడు = ఎల్లరాజవంశములను భంగపెట్టుట యనువిద్యతోఁ గూడిన భుజబలముచేత ప్రసిద్ధినొందిన సకలలోకములు గలవాడు, మహీ...శౌర్యుండు = భూభారమును అణఁచునట్టి మహిమ యనెడు కళ ననుసరించిన పనులను నడపునట్టి విష్ణ్వంశమైనపుట్టుకయు వ్యాపారమును శూరత్వమును గలవాఁడు, శంభుకుమారప్రతిమానుఁడు = శివుని కుమారస్వామిని పోలినవాడు.
  2. చాతుర్వర్ణ్యసంప్రవర్తకుండు = బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రు లనెడు నాలుగువర్ణములవారి నడవళ్లను ప్రవర్తింపఁజేయువాఁడు.
  3. శాత్రవమండలేశ్వరులన్ = శత్రురాజులను, త్రిదశేంద్రున్ = ఇంద్రుని.
  4. గెంటి = తొలఁగి, భూపకోటి = రాజసమూహము.