పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కోరిక దీరునట్లు సమకూర్చెదఁ బెండిలి సేయుమన్న నా
క్ష్మారమణుండు శాపభయమానసుఁడై మునిఁ జూచి యిట్లనున్.[1]

121


ఉ.

ఇమ్మదిరాక్షి నీకుఁ బ్రియమేని మునీశ్వర యేకనీలక
ర్ణమ్ములు చంద్రచంద్రికల నవ్వెడుమేనులు తీవ్రవాయువే
గమ్ములు గల్గునట్టి తురగంబులు వేయిటిఁ గొంచు వచ్చి మా
కి మ్మటులైన నీతరుణి నిచ్చి ప్రియంబుగఁ బెండ్లి సేసెదన్.[2]

122


ఆ.

అనిన నట్ల కాకయని వరుణాలయం, బునకుఁ బోయి నిజతపోమహత్త్వ
మునఁ దురంగతీర్థ మనుమహాక్షేత్రంబు, నందుఁ గోరినట్ల హరులఁ బడసి.[3]

123

జమదగ్నివిశ్వామిత్రులజన్మప్రకారము

ఆ.

తెచ్చి కౌశికునకు నిచ్చి యమ్మునిపతి, సత్యవతి వరించి సమ్మదమున
నిజగృహస్థధర్మమున నైహికములెల్లఁ, దప్పకుండ నడపి తపము చేసె.[4]

124


క.

ఆమ్మునినాథుఁ డపత్యా, ర్థమ్ము విమలమంత్రసంయుతమ్ముగ ఋతుకా
లమ్మునఁ దన భార్యకుఁ జరు, విముగఁ బాకంబు సేసి యీనున్నయెడన్.[5]

125


ఆ.

పతికి మ్రొక్కి సత్యవతి పల్కె మాతల్లి, పుత్రహీన తోడఁ బుట్టు నాకుఁ
గలుగునట్టు గాఁగఁ గరుణించి యాయమ, కిండు కొంతచరువు నిందులోన.

126


వ.

అనిన నట్ల కాక యని ఋతుస్నాతయైయున్న తన్మాత రావించి యిరువురకు యథా
యోగ్యంబుగా బ్రాహ్మణక్షత్రియపాత్రంబులయిన సౌమ్యక్షాత్రమంత్రంబులఁ
జరుద్వయంబుఁ జేసి యయ్యిరువురకు నిచ్చి యుపయోగింపుండని చెప్పి సమి
త్కుశఫలార్థంబుగా వనంబునకుం జనియె నంతఁ దల్లి కూఁతున కిట్లనియె.[6]

127


ఉ.

లోకములోన సర్వజనులుం దనపుత్రులు మంచివారుగాఁ
గైకొనఁ గోరుచుండుదురు గావున నీపతి సత్సుతార్థియై
నీకని పెట్టినట్టి చరు వెంతయు మంచిది లాఁతి గావునన్
నాకబళంబు గీడని మనంబున నిప్పుడు నిశ్చయించితిన్.[7]

128


తే.

ఆఁడుబిడ్డ సహోదరుఁ డఖలగుణస, మగ్రుఁడుగఁ గోరుఁ గావున మదిఁ దలంచి
మనము చరువులు రెండును మాఱుపడఁగ, నారగింతము మంచిది యట్టులైన.[8]

129
  1. ఉంకువ = ఓలి - కన్యాశుల్కము.
  2. నవ్వెడు = పరిహసించునట్టి.
  3. వరుణాలయంబునకు = సముద్రమునకు, హరులన్ = గుఱ్ఱములను.
  4. ఐహికము = ఇహలోకకర్మము.
  5. అపత్యార్థమ్ము = సంతానమునిమిత్తము, చరువు = అగ్నియందు వేల్చుటకుఁ దగినపక్వాన్నము, పాకంబు చేసి = వండి, ఈనున్నయెడన్ = ఇయ్య యత్నించియున్నసమయమునందు.
  6. పాత్రములు = తగినవి, సౌమ్యక్షాత్రమంత్రంబులన్ = శాంతతను క్షత్రియులకు ముఖ్యమైన శౌర్యమును కలిగించునట్టి మంత్రములచేత, చరుద్వయంబు = రెండు చరువులు.
  7. లాఁతి =అన్యురాలను, కబళంబు = చరు వనుట.
  8. అఖిలగుణసమగ్రుఁడు = ఎల్ల మంచిగుణములచేతను పూర్ణుఁడు.