పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గరిమతోడ నాహవనీయగార్హపత్య, దక్షిణాగ్నులు నాఁ ద్రివిధంబు లయ్యె.

114

పురూరవవంశానుక్రమము

వ.

అట్లు పురూరవుం డూర్వశియందు నాయువును ధీమంతుండును నమావసుండును
విశ్వావసుండును శతాయువుఁ జిరాయువు ననుకుమారుల నార్వురం గాంచె
నందు సమావసుం డనువానికి భీమసేనుండు పుట్టె వానికిఁ గాంచనుండును వానికి
సుహోత్రుండును వానికి జహ్నుం డనురాజర్షియుం బుట్టిరి.

115


సీ.

అమ్మహీతలభర్త యజ్ఞంబుఁ గావించువేళ గంగానది వెల్లివిరిసి
యాగవాటముమీఁద నరుదేరఁగాఁ జూచి యత్యంతకోపరక్తాక్షుఁ డగుచు
నాయజ్ఞపురుషు నాత్మారోపణము చేసి యోగసమాధిమై నుండి యమ్మ
హాధునియుద్ధకంబులన్నియు నిశ్శేషముగఁ గ్రోలి నిలిచిన మునులు సురలు


తే.

వివిధభంగుల నుతియించి వేఁడుకొన్నఁ, గరుణ మదిఁ బుట్టి పూర్వప్రకారమున నొ
నర్చి కూఁతుగ నమ్మహానది నను గ్ర, హించి గ్రమ్మఱఁ గ్రతువు గావించె నతఁడు.[1]

116


వ.

అది కారణంబుగా గంగానది జాహ్నవి యనం బరఁగె నట్టిజహ్నునకు సుమం
తుండు పుట్టె వానికి జనకుండు పుట్టె వానికి బలాశ్వుండు పుట్టె నతనికిఁ గుశుండు
పుట్టెఁ గుశునకుఁ గుశాంబకుశనాభాధూర్తరజోవసువులన నలువురు పుట్టిరి
వారిలోనం గుశనాభుండు.

117


మ.

శతమన్యుప్రతిమానుఁ డైనసుతు నిచ్ఛం గోరి భక్తిం దపం
బతిఘోరంబుగఁ జేయుచుండ సురలోకాధీశుఁ డుద్యత్కృపా
యతచిత్తంబునఁ దాన వచ్చి తనయుండై జన్మ మొందెన్ సము
న్నతతేజోఘనుఁడైన గాధియను భూనాథోత్తమశ్రేష్ఠుఁడై.[2]

118


చ.

సురపతితుల్యుఁ డానృపతిసూనుఁడు ధర్మము దప్పకుండ నీ
ధరణితలంబు సర్వమును దానపరాక్రమలీల నేలుచుం
బెరిగియుఁ బెక్కుకాల మిల బిడ్డలు లేక యనేకలేఖులన్
వరములు వేఁడి సత్యవతినా నొకకన్యకఁ గాంచెఁ బెంపుతోన్.[3]

119


క.

ఆతరుణిఁ బెండ్లియాడెడు, ప్రీతిన్ రుచికుం డనంగ భృగువంశవిభుం
డేతెంచి గాధి నడిగిన, నాతఁడు నగి తపసి వృద్ధుఁడని మదిఁ గొంకెన్.[4]

120


ఉ.

ఆరుచికుండు వెండియుఁ గుళాంబతనూజునిఁ బెద్ద చేసి యీ
నీరజనేత్ర కేను ధరణీవర యుంకువయేమియైన నీ

  1. వెల్లివిరిసి = ప్రవహించి, ఆత్మారోపణము చేసి = తనయం దావహింపఁజేసికొని, ధుని = నది, నిశ్శేషముగన్ = మిగులు లేకుండ.
  2. ఇచ్ఛన్ = మనసునందు, ఉద్యత్కృపాయతచిత్తంబునన్ = పుట్టుచున్న దయచేత విశాలమయిన మనసుతో.
  3. లేఖులన్ = దేవతలను, పెంపుతోన్ = గౌరవముతో.
  4. కొంకెన్ = సంకోచించెను.