పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యాజమున నిను నలంపుచు, నీజాడలఁ బెట్టె దైవ మే మనవచ్చున్.[1]

97


క.

అని పలికి గారవించుచు, ననురాగము చెంగలింప నారాత్రి నరేం
ద్రునకు మనోభవసౌఖ్యము, లొనరించి బహుప్రకారయుక్తుం జేసేన్.[2]

98


వ.

ఇవ్విధంబున సురతసుఖంబు లనుభవించిన మఱునాఁడు ప్రభాతసమయంబున
నారాజవదన యారాజుతో నిట్లనియె.

99


మ.

ధనదప్రాభవ నీప్రసాదమున నంతర్వత్నినై యున్నదా
నను సత్పుత్రకుఁ డొండు కాలమునకున్ జన్మించునా డీవు వ
చ్చిన నీ కెల్లశుభంబులుం గలుగు విచ్చేయంగదే యంచుఁ బ
ల్కిన రాజేంద్రుఁడు పట్టణంబునకు నేగెన్ సమ్మదం బొప్పఁగన్.[3]

100


క.

ఊర్వశి దనచెలులకు న, య్యుర్వీశుఁడు దానుఁ గలిసియుండుటయును గం
ధర్వులు పోయినపోకలు, సర్వంబును దెలియఁజెప్పెఁ జతురప్రౌఢిన్.

101


ఉ.

ఆచెలు లవ్విధంబు దెలియన్ విని నివ్వెఱఁగంది యూర్వశిం
జూచి లతాంగి యీనృపతిసూనుఁడు రెండవమన్మథుండు నీ
కీచతురాత్ముతోఁ గలయు టించుక చాలదె యేము సైతమున్
వాఁచినవారియట్లు గరువంబునఁ గన్గొనుచుంటి మివ్విభున్.[4]


ఆ.

ఇతనితోడఁగూడి యింకను గొంతకా, లము కుసుమబాణలలితసుఖము
లనుభవింపు మనిన నగుఁగాక యని సమ్మ, తించి యిష్టలీలఁ దేలుచుండె.

103


వ.

అంతఁ బురూరవుండు సంవత్సరకాలంబునకు వచ్చిన నూర్వశి యాయు వను
కుమారుం గాంచి యతనికి సమర్పించి యారాజుతోడం గలసి తొంటియట్ల
యిష్టవినోదంబులు సలుపుచుండె. వెండియుఁ బుత్రపంచకంబునకు జననకారణం
బైనగర్భంబుఁ దాల్చె నాసమయంబున.

104


క.

విరసంబునఁ దము నిరువుర, విరిదట్టుగఁ జేసినట్టి విశ్వావసుఁ డా
ధరణీవల్లభుపాలికి, గరిమం జనుదెంచె సకలగంధర్వులతోన్.[5]

105


వ.

ఇట్లు వచ్చి గంధర్వు లానరేంద్రు నవలోకించి నీవు మాకపటకృత్యంబులవలన ననేక
దుర్దశలం బొందితివి కావున నీకుం గరుణించి వరంబు లిచ్చెదము వేఁడుమనిన
నతం డట్లకాక యని వినమ్రమస్తకుండై సకలారాతిభయంకరప్రతాపంబును
జితేంద్రియసామర్థ్యంబును నానామిత్రబాంధవదీనావనప్రభావంబును నమితబల

  1. వ్యాజమునన్ = నెపముచేత, అలంపుచున్ = శ్రమపెట్టుచు.
  2. చెంగలింపన్ = అతిశయింపఁగా.
  3. ధనదప్రాభవ = కుబేరుని ప్రభుత్వసంపదవంటి ప్రభుత్వసంపద గలవాఁడా, అంతర్వత్నిని = గర్భిణిని.
  4. నివ్వెఱఁగంది = మిక్కిలి యాశ్చర్యమును పొంది, గరువంబునన్ = గౌరవముతో.
  5. విరిదట్టుగన్ = ఎడఁబాయునట్టుగా, గరిమ = గౌరవముతో.