పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అంత.

87


క.

గంధర్వు లురణకముల వ, సుంధరపైఁ బాఱవైచి సురపురమునకున్
బంధురగతి నేగిరి నృప, సింధురుఁ డాశాబకములఁ జేకొని వేడ్కన్.[1]

88


తే.

మగిడి శయ్యకు నరుదెంచి మగువ నచట, వెదకి కానక యత్యంతవిరహతాప
వేదనల దీనచిత్తుఁడై వెఱ్ఱివాఁడుఁ, బోలెఁ దనుఁ దా నెఱుంగక భూవిభుండు.

89


వ.

దిగంబరవేషంబునఁ బరిభ్రమించుచుండె.[2]

90


సీ.

పువ్వుదీఁగెలఁ జూచి పొలఁతుక నూఁగారుతనువల్లియని డాయఁదలఁపు సేయు
బాలపల్లవము లేర్పడఁ జూచి మృగనేత్ర యధరామృతం బని యానఁబోవుఁ
గుసుమగుచ్ఛముల పెక్కువ చూచి లలితాంగి కుచకుట్మలములని గోళ్ల నదుము
గండుతుమ్మెదపిండుఁ గనుఁగొని తన్వంగి నెఱిమీరుకొప్పని నిమురఁజూచుఁ


తే.

గోకిలాలాపములు విని కొమ్మ దన్నుఁ, బిలిచెనో యని యాలించుఁ ప్రేమతోడ
మన్మథాతురుఁ డగుచు నున్మత్తవృత్తి, నతఁడు వనవాటికలయందు నభిచరించు.[3]

91


వ.

ఇవ్విధంబున నారాజమన్మథుం డున్మత్తవేషంబున బరిభ్రమించుచు నొక్కనాఁడు
కురుక్షేత్రంబున నంభోజసరోవరతీరంబున సఖీజనం బైనయప్సరోంగనాచతుష్ట
యసమేతయై విహరించుచున్న యూర్వశిం బొడగాంచి.[4]

92


చ.

వదనము చెంగలింప నిడువాలికకన్నుల వాడుదేర స
మ్మదమును నుబ్బునం బెరయ ముత్పులకల్ తనువల్లి నిండఁగన్
గదిమినపంచసాయకవికారము లించుక కట్టిపెట్టి య
మ్మదవతిఁ జేరి యానృపకుమారుఁడు కౌఁగిటఁ జేర్చి యిట్లనున్.[5]

93


ఆ.

పువ్వుఁబోణి వినుము పువ్వును దావియుఁ బోలె గుసుమబాణకేళిఁ దేలు
చుండి నెపములేక యూరక నన్నేల, విడిచిపుచ్చి తింత వెఱ్ఱిఁ జేసి.[6]

94


క.

ఉన్మత్తవేషమున నే, నున్మాదముఁ బొంది తిరుగుచున్నాఁడను నీ
సన్మాన మింత గలిగిన, మన్మథతాపంబులెల్ల మాను లతాంగీ.[7]

95


క.

అని పలుకుచున్న బుధనం, దనునిపయిం గరుణ పుట్టి ధవళాయతలో
చన సఖులు దన్నుఁ దూఱఁగ, వినయవిధేయముగ గారవించుచుఁ బలికెన్.

96


క.

ఈజగమంతయు నేలెడు, రాజువు నీ కేల దైన్యరస మీవిరహ

  1. నృపసింధురుఁడు = రాజశ్రేష్ఠుఁడు, శాబకములన్ = పిల్లలను.
  2. పరిభ్రమించుచున్ = తిరుగుచు.
  3. పెక్కువ = ఆధిక్యమును, కుట్మలలములు = మొగ్గలు, గండు = బలిసిన, పిండు = సమూహము,
    తన్వంగి = కృశాంగముగల యూర్వశియొక్క, నెఱి = వక్రత, అభిచరించున్ = అంతట తిరుగును.
  4. ఉన్మత్తవేషంబునన్ = పిచ్చివానివేషముతో, అంభోజసరోవరతీరంబునన్ = తామరలకొలనిదరిని.
  5. చెంగలింపన్ = వికసింపఁగా, వాలిక = దీర్ఘములైన, సమ్మదమును = సంతోషమును, ఉబ్బును = పొంగును, ముత్పులకలు = సంతోషముచే నైన రోమాంచములు, కదిమిన = ఆక్రమించిన.
  6. తావి = పరిమళము, ఊరక = నిమిత్తములేక.
  7. ఉన్మాదముఁ బొంది = పిచ్చిపట్టి, సన్మానము = మన్నన.