పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

లలితానేకవినోదముల్ సలిపెఁ గైలాసోపకంఠంబునం
దలకం జైత్రరథంబునం గమలషండాఖ్యప్రదేశంబులన్
విలసద్దివ్యమనస్సరోవరములన్ విశ్రాంతరమ్యస్థలం
బుల నాభూపతి యేకషష్టిసమ లాపూర్ణేందుబింబాస్యతోన్.[1]

77


తే.

వనజనేత్రయుఁ బ్రతిదినవర్ధమాన, మగుతదుపభోగసుఖములఁ దగిలి పాయ
లేక నృపుఁ గూడి విహరించె లెక్కలేక, బహువినోదంబులందు నిస్పృహ జనింప.[2]

78


క.

ఊర్వశి సురపురి నుండక, యుర్విఁ బురూరవునిఁ గూడియున్నకతన గం
ధర్వవరసిద్ధసాధ్యసు, పర్వులవిభవములు గొంత పాడై యుండెన్.

79


వ.

అంత విశ్వావసుం డనుగంధర్వుం డూర్వశీపురూరవులసమయం బెఱింగి వారి
కన్యోన్యవియోగంబు సేయువాఁడై నిశాసమయంబున నేకాంతసమేతులై యున్న
వారికడకు వచ్చి యొక్కయురణకంబు నహరించుకొనిపోయిన.[3]

80


ఉ.

ఆయజపోతకంబు దివియందు నిరంతరవిహ్వలధ్వనిం
గూయఁగ వేల్పుకొమ్మ నృపకుంజరుఁ గన్గొని వీఁడె యెవ్వఁడో
మాయలు పన్ని మత్ప్రియకుమారకు నెత్తుకపోయె నీవు వే
పో యిట తెత్తుగా కనిన భూవరుఁ డేమియుఁ బల్కఁ డింతితోన్.[4]

81


తే.

ఏకవస్త్రంబు ధరియించి యిందువదనఁ, గలసి యేశాంతసుఖకేలి నలరువిభుఁడు
నగ్నవేషంబుతోఁ జనినను మృగాక్షిఁ, గాంచి తనుఁ బాయునో యని కదలకుండె.

82


క.

వెండియు గంధర్వవరుల్, రెండవయురణకము నపహరించి దివికి ను
ద్దండత నరిగిన ధరణీ, మండలపతిఁ జాచి దివిజమానిని కినుకన్.

83


క.

నాపుత్రకు లభియాతుల, చేపడి యఱవఁగ నుపేక్ష సేసితి నీ కీ
కాపురుషత్వం బేటికిఁ, బ్రాపించె ననాథవృత్తి పాటిలె నాకున్.[5]

84


వ.

అని బహుప్రకారంబుల నార్తకారిణియై యురణకనిమిత్తంబుగా బెట్టిదంబులు
పలుకుచున్న నన్నరేంద్రుండు కోపించి యంధకారంబు గావున నయ్యింతి నాది
గంబరత్వంబుఁ జూడ దని ఖడ్గంబుఁ గొని దురాత్మా పోకు పోకుమని యదలిం
చుచు వెనుదగలి గగనంబునం జనుసమయంబున గంధర్వు లతిప్రకాశంబుగా
నుజ్జ్వలం బైనవిద్యుద్భ్రమంబుఁ గల్పించిన.[6]

85


తే.

నగ్నవేషంబుతోఁ జను నరవరేణ్యుఁ, గన్ను లారంగఁ జూచి యాకమలవదన
మున్ను చేసినసమయంబు మొగిఁ దలంచి, రోసి యాతనిఁ జాలించి పాసి చనియె.

86
  1. ఉపకంఠంబునందు = సమీపమునందు, ఏకషష్టసమలు = అఱువదియొక్కయేండ్లు.
  2. నిస్పృహ = ఆపేక్షలేమి.
  3. సమయంబు = ఏర్పాటు, వియోగంబు = ఎడఁబాటు.
  4. అజపోతకంబు = గొఱ్ఱెపిల్ల, విహ్వలధ్వనిన్ = పరాధీనతచేత నైన ఆర్తధ్వనితో, వేల్పుకొమ్మ = దేవతాస్త్రీయైన యూర్వశి.
  5. అభియాతుల = పగవారియొక్క, కాపురుషత్వంబు = కుత్సితపురుషునితనము.
  6. విద్యుద్భ్రమంబున్ = మెఱపుయొక్క చలనమును.