పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దనమేనిమెఱుఁగుల ధాళధళ్యంబుల మించుచూడ్కులు మిఱుమిట్లు గొనఁగఁ
దనచన్నుఁగవయొప్పిదము మన్మథునిరాజ్యలక్ష్మీవిలాస మలంకరింపఁ


తే.

దనవిలాసయానంబును దర్పకాంధ, కార మొక్కటఁ జిమ్మచీఁకట్లుఁ గ్రమ్మఁ
జెలులుఁ దానును మోహనశ్రీలు బెరయ, నింద్రుపురినుండి యూర్వశి యేగుదెంచె.[1]

69


వ.

ఇవ్విధంబునవచ్చి వినయావరత యగుచు బాలరసాలంబుమ్రోలం గ్రాలుచున్న
కమ్మపూఁదీఁగెచందంబున సమీపంబున నున్నయన్నాతిం జూచి పురూరవుం
డిట్లనియె.[2]

70


ఉ.

ఎవ్వరిదాన వీవు జలజేక్షణ నీదగు వాలుచూపులున్
నవ్వు దొలంకుమోము గమరంబు విలాసము కల్కిపల్కులున్
జవ్వన మొప్పిదంబు వలిచన్నులచెన్నును నీక యొప్పు నీ
మవ్వముఁ జూడ వారసతిమార్గము దోఁచుచునున్న దెంతయున్.[3]

71


చ.

అనుటయు నింతి యానృపకులాగ్రణిరూపవిలాసరేఖలున్
వినయవిధేయవాక్యములు వెన్నెలతేటమొగంబుఁ బ్రాభవం
బును బెనఁగొన్నతేజమును బుణ్యమయం బగుచున్నదేహముం
గనుఁగొని పంచబాణవిశిఖంబులతాఁకున కోర్వ కిట్లనున్.

72


క.

ఉర్వీశతిలక నాపే, రూర్వశి నొకపనికిఁగా దివౌకసమహిమల్
సర్వమును విడిచివచ్చితి, నుర్వర నొకకొంతకాల ముండెడు కొఱకున్.[4]

73


క.

నిను జూడఁగోరి వచ్చితి, ననుటయు నారాజచంద్రుఁ డయ్యిందునిభా
నవఁ దగిలి పాయనేరక, మనసిజబాణములయందు మగ్నుండయ్యెన్.

74


క.

అలఘుప్రగల్భవచనం, బుల నూర్వశిఁ జూచి యబల పుష్పాయుధుచే
నలజడిఁ బెట్టక నాతోఁ, గలిసి వినోదింపవలయుఁ గామసుఖములన్.[5]

75


వ.

అనిన నక్కాంత మహీకాంతు నవలోకించి నాయందు నీకుఁ బ్రియంబుగల
దేనియు నాసమయంబు వినుము నాకు నురణకద్వయపోషణం బవశ్యం బైన
వ్రతంబు. ఈయురణకంబులు రెండును నీచేత నపనేయంబులు గాకుండవలయు
నగ్నరూపంబుననున్న ని న్నవలోకించినప్పుడే పాసిపోవంగలదాన నాకు ఘృతంబ
యాహారంబుగా నుండునది యని సమయంబు చేసిన నొడంబడి యమ్మానవపతి
యమ్మానినితోడ సురతసుఖంబు లనుభవించుచు.[6]

76
  1. సొబగు = బాగు, సోడు = బ్రహ్మరంధ్రము, చిమ్మచీఁకట్లు = అధికమైన చీఁకట్లు, బెరయన్ = పొందఁగా.
  2. బాలరసాలంబు మ్రోలన్ = లేఁతతియ్యమామిడిచెట్టునొద్ద, క్రాలు = వర్తించు.
  3. తొలంకు = చిందు, కల్కి = మనోజ్ఞమైన, వలి = వలుదలైన, మవ్వము = ఒప్పిదము - విధము.
  4. దివౌకస = దేవతానంబంధియైన.
  5. ప్రగల్భ= ప్రౌఢమైన, అలజడి = సంకటము.
  6. ఉరణకద్వయ = గొఱ్ఱెపిల్లలజంటయొక్క, అపనేయంబులు = పోఁగొట్టఁదగినవి, నగ్నరూపంబునన్ = దిగంబరత్వముతో.