పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విడువఁ బొండన్నఁ గడుసిగ్గుపడి మునీంద్రు, లమరవల్లభుపాలికి నరుగుదెంచి.[1]

42


చ.

హిమకరుచందమంతయును నేర్పడఁ జెప్పిన నప్పురందరుం
డమరగణంబు గొల్వఁగ బృహస్పతిఁ దోడ్కొని సంభ్రమంబునన్
గమలజుపాలి కేగి గురుకాంతవిధంబును జంద్రుదుశ్చరి
త్రముఁ దెలియంగఁ జెప్పినఁ బితామహుఁ డెంతయుఁ గోపదీప్తుఁడై.

43


తే.

పెద్దల మునులఁ గొందఱఁ బిలిచి మీరు, వోయి యాశీతకరునకు బుద్ధిగలుగ
నేను జెప్పితినని చెప్పి యానిలింప, గురునియిల్లాలి విడిపించికొంచు రండు.[2]

44


క.

అని పనిచిన వారు రయం, బున నాహిమకరునికడకుఁ బోయి పయోజా
సనువాక్యంబులపద్ధతి, వినిపించి సురేజ్యుదార విడువు మనుటయున్.[3]

45


ఉ.

ఇంచుక నవ్వి శీతకరుఁ డిట్లనుఁ బద్మభవుండు చెప్పిపు
త్తెంచినమాటలన్నియును దెల్లముగాఁ బరికించి వింటి నీ
చంచలనేత్ర నే విడువఁజాలను గాదనెనేని తన్నుఁ బు
ట్టించినదైవమైన ననుఁ డీకొని యీపని మాన్పనోపునే.[4]

46


తే.

అనిన వార లుదాసీనులై పయోజ, భవునిపాలికి నరుదెంచి పద్మవైరి
బలిమిఁ జెప్పిన నేమియుఁ బలుక కాతఁ, డూరకుండెను మఱియొకయుపమ లేక.[5]

47


ఉ.

అంగిరసాదు లైనమును లగ్గురుతోఁ బురుహూతుఁ గూడి య
య్యంగజవైరిపాలికి రయంబునఁ బోయి నమస్కరించి య
వ్వెంగలి యైనచంద్రు నవివేకము గీష్పతిపత్ని యైనతా
రాంగనవర్తనంబుఁ దెలియన్ వినిపించిన నుగ్రుఁ డుగ్రుఁడై.[6]

48


మ.

దివిజానీకసమేతుఁడై చటులవృత్తిం జంద్రలోకంబుపై
నవలీలం జనుదెంచె నప్పు డతఁ డుద్యత్కోపసంప్రీణిత
ప్రవణోదగ్రభయంకరాకృతి దలిర్పన్ వీరసేనాయుతుం
డవుచున్ బిట్టెదిరించి తాఁకెను ద్రిలోకాధీశుతో నీశుతోన్.[7]

49


వ.

ఇవ్విధంబునఁ జంద్రశేఖరచంద్రులకు మహాఘోరయుద్ధం బయ్యె నప్పుడు.

50


చ.

సురగురుతోడివైరమున శుక్రుఁడు కుంభనికుంభముఖ్యశం
బరబలికాలనాభవృషపర్వపురోగము లైనరాక్షసే

  1. ఉల్లసములు = మర్మభేదములైన పరిహాసపుమాటలు.
  2. నిలింపగురుని = బృహస్పతియొక్క.
  3. సురేజ్యుదారన్ = బృహస్పతిభార్యను.
  4. పుత్తెంచిన = పంపిన, తెల్లముగాన్ = విశదముగా.
  5. ఉదాసీనులు = అనాదరము చేయఁబడినవారు, ఉపమ = ఉపాయము.
  6. అంగజవైరి = శివునియొక్క, వెంగలి = మూర్ఖుఁడు, గీష్పతి = బృహస్పతి, ఉగ్రుఁడు = శివుఁడు - భయంకరుఁడు.
  7. దివిజానీక = దేవతాసేనతో, చటులవృత్తిన్ = పరుషవ్యాపారముతో, ఉద్యత్కోప...రాకృతి = అతిశయించిన కోపముచేత చక్కఁగా తృప్తినొందింపఁబడి యాదరింపఁబడుచున్న మిక్కిలి భయంకరమైన యాకారము - అధికకోపముచే నైనభయంకరమైన యాకృతి, తలిర్పన్ = వికాసమును వహింపఁగా.