పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధరుఁ డగుచున్ మహాత్ములగు తాపసులన్ బిలిపించి యాసుధా
కరుఁ డొనరించినట్టి కొఱగామి సమస్తముఁ జెప్పి యిట్లనున్.[1]

35


క.

మీరు సుధాకరుపాలికి, గౌరవమునఁ బోయి బుద్ధిగాఁ జెప్పి పర
ద్వారం బొనరించిన యా, వీఱిఁడి గోపించి తార విడిపింపుఁ డొగిన్.[2]

36


తే.

అని నియోగించి పంచిన యమ్మునీంద్రు, లమృతకిరణునిపాలికి నరుగుదెంచి
యతనిచేత సంభావన లర్థిఁ గాంచి, ప్రియము పుట్టంగ నెంతయుఁ బెద్ద చేసి.[3]

37


మ.

నవశృంగారవిలాసముల్ కువలయానందప్రభావంబులు
దివిజాభీష్టఫలప్రదానగుణముల్ దీపించు నీసత్పథ
వ్యవహారస్థితియుం దొఱింగి గురుభార్యన్ మోహివై తెచ్చినాఁ
డవు పాపంబులు నీచరిత్రములు చూడన్ రోహిణీవల్లభా.[4]

38


ఉ.

భూసురకాంత నెత్తుకొనిపోవుట దోషము యామినీశ నీ
చేసినదుర్వివేకములు సెప్పఁగ నొప్పము లిట్టిసేఁతకున్
వాసవుఁ డాదిగా దివిజవర్గము మిక్కిలి కోపగించినా
రీసతి నీకు నేల జగ మింతయు నీ కపకీర్తి సేయఁగన్.[5]

39


చ.

అనుటయు రోహిణీరమణుఁ డమ్మునినాథులఁ జూచి దేవమం
త్రినెలఁత నిట్లు నేను కొనితెచ్చినమాత్రన తప్పు చేసి య
య్యనిమిషభర్త మిము నిట కంపెనఁటే విడిపింప నింక నే
మని మిము దూఱువాఁడ నహహా తనచేఁతలు మీకు వింతలే.[6]

40


ఉ.

కాయజుచేత గాసిఁబడి గౌతముభార్యకుఁ బోయి కొక్కొరో
కో యని కోడికూఁత లొగిఁ గూసి మునీంద్రునిచేత శప్తుఁడై
పోయినవజ్రి మేటిదొరవోలె బృహస్పతిపత్నికై ననున్
రోయఁగనాడ నేల తనరోఁతలు లోకమువారు నవ్వఁగన్.[7]

41


తే.

అనుచు నింద్రునిమర్మంబు లైనయుల్ల, సములు పెక్కాడి యాబృహస్పతివధూటి

  1. కోలుపడి = పోఁగొట్టుకొని, ధౌర్త్యము = ధూర్తత్వము, వృషుండు = ఇంద్రుడు, భీషణకోపవేష్టితాధరుఁడు = దారుణమైన కోపముచేత చుట్టఁబడిన (అదరుచున్న) పెదవులు గలవాఁడు, కొఱగామి = చెఱుపు - దుష్కార్యము.
  2. పరద్వారంబు = అన్యమార్గమును - అక్రమమును, వీఱిఁడిన్ = దుష్టుని, ఒగిన్ = క్రమముగా.
  3. సంభావనలు = మర్యాదలను.
  4. కువలయానందప్రభావంబులు= భూమండలమునకు సంతోషము పుట్టించునట్టి మహిమలు - కలువలకు వికాసము గలుగఁజేయునట్టి మహిమలు అని యర్థాంతరము, దివిజాభీష్టఫలప్రదానగుణములు = దేవతలు కోరినఫలములను ఇచ్చునట్టి గుణములు - దేవతలకోరికదీర అమృతమును వర్షించునట్టి గుణములను, సత్పథవ్యవహారస్థితి = మంచిమార్గమును అనుసరించినవాఁడు అను వాడుకయొక్క రీతిని - నక్షత్రవీథియందు మెలఁగుటను అని యర్థాంతరము.
  5. యామినీశ = చంద్రుఁడా, దుర్వివేకములు = వివేకముమాలినపనులు, ఒప్పములు = చెడ్డవి.
  6. తప్పు చేసి = తప్పుగా నేర్పఱిచి, అంపెనఁటే = పంపెనా, తనచేతలు = ఆయింద్రుని చేష్టలు.
  7. కాయజుచేత = మన్మథునిచేత, శప్తుఁడై = శపింపఁబడినవాఁడై.