పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారాశశాంకకథ

క.

ముదమున నాశీతాంశుఁడు, త్రిదశగురుం డగుబృహస్పతికి శిష్యుండై
విదితంబుగ శాస్త్రంబులు, చదువుచు వర్తించు నతనిసదనమునందున్.

8


క.

వెరవున నీగతి గురునకు, గురుపత్నికి నధికభక్తి కొనసాగంగాఁ
బరిచర్య సేసి చదువుచు, బెరయుచు వర్తించు నతఁడు ప్రియశిష్యుండై.[1]

9


వ.

అంత నొక్కనాఁడు.

10


ఆ.

దేవవిభునిక్రతువు గావింప దేవలో, కమున కేగుచుండి యమరగురుఁడు
చదువుచుండు మనుచుఁ జంద్రుని మందిరాం, తరమునందు నునిచి యరుగుటయును.

11


చ.

వనజవిరోధియున్ వినయవర్తనుఁడై గురుపత్నికిన్ ముదం
బునఁ బరిచర్య సేయుచు నపూర్వపుశాస్త్రము లభ్యసించుచున్
దనచెలువంబురూపము నుదారతయున్ లలితాంగి యైన
యవ్వనితకుఁ జెప్పరానివలవంతలు సేయుచునుండెఁ బెంపుతోన్.

12


వ.

అప్పుడు.[2]

13


సీ.

బంగారుచెఱఁగులపట్టుపుట్టముఁ గట్టి కమ్మకస్తురితిలకంబుఁ దీర్చి
ముత్యంపుసరులును మొగపుతీఁగెయుఁ బెట్టి యవయవంబుల సొమ్ము లలవరించి
కలికికన్నులయందుఁ గజ్జలం బమరించి యరజారుకొప్పున విరులు దుఱిమి
తఱుచుగాఁ గర్పూరతాంబూలములు సేసి పాలిండ్లఁ గుంకుమపంక మలఁది


తే.

పొసఁగ వజ్రంపుఁబాపటబొట్టు పెట్టి, రవళిమెట్టెలమ్రోఁతలు రాయడింపఁ
బంచసాయకుమోహనబాణ మనఁగ, నిందుబింబాస్య మెలఁగు నమ్మందిరమున.[3]

14


వ.

ఇట్టి విలాసంబుల నుల్లసిల్లుచున్నంత.

15


క.

తారన్ సురగురుదారన్, దారాధిపవదనఁ దరళతారానయనన్
దా రాజసంబుపెంపునఁ, దారాపతి సూచె మోహతత్పరుఁ డగుచున్.[4]

16


క.

చూచి మదనాతురుండై, యాచంద్రుఁడు దేవగురునియంగన సౌభా
గ్యోచితశృంగారకళా, శ్రీచాతుర్యములఁ జిక్కి చిత్తం బలరన్.[5]

17


సీ.

తిలకించు నయ్యింతిచెలువంబుఁ బలుమాఱుఁ గిలికించితాదుల గెల్లుచూచుఁ
గోరి యవ్వనిత నిగ్గులు దేఱుపాలిండ్ల నింపారఁగాఁ గౌఁగిలింపఁగోరు

  1. బెరయుచున్ = అతిశయించుచు.
  2. వనజవిరోధియున్ = చంద్రుఁడును, చెలువంబు = సౌందర్యమును, వలవంతలు = మోహములు, పెంపుతోన్ = గౌరవముతో.
  3. పుట్టము =- వస్త్రము, కమ్మ = మధురమైన, కలికి = విలాసయుక్తములైన, కజ్జలంబు = కాటుకను, తుఱిమి = లోపల చొప్పించి - ముడిచి, పాలిండ్లన్ = స్తనములయందు, రవళి = ధ్వనించుచున్న. రాయడింపన్ = ఒరయఁగా - హెచ్చఁగా ననుట, ఇందుబింబాస్య = చంద్రబింబమును బోలిన మొగముగలది.
  4. తరళతారానయనన్ = తిరుగుచున్న నల్లగ్రుడ్లతోఁ గూడినకన్ను గలదానిని.
  5. మదనాతురుండు = మన్మథునిచే పీడింపఁబడినవాఁడు.