పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శ్రీవిష్ణుపురాణము

షష్ఠాశ్వాసము



జనకజనకనిభవి
భ్రాజితగాంభీర్యసామరస్యవివేక
వ్యాజజగనబ్బగండ వి
రాజితకరుణాకలాప రాఘవభూపా.[1]

1


వ.

సకలపురాణవిద్యాధురంధరుం డైనపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

2

చంద్రవంశపురాజులచరిత్రము

.

ఆ.

అఖిలమునకు స్రష్టయైననారాయణు, నాభిసరసిజమున నలినభవుఁడు
జనన మొందె నతని కొనర మానసవుత్రుఁ, డై జనించి మించె నత్రిమౌని.[2]

3


క.

అత్రిమునీంద్రుని దక్షిణ, నేత్రంబున నుదయమయ్యె నిర్మలతేజో
గాత్రుఁడు సుధాకరుఁడు శత, పత్రభవాంశంబుఁ దాల్చి బంధురయశుఁడై.[3]

4


క.

బాల్యమున నతఁడు మతిచాం, చల్యం బొకయింతలేక సమధికనిష్ఠా
కల్యాత్ముం డగుచును బా, హుళ్యం బగుతపము పద్మయోనికిఁ జేసెన్.[4]

5


క.

వృక్షలతౌషధితతులకు, నక్షత్రంబులకు ద్విజగణంబుల కమృత
ప్రేక్షణకిరణములకు న, ధ్యక్షుఁడుగా వరముఁ గొనియె నబ్జజువలనన్.[5]

6


వ.

మఱియు రాజసూయాదిమహాయజ్ఞంబులు సేసి సర్వోత్కృష్టం బైనగృహి
త్వంబుఁ గైకొని యమ్మహనీయవైభవంబున నశ్విన్యాదు లైనదాక్షాయణుల
నిరువదియేడుగురి వరియించి వారివలన నభిమతభోగము అనుభవించుచు మన్మ
థాకారం బైనసౌకుమార్యంబునం బెరుగుచుండి.[6]

7
  1. శ్రీజనకజనకనిభవిభాజికగాంభీర్యసామరభ్యవివేక = లక్ష్మీదేవికి తండ్రియైన సముద్రుని బోలి ప్రకాశించునట్టి గంభీరభావంబును జనకచక్రవర్తిని బోలి ప్రకాశించునట్టి సామరస్యముతోడి వివేకంబును గలవాఁడా, జగనబ్బగండ = ఇది బిరుదుమాట, విరాజితకరుణాకలాప = ప్రకాశించునట్టి దయయే ఆభరణముగాఁ గలవాఁడా.
  2. స్రష్ట = సృష్టికర్త.
  3. శతపత్రభవాంశంబునన్ = బ్రహ్మయొక్క అంశమును, బంధుర = అధికమైన.
  4. సమధికనిష్ఠాకల్యాత్ముఁడు = మిక్కుటమైననిష్ఠతో శుభస్వరూప(నిర్మల)మైన మనసు గలవాఁడు, పద్మయోనికిన్ = బ్రహ్మను గూర్చి.
  5. అమృతప్రేక్షణకిరణములకున్ = అమృతమును చిలుకుచున్నకిరణములకును.
  6. గృహిత్యము = గృహస్థునితనము, దాక్షాయణులన్ = దక్షునికూఁతులను.