పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అట్టి సిరధ్వజుసుతుఁడై, పుట్టెఁ గుశధ్వజుఁడు వాఁడు భూరిబలుండై
నెట్టన కాశీనగరము, పట్టమునకు నర్హుఁడయ్యె భవ్యప్రౌఢిన్.

356


వ.

అట్టి కుశధ్వజునకు భానుమంతుండును వానికి శతద్యుమ్నుండును వానికి శుచి
యును వానికి నూర్జనాముండును వానికి సవధ్వజుండును వానికిఁ గృతియును
కృతికి రంజకుండును వానికిఁ బురుజిత్తుండును వానికి నరిష్టనేమియు నతనికి
శ్రుతాయువు వానికి సుపార్శ్వుండును వానికి సంజయుండును నతనికి క్షేమా
రియు క్షేమారికి సత్యరథుండు వానికి నుపగూహుండును నతనికి నుపగుప్తుం
డును నతనికి స్వాగుండును నతనికి స్వాపనుండును వానికి సువర్చసుండును
వానికి ననుభాషుండును నతనికి శ్రుతుండును నతనికి జయుండును జయునకు
విజయుండును విజయునకు ఋతుండును ఋతునకు నయుండును వానికి వ్యూత
హవ్యుండును వానికి ధృతియును నతనికి బహుళాశ్వుండును నతనికి సంతుష్టుం
డునుం బుట్టి రిది జనకవంశప్రకారంబు.

357


తే.

జనకవంశంబునృపులెల్ల జనకనామ, ధేయసంజ్ఞల నవనిలోఁ దేజరిల్లి
యాత్మవిద్యాపరాయణు లగుచు ముక్తి, కామినీపరిరంభసౌఖ్యములు గనిరి.

358


క.

అని యిట్లు సూర్యవంశం, బున ఘనులగురాజవరులపుణ్యకథలు నే
ర్పున వినిపించిన వాసి, ష్ఠునినందనుతోడ నతఁడు సమ్మతిఁ బలికెన్.

359


క.

భానుకులంబున వెలసిన, భూనాథుల నెల్ల వింటి భూయిష్ఠముగా
మౌనీంద్ర సోమవంశమ, హీనాథుల వినఁగ నాకభీష్టం బనినన్.[1]

360


శా.

సారాచారవివేక శాత్రవమహీశవ్రాతసంహార దో
స్సారప్రాభవబాహులేయ విలసత్సంగీతసాహిత్యవి
ద్యారత్నాకర యానపాలవరగోత్రాధీశ విశ్వంభరా
భారప్రౌఢతరోఢ యచ్యుతపదాబ్జధ్యానపుణ్యోదయా.[2]

361


క.

అభ్రేభామరతరుశర, దభ్రసురాహారహీరహరవాగ్వనితా
శుభాంకుకుందచంద్రా, దభ్రామలధాళధళ్యధావళ్యయశా.[3]

362
  1. భూయిష్టముగాన్ = సమగ్రముగా.
  2. సారాచారవివేక = సత్తైననడవడి నెఱిఁగినవాఁడా, శాత్రవ...సంహార = శత్రురాజులనమూహమును చంపినవాఁడా, దోస్సారప్రాభవబాహులేయ = భుజబలముయొక్క మహిమచేత కుమారస్వామివంటివాఁడా, విలస...రత్నాకర = ప్రకాశించునట్టి సంగీతము సాహిత్యము ఆశువిద్య లనురత్నములకు గనియైనవాఁడా, యానపాలవరగోత్రాధీశ = శ్రేష్ఠమైన యానపాలగోత్రమునకు రాజైనవాఁడా, విశ్వంభరాభారప్రౌఢతరోఢ = భూభారమును మిక్కిలినేర్పుతో వహించినవాఁడా, అద్యుతపదాబ్జధ్యానపుణ్యోదయా = విష్ణుదేవునియొక్క పాదకమలములను ధ్యానించుటవలనఁ బుట్టినపుణ్యము గలవాఁడా.
  3. అద్రేభ = ఐరావతమును, అమరతరు = కల్పవృక్షమును, శరదభ్ర = శరత్కాలమేఘమును, సురాహార = అమృతమును, హీర = వజ్రమణిని, హర = శివుని, వాగ్వనితా = సరస్వతిని, శుభ్రాంశు = చంద్రుని, కుంద = మొల్లపువ్వులను, చంద్ర = కర్పూరమును, (పోలిన) అదభ్ర = అల్పముగాని, ధాళధళ్య = తళతళలుగల, ధావళ్య = తెల్లనైన, యశా = కీర్తిగలవాఁడా.