పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

కైకొని యెల్లవారు ననుఁ గన్నులఁ గప్పుచు గౌరవింపఁగా
లోకులనేత్రపద్మములలోన శరీరియుఁబోలె నుండి య
స్తోకసమస్తవస్తువులు చూచుచునుండెడునట్లుగా వరం
బేకమనస్కులై కరుణ నీవుత నాకు సుపర్వులందఱున్.[1]

349


ఆ.

అనిన నట్ల కాక యని యవ్వరం బిచ్చి, యపుడ దివికి దివిజు లరిగి రిట్లు
నిమియు నఖిలజనులనేత్రాబ్జముల యందుఁ, దదనురూపముగను దనరుచుండె.[2]

350


క.

ఇమ్ముగ నున్మేషనిమే, షమ్ములు మనుజులకునెల్ల సమకూడెను నే
త్రమ్ములలోపలనే రూ, పమ్ములుఁ బొడసూపఁదొడఁగెఁ బరమమునీంద్రా.[3]

351


వ.

ఇవ్విధంబున నిమిచక్రవర్తి విగతదేహుం డగుటంజేసి విదేహుం డనంబరఁగె
రాజు లేనిరాష్ట్రంబునఁ బ్రజాపీడ పాటిల్లునని గౌతమాదిమహామునీంద్రులు నిమి
పూర్వదేహంబునందు దక్షిణభుజంబు మధించినఁ గుమారుండు జననంబు నొందె
నదినిమిత్తంబున వానికి జనకుండను నామధేయంబు చేసి పట్టంబు గట్టిరి. ఆజన
కునిరాజ్యప్రదేశంబు విదేహప్రదేశం బయ్యె నివ్విధంబున.[4]

352


క.

మిథిలుం డాజనకునకును, బ్రథమసుతుండయ్యె నానృపాలుని పేరన్
మిథిలాపురి ధరలోపల, నధికశ్రీ నుల్లసిల్లె ననఘచరిత్రా.

353

జనకవంశానుక్రమము

వ.

అమ్మిథిలాన్వయసంభవు లైన రాజులవంశపరంపరలు వినుము. అట్టి మిథిలునకు
నింద్రావసుండును వానికి నందివర్ధనుండును వానికి సుకేతుండును వానికి దేవ
రాతుండును దేవరాతునకు బృహదుత్కుండును నతనికిఁ దుహవీర్యుండును
తుహవీర్యునకు సుధృతియు వానికి ధృష్టకేతుండును వానికి హర్యశ్వుండును
నతనికి మరుండును మరునకుఁ బ్రతిధరుండును వానికిఁ గృతిరథుండును వానికి
దేవమీఢుండును వానికి బుధుండును వానికి మహాధృతియు నతనికిఁ గృతరా
తుండును వానికి మహారోముండును నతనికి సువర్ణరోముండును వానికి హ్రస్వ
రోముండు నతనికి సిరధ్వజుండునుఁ బుట్టి రట్టిసిరధ్వజుం డనేకకాలంబు సంతాన
హీనుండై రాజ్యంబు సేయుచు.

354


తే.

పుత్రకామేష్టి సేయంగఁ బూని యతఁడు, యజనభూమి దున్నింపంగ నవనియందుఁ
బుట్టె సీతామహాదేవి భువనమాత, యైనయాదిమహాలక్ష్మియంశమునను.

355
  1. ఏకమనస్కులు = ఒకమనసు గలవారు - ఒకవిధమైన అభిప్రాయము గలవారు, ఈవుతన్ = ఇత్తురుగాక.
  2. తదనురూపముగన్ = దానికి తగినట్టు.
  3. ఉన్మేషములు = ఱెప్ప లెత్తుటయు వాల్చుటయు, సమకూడెను = కలిగెను, పొడచూపన్ = కనఁబడ.
  4. మథించినన్ = తరుపఁగా.