పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కర్త యైనగౌతముం జూచి కోపాటోపావేశితాధరుండును కలుషితతామ్ర
ఘూర్ణాయమానలోచనుండును నై యజ్ఞవాటంబు సొచ్చి వచ్చి నిద్రించుచున్న
యారాజుం జూచి నన్ను నుదాసీనంబు చేసినదోషంబున వీఁడు విదేహుఁ డగుఁ
గాకయని శపియించి ధిక్కరించి వీక్షించిన.[1]

340


క.

జననాథుఁడు మేల్కొని యా, మునినాథునిఁ జూచి కోపమున నిట్లను నే
మును నీయెడఁ జేసినత, ప్పు నిరూపింపక శపింపఁబోలునె నీకున్.

341


తే.

నిరపరాధుల శిష్యుల నిగ్రహించి, శాప మిచ్చిన గురుఁ డెంతశాంతుఁ డైన
వానియెడ భ క్తియుక్తులు వదలి శిష్యుఁ, డేమి సేసిన దోష మొకింతలేదు.

342


క.

కావున నిట్టి దురాత్ముఁడ, వీవును దేహంబు విడిచి హీనపువృత్తిన్
బోవుదు ననుచును గోపపుఁ, జేవను బ్రతిశాప మవ్వసిష్ఠున కిచ్చెన్.[2]

343


వ.

ఇట్లు శపియించి యారాజు శరీరంబు విడిచె వసిష్ఠుండును విగతదేహుండై
యాత్మీయతేజంబు యోగవిద్యాబలంబునం జేసి మిత్రావరుణులయందు నివే
దించి పదంపడి యూర్వశీదర్శనంబువలన మిశ్రావరుణులవీర్యంబులు స్ఖలితంబు
లైననిమిత్తంబున వసిష్ఠుండు దేహధారి యయ్యె నంత.[3]

344


తే.

నిమిశరీరంబు తైలగంధములచేతఁ, బాక మొందించి గౌతమప్రముఖమునులు
వేయిసంవత్సరంబులు విధివదుక్త, మార్గములు దప్పకుండ నమ్మఘము సేయ.[4]

345


చ.

సవనముఁ దీరఁజేయుదివసంబున నింద్రపురోగమాదితే
యవరులు యజ్ఞభాగములకై చనుదెంచిన వారికెంతయుం
బ్రవిమలతృప్తి సేయఁగ సుపర్వవరుల్ నిమికిన్ శరీర మీ
సవరణ యైనమాటలు' ప్రసంగము చేసిరి మౌనికోటితోన్.[5]

346


తే.

అప్పు డశరీరి యయ్యును నచట సంచ, రించుచున్నట్టి విభుఁడు నిలింపవరుల
తోడ నిట్లను నీదేహదుఃఖ మింక, నొల్లఁ దొల్లింటిదుఃఖంబు లెల్లఁ జాలు.

347


క.

దేహంబు దుఃఖహేతువు, దేహము రోగాస్పదంబు దేహంబు మహా
మోహాంధకారభూతము, దేహం బేమిటికిఁ గోరి దీనత నొందన్.

348
  1. తూష్ణీంకృతంబు = నిరాశ, కోపాటోపావేశితాధరుండు = కోపముయొక్క త్వరనుపొందిన పెదవులు గలవాఁడు - కోపాతిశయముచేత అదరుచున్న పెదవులు గలవాఁడు, కలుషితతామ్రఘూర్ణాయమానలోచనుండు = కోపము నొందుటచేత ఎఱ్ఱనై తిరుగుడుపడుచున్న కన్నులు గలవాఁడు, యజ్ఞవాటంబు = యజ్ఞశాలయందు, ఉదాసీనంబు = అలక్ష్యము, విదేహుండు = దేహము లేనివాఁడు.
  2. చేవను = బలముచేత - అతిశయముచేత ననుట.
  3. నివేదించి = ప్రవేశింపఁజేసి, స్ఖలితంబులైన = జాఱిన.
  4. పాకమొందించి = పరిపక్వము చేసి, విధివదుక్తమార్గములు = శాస్త్రప్రకారము చెప్పఁబడినరీతులను.
  5. సవరము = యజ్ఞము, ఇంద్రపురోగమాదితేయపరులు ఇంద్రుడు మొదలగు దేవతాశ్రేష్ఠులు, సుపర్వవరులు = దేవతాశ్రేష్ఠులు, ఈన్ = ఇచ్చుటకు, సవరణ = బాగు = అనుకూలము, ప్రసంగము చేసిరి = చెప్పిరి.