పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్భావ మెలర్పఁ గైకొని యపారకృపామహిమాభిరాముఁ డై.[1]

326


తే.

పఙ్క్తికంధరుతమ్మునిఁ బరమభాగ, వతు విభీషణుఁ దనకీర్తి వసుధఁ గలుగు
నంతకాలంబు లంకకు నధివుఁ జేసి, యయ్యయోధ్యాపురంబున కరుగుదెంచి.

327


మ.

జగదానందచరిత్రుఁ డై మెఱసి రాజ్యం బర్థిఁ బాలించుచో
నొగి గంధర్వుల మూఁడుకోట్ల భరతుం డుగ్రాజిలోఁ జంప దు
ష్టగణాఢ్యున్ మధుపుత్రకున్ లవణునిన్ శత్రుఘ్నుఁ డేపారి యా
శుగజాలంబులఁ జంపి యాతనిపురిన్ శోభిల్లఁ దా నేలఁగన్.[2]

328


వ.

ఇత్తెఱంగున బలపరాక్రమధుర్యులై రామలక్ష్మణభరతశత్రుఘ్నులు దుష్టనిగ్రహ
శిష్టప్రతిపాలనంబు సేయుచుఁ బదునొకండువేలసంవత్సరంబులు రాజ్యంబు
చేసి సుఖంబు లనుభవించుచు నంత్యంబునఁ గోసలరాజ్యంబునంగల నానావర్ణ
జనంబులతోడ దివంబునకుం జనిరి.

329


సీ.

రామచంద్రుఁడు సమగ్రశ్రీవిలాసులఁ గుశలవాఖ్యులఁ గాంచె విశదయశుల
లక్ష్మణుం డతులబలప్రతాపులఁ గాంచె నంగదచంద్రసేనాఖ్యసుతుల
భరతుండు రాజన్యవరుల నిద్దఱఁ గాంచెఁ బుత్రుల దక్షకపుష్కరులను
శత్రుఘ్నుఁ డొగిఁ గాంచెఁ జతురాత్ములను బాహుశూరసేనుల నంగసుతయుగంబు


తే.

వీర లెనమండ్రు జలరాశివేష్టితాఖి, లావనీచక్రమున హరిదష్టకమున
నాజ్ఞ వెలయంగ మెఱసి రాజ్యములు సేసి, రందుఁ గులకర్త యై మించె నాకుశుండు.[3]

330


వ.

అట్టికుశునకు నతిథియును వానికి నిషధుండును నిషధునకు నలుండును వానికి నభ
సుండును నభసునకుఁ బుండరీకుండును బుండరీకునకు క్షేమధన్వుండును వానికి
దేవానీకుండును వానికి నహీనుండును వానికిఁ బారియాత్రుండును నతనికి
దళుండును దళునకుఁ జలుండును చలునకు యుక్తుండును యుక్తునకు వజ్ర
నాభుండును వానికి శంఖణుండును వానికి నుషితాశ్వుండును వానికి విశ్వసఖుం
డును వానికి హిరణ్యనాభుండునుం గ్రమంబునఁ బుట్టి రాహిరణ్యనాభుండు.

331


తే.

అర్థి జైమినిమునిశిష్యుఁ డైనయాజ్ఞ, వల్క్యయోగీశ్వరునిచేత వాఁడు యోగ

  1. అనలార్చులన్ = నిప్పుమంటలచేత, సద్భావము = శ్రేష్ఠత్వము. ఎలర్పన్ = చిగుర్చఁగా - అతిశయింపఁగా.
  2. ఒగిన్ = పూనికతో, ఉగ్రాజిలోన్ = భయంకరమైన యుద్ధమునందు, ఏపారి = చెలరేఁగి, ఆశుగజాలంబులన్ = బాణసమూహములచేత.
  3. సమగ్రశ్రీవిలాసులన్ = సంపూర్ణమైనకలిమి గలవారిని, అతులబలప్రతాపులన్ = సరిపోల్పరానిశక్తియు తేజస్సుని గలవారిని, రాజన్యవరులన్ = క్షత్రియశ్రేష్ఠులను, చతురాత్ములన్ = చతురమైన మనసు గలవారిని, జలరాశివేష్టితాఖిలావనీచక్రమునన్ = సముద్రముచేత చుట్టఁబడిన సమస్తభూమండలమునందును, హరిదష్టకమునన్ = దిక్కు లెనిమిదింటియందును.