పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

గౌతమునిశాపదోషంబుకతన నడవి, యందుఁ బాషాణమైయున్న యయ్యహల్యఁ
దనపదాంగుష్ఠసంభూతధారుణీప, రాగదర్శనమునఁ బాపరహితఁ జేసె.[1]

319


చ.

జనకుఁడు మెచ్చఁగా హరునిచాపము రూపఱఁజేసి పెంపుతోఁ
దనభుజవీర్యశుల్కముకతంబున సీత నయోనిజాత నే
ర్పున వరియించి హైహయపురోగమరాజకులాంబుదప్రభం
జను జమదగ్నిసూనుభుజసత్వ మపాస్తము చేసె ధీరతన్.[2]

320


ఉ.

ఆతతరాజ్యవైభవవిహారసమంచిత మైనయీధరి
త్రీతల మేలనొల్లక ధృతిం దలిదండ్రులయాజ్ఞ యూఁది యా
సీతయు లక్ష్మణుండును భజింపఁగఁ గాననభూమియందు సం
ప్రీతిమెయిన్ వసించె మునిబృందము లెల్లను సంతసిల్లఁగన్.[3]

321


చ.

అనిమొనలో విరాధుఁ దెగటార్చి భయంకరవృత్తితోడ శూ
ర్పణఖను భంగపెట్టి పటుబాణములన్ ఖరదూషణాదిదై
త్యనికరముం జతుర్దశసహస్రరథంబుల మేటివీరులన్
దునిమి కబంధుఁ జంపి రిపుదుర్జయు వాలి నడంచె నర్థితోన్.[4]

322


క.

తపనజుఁ డగుసుగ్రీవునిఁ, గపిరాజ్యంబునకు రాజుఁగాఁ జేసి దశా
స్యుపురంబునఁ జెఱఁజిక్కిన, విపులాసుతఁ జూడఁ బ్లవగవిభు హనుమంతున్.[5]

323


వ.

పనిచి సీతావృత్తాంతంబు దెలిసి.

324


చ.

అలఘుమతిన్ మహావనచరావళి డెబ్బదిరెండువెల్లువల్
గొలువఁగ నేగి వారినిధిఁ గొండలచేతను గట్టి లంకపై
బలువిడి సేనతో విడిసి బాహుపరాక్రము లైనదైత్యులం
గలహములోఁ గులక్షయముగా నొనరించె మహానుభావుఁ డై.[6]

325


ఉ.

రావణకుంభకర్ణులశిరంబులు వజ్రసమానదారుణా
స్రావళి పాలు నేసి యనలార్చులఁ బావన యైనజానకీ
దేవి నశేషదేవగణదివ్యమునిస్తవనీయశీలస

  1. సంభూత = పుట్టిన.
  2. రూపఱఁ జేసి = స్వరూపనాశము చేసి - విఱిచి, శుల్కము = ఓలి, హైహయ...ప్రభంజనున్ = హేహయవంశస్థులు మొదలుగాఁగల రాజసమూహము లనెడు మేఘములను పడఁగొట్టుటయందు గొప్పగాలివంటివాఁ డైన, అపాస్తము చేసెను = అణఁచెను.
  3. ఊఁది = అవలంబించి, భజింపఁగన్ = సేవింపఁగా.
  4. తెగటార్చి = చంపి, రిపుదుర్జయున్ = శత్రువులకు జయింపరానివానిని, అడంచెన్ = చంపెను.
  5. తపనజుఁడు = సూర్యునికొడుకు, విపులాసుతన్ = భూపుత్రిని - సీతను, ప్లవగవిభున్ = వానరశ్రేష్ఠుని.
  6. వెల్లువలు = వాహనులు (వాహిని = 81 రథములు, 81 ఏనుఁగులు, 243 గుఱ్ఱములు, 405గురు పదాతులును గల సేన), బలువిడిన్ = అతిశౌర్యముతో.